*జలవనరుల శాఖపై అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*
*రాష్ట్ర ప్రభుత్వ వాటర్ పాలసీ, గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంపై చర్చ*
*నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీరు.*
*ఆర్థిక సమస్యలు, సవాళ్లు ఉన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ముందుకుపోతాం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*
అమరావతి (ప్రజా అమరావతి):- రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారా...వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటితో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని సీఎం అభిప్రాయ పడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం పూర్తిచేసి లక్షల ఎకరాల సాగునీటి అవసరాలు తీర్చామని సీఎం అన్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా......నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చెప్పారు. ఇందులో భాగంగానే గోదావరి-కృష్ణ-పెన్నా నదుల అనుసంధానంపై దృష్టిపెట్టినట్లు సిఎం తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్లేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని....ఇప్పుడు ఆ ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా సిఎం సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు గోదావరి-కృష్ణ-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి ముందు ఉంచారు. గోదావరి-కృష్ణ-పెన్నా నదుల అనుసంధానంపై వివిధ ప్రతిపాదనలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నీటిని పోలవరం నుంచి కృష్ణా నదికి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కు, అక్కడి నుంచి బనకచర్లకు తరలించే ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. రెండో ప్రతిపాదన కింద....పోలవరం నుంచి కృష్ణానదికి, అక్కడి నుంచి బొల్లాపల్లికి, అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్చించారు. ఎక్కువ మొత్తంలో గోదావరి నీటిని తీసుకునేందుకు పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం కోసం విస్తరణ చేపట్టాలా లేక కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వాలా అనే అంశంపైనా చర్చంచారు. రెండు ప్రతిపాదనల్లో దేని ద్వారా అయితే సత్వర ఫలితాలు వస్తాయి....దేనికి తక్కువ ఖర్చు అవుతుందనే అంశాలపైనా అధికారులు ప్రాధమిక వివరాలు తెలిపారు. మూడు నదుల అనుసంధానంతో పాటు....పోలవరం కాలువ సామర్థ్యం పెంపుపై మరింత కసరత్తు చేయాలని సిఎం సూచించారు. ఆర్థికంగా ఇదొక పెద్ద సవాల్ అయినా....రైతాంగ అవసరాలను, రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనలో తాను ఉన్నట్లు సిఎం తెలిపారు.
అనంతరం....పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పునరావాసం కోసం ఇంకా 18,925 ఇళ్లు నిర్మించాల్సి ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2022 నుంచి పోలవరం పునరావాస కాలనీల్లో అన్ని నిర్మాణాలను కాంట్రాక్టర్లు నిలిపివేసినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం ఆ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులే రూ.155 కోట్లు వరకు ఉన్నాయని తెలిపారు. పాత రేట్లతో ఇప్పుడు పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెపుతున్నారని అధికారులు వివరించారు. దీనిపై చర్చించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. తిరిగి పోలవరం పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో.....భూసేకరణ, పునరావాసం పనులు కూడా సమాంతరంగా చేపట్టాలని సిఎం సూచించారు. వీటికి తక్షణ అవసరాల కింద రూ.2,600 కోట్లు అవసరమని అధికారులు తెలపగా..దీనిపై త్వరలో ఆదేశాలు ఇస్తానని సిఎం తెలిపారు. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణంపై ప్రాజెక్టు వద్ద జరిగిన వర్క్ షాప్ లో వచ్చిన అభిప్రాయాలు, నిర్ణయాలను అధికారులు సిఎంకు వివరించారు. పోలవరం పనుల షెడ్యూల్ పై పూర్తి స్థాయి స్పష్టత వచ్చిన తరువాత తాను పోలవరం ప్రాజెక్టును సందర్శించి...అక్కడే పనులపై షెడ్యూల్ ప్రకటిస్తానని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న వాటర్ పాలసీపైనా సమీక్షలో చర్చ జరిగింది. మరికొంత కసరత్తు తర్వాత దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ సమీక్షలో జనవనరుల శాఖా మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment