పదికాలాలు నిలిచేలా కోర్టు భవనాల నిర్మాణం జరగాలి
న్యాయవాదులు కమిటీగా ఏర్పడి భవనాల నిర్మాణంపై బాధ్యత తీసుకోవాలి
బార్ అసోసియేషన్ ఐక్యత, పట్టుదల, సంకల్పం వల్లే నూతన కోర్టు భవనాల మంజూరు
సకాలంలో భవనాల నిర్మాణం పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలి
నిర్మాణం పూర్తయ్యాక జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి
యువ న్యాయవాదులే భవనాల నిర్వహణ బాధ్యత తీసుకోవాలి
కృతజ్ఞత సత్కార సభలో హైకోర్టు న్యాయమూర్తుల సూచన
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హాజరైన న్యాయవాద సంఘాల ప్రతినిధులు
పదిమంది హైకోర్టు న్యాయమూర్తులను సత్కరించిన బార్ అసోసియేషన్లు
విజయనగరం, నవంబరు 10 (ప్రజా అమరావతి):
రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ లేనివిధంగా విజయనగరం జిల్లా కోర్టుకు ఆధునిక వసతులతో కూడిన నూతన భవన సముదాయం మంజూరయ్యాయని, సుదీర్ఘకాలం పాటు నిలిచేలా భవన నిర్మాణం సమయంలోనే న్యాయవాదులు బాధ్యత తీసుకోవాలని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు సూచించారు. ముఖ్యంగా యువ న్యాయవాదులే ఈ భవనాల్లో న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేయనున్నందున వారిపైనే భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యత అధికంగా వుంటుందన్నారు. విజయనగరం బార్ అసోసియేషన్ చూపిన ఐక్యత, పట్టుదల, సంకల్పంతోనే నూతన భవనాల మంజూరు సాకారమయ్యిందని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిలుగా తమ వంతు పాత్రను నిర్వర్తించామని, ఈ భవనాల కోసం ప్రత్యేకంగా ఏవిధమైన ప్రయత్నాలు చేయలేదని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. రాష్ట్రానికి న్యాయమూర్తులను అందించడంలో విజయనగరం ముందంజలో వుందన్నారు.
విజయనగరం జిల్లా కోర్టు నూతన భవన సముదాయం నిర్మాణానికి రూ.100 కోట్లతో మంజూరు చేసిన నేపథ్యంలో ఈ జిల్లాకు గతంలో అడ్మినిస్ట్రేటివ్ జడ్జిలుగా పనిచేసిన పలువురు న్యాయమూర్తులకు, జిల్లా వాసులైన హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృతజ్ఞత పూర్వక అభినందన సభ ఆదివారం నగరంలోని రింగురోడ్డులో గల ఒక ఫంక్షన్ హాలులో నిర్వహించారు. జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దోనాడి రమేష్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ కె.మన్మధరావు, జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ కె.సురేష్‌రెడ్డి తదితరులను శాలువ, మొమెంటోతో విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల బార్ అసోసియేషన్ల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ వదిలివేయబడిన చెరువులో తేలికపాటి మట్టితో కూడిన నేలపై నిర్మించిన కారణంగానే గతంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన కోర్టు భవనాలు దెబ్బతిన్నాయని చెప్పారు. జిల్లా బార్ అసోసియేషన్ ధృడ సంకల్పంవల్లే ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా కార్యరూపం దాల్చిందన్నారు. బార్ సభ్యుల కృషికి తన తోటి హైకోర్టు న్యాయమూర్తుల సహకారం లభించడంతోపాటు, జిల్లా వాసిగా సొంత జిల్లాకు న్యాయవ్యవస్థ పరిధిలో ఏదైనా చేయాలనే తన తపన తోడై భవనాల మంజూరు త్వరగా సాకారమైందన్నారు. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా న్యాయవ్యవస్థకు మౌళిక వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే నిర్ణయించిందని దెబ్బతిన్న పాత కోర్టు భవనాల స్థానంలో ఆధునిక వసతులతో కొత్తవి మంజూరు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. భవనాల నిర్మాణం నిర్ణీత సమయానికి పూర్తి కావాలంటే నిర్మాణ సంస్థతో పాటు బార్ అసోసియేషన్ కూడా బాధ్యత తీసుకోవలసి వుందన్నారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మాట్లాడుతూ భవన నిర్మాణం నాణ్యతగా జరిగేలా యువ న్యాయవాదులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. భవనం నిర్మించాక తగిన విధంగా నిర్వహిస్తేనే ఇది పదికాలాల పాటు నిలుస్తుందన్నారు. తన తండ్రి, తాతలకు విజయనగరంతో సంబంధ వుందని, తాను యీ మట్టి నుంచి వచ్చినవాడినని పేర్కొన్నారు. చీమలపాటి రవితోపాటు ఆయన తండ్రి, సీనియర్ న్యాయవాది శ్రీరామమూర్తిని కూడా కలసి సత్కరించారు.
యువ న్యాయవాదులకు నూతన కోర్టు భవనం ఒక దేవాలయం, విద్యాలయం వంటిదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య అన్నారు. యువ న్యాయవాదులంతా తమ వృత్తిలో బాగా రాణించాలని ఆకాంక్షించారు. సీనియర్ సభ్యుల విజయగాధలు తెలుసుకొంటూ విజయపథంలోకి వెళ్లాలన్నారు. రాష్ట్రానికి న్యాయాధికారులను అందించడంలో యీ జిల్లా ముందువరసలో వుందని పేర్కొన్నారు. న్యాయవాదులు సమిష్టిగా బాధ్యత తీసుకొని భవనం నిర్వహణపై శ్రద్ధ తీసుకుంటే భవనం జీవితకాలం పెరుగుతుందన్నారు.
కొన్ని వందల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న యీ భవనాన్ని పరిరక్షించుకొనే బాధ్యత న్యాయవాదులపైనే వుంటుందని జస్టిస్ కె.మన్మధరావు చెప్పారు. జిల్లా కోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది, సాహిత్యవేత్త ఎస్.ఎస్.ఎస్.ఎస్.రాజు తాను రచించిన దేవునితో కాసేపు పుస్తకాన్ని చదివానని పేర్కొంటూ అదో గొప్ప పుస్తకంగా అభివర్ణించారు. ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, మాతృదేవోభవతోపాటు ప్రకృతి దేవోభవ అనేది కూడా చేర్చుకోవాలన్నారు.
జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు మాట్లాడుతూ కోర్టు భవనాల నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు తన వంతుగా కృషిచేస్తానని చెప్పారు.
న్యాయమూర్తులను గౌరవించడంలో, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటంలో యీ జిల్లా ఎప్పుడూ ముందంజలోనే నిలుస్తోందని జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. మర్యాదలు, మన్ననలు, చక్కటి సంంబంధ బాంధవ్యాలు నిర్వహించడంలో యీ జిల్లా వాసుల ప్రత్యేకత అని చెప్పారు.
బార్ అసోసియేషన్ లో వున్న ఐక్యత, పట్టుదల, సంకల్పంతోనే కొత్త భవనాల మంజూరు సాధ్యమైందని జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం జిల్లా కోర్టు నిర్వహిస్తున్న భవనాలను కోర్టు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. వ్యవస్థల పట్ల వారికి గల గౌరవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్జి సాయికళ్యాణ్ చక్రవర్తి, బార్ అసోసియేషన్ అద్యక్షుడు ఏ.హరీష్, న్యాయవాది కె.వి.ఎన్.తమ్మన్నశెట్టి తదితరులు కూడా మాట్లాడారు.
జిల్లా కోర్టు నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తిచేసేందుకు జిల్లా యంత్రంగం తరపున తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంంబేద్కర్, జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విజయనగరం జిల్లా విశిష్టతలు, ఇక్కడి ప్రముఖులతో కూడిన స్వల్ప నిడివి గల చిత్రాన్ని ప్రదర్శించారు. జిల్లా కోర్టు భవన నిర్మాణ విశేషాలతో కూడిన మరో చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు.
addComments
Post a Comment