మానికొండ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఏర్పాటు చేయాలి...

 మానికొండ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఏర్పాటు చేయాలి...


విజయవాడ (ప్రజా అమరావతి);

భారతీయ జర్నలిజం ఉద్యమ పితామహుడు,  జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ అవార్డు ను, నూతన రాజధాని అమరావతి లో  స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు విజ్ఞప్తి చేశారు.  సీనియర్ జర్నలిస్ట్ ఆకుల అమరయ్య రాసిన 'భారతీయ జర్నలిజం ధ్రువతార మానికొండ చలపతిరావు' పుస్తక ఆవిష్కరణ సభ బుధవారం విజయవాడ బుక్ ఫెస్టివల్ లోని చెరుకూరి రామోజీరావు వేదికపై ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ కే శరచ్చంద్ర జ్యోతి శ్రీ అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడిటర్ ఎం.సాగర్ కుమార్  తదితరులతో కలిసి కె రామకృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు‌ మాట్లాడుతూ... తెలుగువాడు, నేషనల్ హెరాల్డ్ పత్రికకు మూడు దశాబ్దాలపైగా సంపాదకుడిగా పనిచేసిన ఘనమైన వ్యక్తి మానికొండ చలపతిరావు అని కొనియాడారు. తెలుగింట పుట్టి ఇంగ్లీషు లో రాణించిన మానికొండ చలపతిరావు జర్నలిజం విలువలకు మారుపేరని కొనియాడారు. అటువంటి మహనీయుని పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక స్మారక చిహ్నం ఉండేలా చూడడం నిజమైన నివాళి అవుతుందని వక్తలు అన్నారు. శ్రీకాకుళం జిల్లా అంబకండి నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన మానికొండ ఢిల్లీలో ముగించారని, ఆంగ్ల జర్నలిజం లో ఆయనకు ఆయనే సాటిఅని చెప్పారు. మానికొండ జీవిత విశేషాలతో వచ్చిన ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు.  పద్మభూషణ్ అవార్డు లాంటి అత్యంత పురస్కారాలను సైతం ఆయన తిరస్కరించారని, అటువంటి నిస్వార్ధపరుడైన జర్నలిస్ట్ కావడం వల్లనే జర్నలిస్టులకు వేతన భద్రత, వేజ్ బోర్డు లాంటి హక్కులు దక్కాయని వక్తలు గుర్తు చేశారు.

 కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడిటర్ ఏం సాగర్ కుమార్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకట్రావు, సహకార భూమి సంపాదకుడు షేక్ అక్బర్ పాషా, అమరావతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ సతీష్,  అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పి. ఆనందం, ఏరువాక సంపాదకులు గారా రాఘవరావు, మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ ట్రస్టీ పోతుల హరికృష్ణ, బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు తదితరులు ప్రసంగించారు. 

చివరిలో పుస్తక రచయిత అమరయ్య మాట్లాడుతూ

ఈ పుస్తక రచనలో తన అనుభవాలను వివరించారు.

Comments