వేగంగా ధాన్యం సేకరణ.

 


*వేగంగా ధాన్యం సేకరణ


*


*గత ప్రభుత్వం కన్నా రెట్టింపు స్థాయిలో కొనుగోళ్లు*


*గత ఏడాది ఇదే సమయానికి 12.55 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే.. ఈ ఏడాది 21.04 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు*


*గత ప్రభుత్వంలో కొన్న ధాన్యానికి డబ్బులివ్వకుండా రైతులకు వేధింపులు*


*93 శాతం మంది రైతులకు 24 గంటల్లోనే డబ్బులు జమ*


*త్వరలో అందుబాటులోకి సైలోస్ సిస్టమ్*


*ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు*


*రైతులకు నచ్చిన మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చు*


*గంగూరు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*


పెనమలూరు/గంగూరు (ప్రజా అమరావతి):- ‘రాష్ట్రంలో ధాన్యం సేకరణ చాలా వేగంగా జరుగుతోంది. రైతుల నుండి సకాలంలో పౌరసరఫరా శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇదే సమయానికి 12.55 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే...నేడు మా ప్రభుత్వంలో ఇప్పటికే 21,04,233 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. రాష్ట్రంలో 3,20,703 మంది రైతుల నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేశాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పెనమలూరు నియోజకవర్గం, గంగూరులో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. రైస్ మిల్లులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...‘‘గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా వేధించడంతో రైతాంగం బాగా నష్టపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలు చేసిన కేవలం 48 గంటల్లోనే రైతులకు డబ్బు చెల్లిస్తున్నాం. 93 శాతం మంది రైతులకు 24 గంటల్లోపే చెల్లించాం. రైతుల నుండి ధాన్యం కొన్నందుకు రూ.4,730 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ధాన్యంలో తేమ శాతంలో తేడాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. గోతాల్లో నింపిన గింజలు తేమ శాతం పేరుతో వెనక్కి రాకూడదు.’ అని అన్నారు.   


*సైలోస్ సిస్టంతో అధిక లాభం*


‘ధాన్యంలో తేమ శాతం తగ్గించేందుకు వివిధ ప్రాంతాల్లో డ్రైయర్స్ కూడా పెట్టాం. సేకరించిన ధాన్యంలో కేవలం 23 శాతం ధాన్యం మాత్రమే డ్రైయర్స్ ద్వారా ఆరబెడుతున్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తప్పకుండా తీసుకుంటాం. గతంలో కంటే రైతులు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులే చెప్తున్నారు. గత ప్రభుత్వం సరిగా ధాన్యం కొనుగోలు చేయలేదు... చేసినా సమయానికి డబ్బులు ఇవ్వేలేదు. త్వరలో సైలోస్ సిస్టమ్‌ కూడా రైతులకు అందుబాటులోకి తీసుకుని రావాలని చూస్తున్నాము. సైలోస్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే రైతులు కావాల్సిన సమయంలో పంటను అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీంతో నిల్వ పెట్టిన ధాన్యానికి ఎక్కువ రేటు వస్తుంది. ఎంటీయూ 1262 గత ఏడాది కృష్ణా జిల్లాలో 3,582 మెట్రిక్ టన్నులు దిగుబడి ఇస్తే.. ఈ ఏడాది 32,859 మెట్రిక్ టన్నులు దిగుబడిని ఇచ్చింది. ఇతర జిల్లాల్లోనూ ఈ పంట దిగుబడి ఎక్కువగా ఉంది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  


*ఆకస్మిక తనిఖీలు ఉంటాయి*


‘సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. వినియోగదారుల అవసరాల మేరకు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తాం. పురుగు మందుల వాడకం కూడా తగ్గించాలి. దీని ద్వారా కూడా రైతులకు మంచి ధర లభిస్తుంది.  డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ ఎక్కువవుతోంది. గతంలో తుఫాన్ సమయంలో పంట చేతికి వచ్చినా సరే పొలాల్లో ఉండిపోయేది. దీంతో పంట కుళ్లిపోయేది. పంట పొలాల్లో నీరు నిల్వ లేకుండా అధికారులు చూడాలి. రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తాను. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను. భవిష్యత్తులో ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తా. రైతులు ఏ మిల్లులో ధాన్యం అమ్ముకోవాలనుకుంటే ఆ రైస్ మిల్లులో అమ్ముకోవచ్చు. రైతు అనుకూలతను బట్టి తానే ఎంచుకునే సదుపాయం కల్పిస్తాము. దళారీ వ్యవస్థపై కచ్చితమైన చర్యలుంటాయి. దళారీ వ్యవస్థ ఉండేందుకు వీళ్లేదు. గోనె సంచులు ఎక్కడ నుంచి వెళ్లాయో అనే దానిపై కచ్చితంగా ఉంటాం. బియ్యం అక్రమ రవాణాను అరికడతాం. బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ విషయంలో కఠినంగా ఉంటాం’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.


Comments