డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న సెటిల్ మెంట్ చిత్రం _ చిత్ర దర్శకుడు శ్రీనివాస యాదవ్ వెల్లడి.

 డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న సెటిల్ మెంట్ చిత్రం

_ చిత్ర దర్శకుడు శ్రీనివాస యాదవ్ వెల్లడి


తెనాలి (ప్రజా అమరావతి):  నిబద్ధత గల జర్నలిస్ట్ కథతో విన్నూత్న అంశాలతో తెరకెక్కనున్న సెటిల్ మెంట్ చిత్రం డిసెంబర్ నెల నుంచి సెట్స్ పైకి వెళుతుందని చిత్ర దర్శకుడు అచ్చన శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంగళవారం  తెనాలి విచ్చేసిన ఆయన పాత్రికేయులతో తన చిత్రానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'చిలక్కొట్టుడు'తో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత 13 సినిమాలకు వివిధ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా,  కో-డైరెక్టర్ గా పనిచేసి, 'ఫ్రెండ్స్ కాలనీ'తో దర్శకుడిగా మారారు. కొద్ది కాలంగా సినిమాలను పక్కన పెట్టి బుల్లితెర పై సీరియల్స్ కు క్రియేటివ్ హెడ్, కొన్ని పాపులర్ బ్రాండ్లకు యాడ్ ఫిల్మ్ మేకర్ గా పని చేశారు. తాజాగా 'సెటిల్ మెంట్'  పేరుతో పూర్తి, కమర్షియల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే. 

నేను కొద్ది  సంవత్సరాలుగా టీవీ సీరియల్స్, ప్రముఖ బ్రాండ్ కోసం యాడ్ ఫిల్మ్స్ లను తీస్తున్నాను. కానీ సినిమా మాత్రం నాలోంచి దూరం కాలేదు. మంచి కథను సిద్ధం చేసుకున్నాను. జర్నలిస్ట్  జీవితం నేపథ్యంలో సాగే కథను తీసుకుని..  మళ్ళీ మెగా ఫోన్ పట్టి డిసెంబర్ లో సెట్స్ పైకి వెళుతున్నాను. సెటిల్ మెంట్ ఆనే టైటిల్ కి, జర్నలిస్టులకి ముడిపెట్టి.ఎవర్నో కించపరుస్తున్నానని అనుకోకండి.

జర్నలిస్ట్ లపై నాకు గౌరవం వుంది. నా కెరీర్ కూడా జర్నలిస్టుగానే మొదలైంది. నిజమైన జర్నలిజానికి కట్టుబడిన జర్నలిస్ట్ పెన్ను గన్ను కన్నా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ చిత్రం లో చూపించబోతున్నాను.

ఈ సినిమాని ఎస్వీ ఎన్ ఫిలిం ఫ్యాక్టరీ అని ముంబాయి  బేస్ట్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. మొదట చిన్న సినిమాగా అనుకున్నాం కానీ మా నిర్మాతలకు కథ బాగా నచ్చడంతో  భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా స్థాయిలో సినిమా వుండాలని కోరడం తో బడ్జెట్ ననుసరించి కథను విస్తరించడం వంటి కొన్ని మార్పులవల్ల సెట్స్ పైకి వెళ్ళడం కొంత సమయం పట్టింది. హీరోగా కన్నడంలో వరుసగా మూడు సూపర్ హిట్లు ఇచ్చిన  వివేక్ హీరోగా చేస్తున్నాడు. సాంగ్స్ కూడా రికార్డింగ్ పూర్తయ్యింది. సంగీత దర్శకుడు వెంకట్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే స్క్రీన్ ప్లే, మాటలు శేషభట్టర్ వేంకట రమణ రాశారు. మాటలు తూటాల్లా ఉంటాయి. హైదరాబాద్, బెంగుళూరుల్లో షెడ్యూల్స్ జరుగుతాయి. ఇక నుంచి నేను సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.

Comments