క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేట‌ర్ (తెలుగు) నియామ‌కo.

 

 విశాఖపట్నం (ప్రజా అమరావతి);




ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేట‌ర్ (Casual Newsreader cum Translator), క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ (Casual Broadcast Assistant) గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి  శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామ‌కాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావ‌ని, పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్ప‌ష్టం చేశారు. 

క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేట‌ర్ (తెలుగు) నియామ‌కానికి అభ్య‌ర్థుల‌కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు, తెలుగు, ఆంగ్ల  భాషల్లో ప్రావీణ్యం, ఆంగ్లం నుంచి తెలుగులో తర్జుమా చేయగల నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే  రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని, తెలుగు టైపింగ్ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు.  

అదేవిధంగా క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ నియామ‌కానికి అభ్య‌ర్థుల‌కు రెడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలని, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. అలాగే ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్లో అనుభవం ఉండాలని సూచించారు. 

21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి, విశాఖపట్నం ప్రాంతంలో నివసించే వారు అర్హుల‌ని అన్నారు. క్యాజువల్ విధానంలో నియ‌మింప‌బ‌డిన వారికి అసైన్ మెంట్ ప్రాతిప‌దిక‌న విధుల కేటాయింపు  ఉంటుంద‌ని, వారికి వార్తా విభాగం అవ‌స‌రాల‌కు అనుగుణంగా నెల‌లో 1 నుంచి 6 వ‌ర‌కూ అసైన్‌మెంట్ల‌ను కేటాయించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. 

ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన జనరల్ క్యాటగిరీ అభ్య‌ర్థులు Rs. 354/-, ఎస్.సి, ఎస్.టి, బి.సి క్యాటగిరీ అభ్యర్థులు Rs.266/-  ద‌ర‌ఖాస్తు రుసుమును “Account Name: Prasara Bharati BCI AIR VSP; Account No: 10428603125; IFSC Code: SBIN0000772; SBI AU Campus Branch” బ్యాంక్ అకౌంట్ కు చెల్లించి, చెల్లింపు ర‌సీదును దరఖాస్తుతో  జత చేసి 05.11.2024 లోగా “The Head of Office, Akashvani, Siripuram, Visakhapatnam – 530003” చిరునామాకు పంపించాల‌ని కోరారు.  దరఖాస్తు కవరు పై భాగంలో “Application for RNU” అని తప్పనిసరిగా రాయాలని, వివ‌రాల కోసం 0891-2522020, 9440674057 నెంబ‌ర్ల‌ను  సంప్రదించాల‌ని సూచించారు.


Comments