ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న మంత్రి లోకేష్.

 *ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న మంత్రి లోకేష్*



*53వ రోజు ప్రజాదర్బార్ కు విన్నపాల వెల్లువ*


*బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి భరోసా*


ఉండవల్లి (ప్రజా అమరావతి );ప్రజా సమస్యల పరిష్కారంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 53వ రోజు మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి అర్జీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.


*రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు*


*ఇంటిని కోల్పోయాను.. పరిహారం అందించండి*


- వంశధార ప్రాజెక్టు కింద కోల్పోయిన తన ఇంటికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా, హిరమండలం కొల్లివలస గ్రామానికి చెందిన భవిరి సింహాచలం మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోవడంతో ఆధారం లేక భార్య, నలుగురు పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పరిహారం అందించాలని రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదు చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

- టిడ్కో ఇంటి కోసం నగదు చెల్లించినప్పటికీ అలాట్ మెంట్ అయిన ఇంటిని మంజూరు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్ రేష్మా ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు టిడ్కో ఇల్లు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ ను కలిసి అర్జీ ఇచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

- పసుపు కుంకుమ కింద తనకు సంక్రమించిన భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయడంతో పాటు పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం, మిట్టపాలెం గ్రామానికి చెందిన కొమ్మినేని చిన్న వెంకటరమణమ్మ విజ్ఞప్తి చేశారు. నా తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద 3.27 ఎకరాలను స్థిరాస్తి సెటిల్ మెంట్ స్వాధీన అగ్రిమెంట్ ద్వారా రాయించి ఇచ్చారు. వృద్ధాప్యంతో నా తల్లిదండ్రులు చనిపోయారు. సదరు భూమి నాకు సంక్రమించినప్పటికీ ఆన్ లైన్ లో వారి పేరు మీదనే ఉండటంతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సీడీలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

- తమ గ్రామంలో గత ఎనిమిదేళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వెంకటాపురానికి చెందిన జంపాల రామారావు మంత్రి నారా లోకేష్ ను కలిసి అర్జీ ఇచ్చారు. ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే జలజీవన్ మిషన్ కింద పనులు ప్రారంభించినప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ శివారులోని పెదవాగు మీద ఉన్న ఆర్ అండ్ బి బ్రిడ్జ్ ను కూడా విస్తరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

- నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని తన 28 అంకణాల స్థలాన్ని నెల్లూరు జిల్లా వాసి ఆరుగుంట శ్రీనివాసులురెడ్డి కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని పున్నూరు రాఘవయ్య మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతం అయ్యారు. 1994లో ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశాను. నా స్థలం పక్కనే వినుకోటి సుబ్బారాయుడు స్థలం ఉంది. అతడు తన స్థలంతో పాటు నా స్థలాన్ని కూడా ఆరుగుంట శ్రీనివాసులురెడ్డికి విక్రయించాడు. నా స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ప్రహరీ గోడ కూడా నిర్మించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని రాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.


పెన్షన్ అందించడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగులు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయం అందించాలని పలువురు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. పరిశీలించి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Comments