బస్టాండ్లలోని చివరి ప్రయాణికుణ్ణి సైతం విడిచి వెళ్లొద్దు -
శ్రీ కొనకళ్ళ నారాయణ రావు, ఛైర్మన్
విజయవాడ (ప్రజా అమరావతి);
సంక్రాంతి పండుగ సమయంలో బస్టాండ్లలో వేచి ఉండే ఏ ఒక్క చివరి ప్రయాణికుణ్ణి సైతం విడిచి వెళ్లొద్దని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ రావు పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై విజయవాడ జోన్ ఉన్నతాధికారులతో తేదీ 10.01.2025 న ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సంస్థ ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ రావు పాల్గొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికీ క్రాంతి నింపాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి స్వంత ఊర్లకు చేరుకునే ప్రయాణికులకి ఏ విధమైన ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ జి. విజయరత్నం, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఎం. వై. దానం పాల్గొన్నారు.
హైదరాబాదులో ఉండి సంక్రాంతి రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ అప్పల రాజుతో ఫోనులో మాట్లాడి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైవర్లు హైదరాబాద్ నుండి వచ్చే/ వెళ్ళే దారిలో రోడ్డు డివైడింగ్ గమనించి జాగ్రత్తగా బస్సులని జాగ్రత్తగా నడపాలని, ప్రమాదాల బారిన పడకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు.
అంతేకాకుండా ముఖ్యమైన ఈ క్రింది అంశాలపై సమీక్ష నిర్వహించారు.
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సిబ్బంది, అధికారులు బస్టాండ్ లలో ప్రత్యేక విధులకి హాజరై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.
ప్రయాణీకుల కోసం కల్పించిన ముందస్తు రిజర్వేషన్ స్థితిని, పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలన చేసుకుంటూ, అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విజయవాడ మరియు ఇతర ప్రధాన ముఖ్య బస్ స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీనీ తగ్గించే విధంగా కృషి చేసి చివరి ప్రయాణికుడిని సైతం వదలకుండా గమ్యస్థానం చేర్చేలా ప్రయత్నించాలన్నారు.
అవసరమైతే అదనపు బస్సులని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని, బస్ స్టేషన్ల పరిధిలో ఏ ఇతర ప్రైవేటు వాహనాలు నిలపకుండా చూడాలన్నారు.
పోలీసు వారి సహకారంతో ప్రైవేటు వాహన దారులు ప్రయాణీకులపై చేసే దోపిడిని నివారించాలని తెలిపారు.
ప్రయాణీకుల లగేజిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, బస్ స్టేషన్ల వద్ద ఆర్టీసీ కానిస్టేబుళ్లని పెంచి భద్రత పెంచాలన్నారు.
ముఖ్యంగా డ్రైవర్లు క్రమశిక్షణతో డ్యూటీ చేసేలా వారికి తగు సూచనలు ఇవ్వాలని, ప్రయాణీకుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుని వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా జాగ్రత్తలు, సూచనలు చేయాలన్నారు.
శీతాకాలం సమయం కాబట్టి పొగ మంచు కారణంగా ముఖ్యంగా డ్రైవర్లు రోడ్డుని గమనిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా బస్సులని నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రద్దీని బట్టి అవసరమైన యెడల అద్దె బస్సులని అదనపు ట్రిప్పులు పెంచి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
బస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని తెలిపారు.
బస్సుల సమయ వివరాలు, అదనపు బస్సుల ఏర్పాట్లు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా అధికారులు ప్రయత్నించాలని అదే విధంగా రవాణా, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో బస్సులను నడపాలన్నారు.
కాగా, ఎన్టీఆర్ జిల్లా లోని వివిధ ప్రాంతాలకు సంక్రాంతి ముందు, తర్వాతి రోజులలో 20 వ తేదీ వరకు హైదరాబాద్ కి 621 బస్సులు, రాజమండ్రికి 235 బస్సులు, విశాఖపట్నం 122, బెంగళూరు 37, చెన్నై 27, ఇతర ప్రాంతాలకు 328 బస్సులు మొత్తం కలిపి 1370 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు శ్రీ కొనకళ్ళ నారాయణ రావు తెలిపారు.
.
addComments
Post a Comment