ఆర్టీసీ హౌస్ లో రేనాటి యుద్ధ వీరుడు శ్రీ వడ్డే ఓబన్న జయంతి వేడుకలు.

 విజయవాడ (ప్రజా అమరావతి);



ఆర్టీసీ హౌస్ లో రేనాటి యుద్ధ వీరుడు శ్రీ వడ్డే ఓబన్న   జయంతి వేడుకలు


ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్టీసీ హౌస్ లో రేనాటి యుద్ధ వీరుడు శ్రీ ఓబన్న 218 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ జి. విజయరత్నం ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, ఓబన్న చిత్ర పటానికి పూల మాల వేసి  నివాళులు అర్పించారు. 

అనంతరం డిప్యూటి సి.పి.ఎం.(హెచ్.ఆర్.డి.) కుమారి సాంబ్రాజ్యం, సెక్యూరిటీ  ఆఫీసర్ శ్రీ మధు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ శ్రీ మధు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు,ఉద్యోగులు శ్రీ ఓబన్న కి  పూలతో నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ విజయరత్నం మాట్లాడుతూ రేనాటి ప్రాంత యుద్ధ వీరుడు, యోధుడు శ్రీ ఓబన్న గొప్పతనం అందరూ తెలుసుకోవాలని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటీషు వారి పాలనకు ఎదురుతిరిగిన శ్రీ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ముఖ్య అనుచరుడుగా చరిత్రలో నిలిచిన  ఆ వీరుని చరిత ఈ సందర్భంగా గుర్తు చేసుకుని నివాళి అర్పించడం మన స్వాతంత్ర్య వీరులకు మనమిచ్చే గౌరవంగా భావించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య సమరవీరులకు ప్రాధాన్యత ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మన రాష్ట్రానికే కాకుండా తెలుగు వారికి గర్వకారణమని తెలిపారు. అంతేకాకుండా శ్రీ ఓబన్న జీవించిన కడప, తదితర  ప్రాంతాలలో ఉద్యోగరీత్యా తాను కూడా పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను మనం మారుతున్న సాంకేతికతతో తెలుసుకోగలుగుతున్నామని, గూగుల్ సెర్చ్, యూ ట్యూబ్స్ వంటి తదితర సోషల్ మీడియాల సహకారంతో ఎందరో మహనీయుల, స్వాతంత్ర్య సమరవీరుల, యుద్ధ వీరుల చరిత్రలు మనకు గొప్ప సందేశాలు ఇస్తున్నాయని వివరించారు. ఈ విధంగా కనుమరుగైపోయిన ఎందరో యుద్ధ వీరుల గాధలు తెలుసుకోవడం వలన చైతన్యం రావడమే కాకుండా మన యొక్క చరిత్ర ప్రపంచానికి కూడా తెలుస్తుందని తెలిపారు. 

రేనాటి ప్రాంతంలో భయం తెలియని వడ్డెరలు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతమైన నాయకత్వంతో నడిపించి, దట్టమైన అటవీ ప్రాంతంలో బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడంలో ముఖ్య పాత్ర పోషించిన 19 వ శతాబ్దం నాటి ధైర్య శాలి శ్రీ వడ్డే ఓబన్న చరిత్రని ఈ రోజు ఇలా గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.      

డిప్యూటి సి.పి.ఎం.(హెచ్.ఆర్.డి.) కుమారి సాంబ్రాజ్యం మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొని, శ్రీ ఓబన్న  జీవిత విశేషాలను విపులంగా వివరించారు. బ్రిటీషు వారి నిరంకుశ పాలనకు ఎదురుతిరిగి నిలబడిన ఆనాటి తెలుగు బిడ్డ, రేనాటి సూర్యుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడైన శ్రీ ఓబన్న ధీరుడు,శూరుడు అని కొనియాడారు. పాలెగాళ్ల కి అండగా నిలబడి వారి కుటుంబాల కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాటం జరిపిన ధైర్యశాలి శ్రీ ఓబన్న అని తెలిపారు. ఈ రోజు స్వాతంత్ర్యం పొంది ఇలా స్వేచ్చగా జీవిస్తున్నామంటే ఆనాడు అలాంటి ఎందరో మహావీరులు ప్రాణాలకు తెగించి పోరాటం జరపడం వలనే అనే విషయం మనమంతా గుర్తుంచుకోవాలని వివరించారు.    

ఈ కార్యక్రమంలో పి.ఓ.(హెచ్.ఆర్.డి.) శ్రీమతి మాణిక్యం, ఆర్టీసీ హౌస్ ఉన్నతాధికారులు, హెచ్.ఓ.డి.లు, సూపర్వైజర్లు,  వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఆఫీసు సిబ్బంది,  విజిలెన్స్ సిబ్బంది,  ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పి.ఎన్.బి.ఎస్. బస్ స్టేషన్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Comments