ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ఫథకం - పైలెట్ ప్రాజెక్టు
1. భారతీయ యువత కోసం, 2024-25 బడ్జెట్‌లో, దేశంలోని అగ్రగామి సంస్థల్లో "ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం"ను (స్కీమ్) ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా, ఐదేళ్లలో, దేశంలోని అగ్రశ్రేణి-500 కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా, విభిన్న వృత్తులు & ఉపాధి రంగాల్లో వాస్తవ వ్యాపార వాతావరణాన్ని తెలుసుకునే అవకాశం యువతకు లభిస్తుంది.
2. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమల్లో భాగంగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఒక పైలట్ ప్రాజెక్టును 03 అక్టోబర్ 2024న ప్రారంభించారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ పోర్టల్ www.pminternship.mca.gov.in ద్వారా ద్వారా ఇది అమలవుతుంది. ఈ పోర్టల్ మొత్తం ఇంటర్న్‌షిప్ పథకానికి కేంద్ర వేదికగా పనిచేస్తుంది. ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించే భాగస్వామ్య సంస్థలు నమోదు చేసుకునేందుకు ఈ పోర్టల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అక్టోబర్ రెండో వారంలో అభ్యర్థుల నమోదు కోసం అందుబాటులోకి వస్తుంది.
3. భాగస్వామ్య సంస్థలు
3.1 గత మూడు సంవత్సరాల సగటు 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' (సీఎస్‌ఆర్) వ్యయం ఆధారంగా ఈ పైలట్ ప్రాజెక్టు కోసం అగ్రశ్రేణి కంపెనీలను గుర్తిస్తారు. ఈ పథకంలో కంపెనీలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమవుతాయి. ఇవి కాకుండా, మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఇతర సంస్థలు లేదా బ్యాంకులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. అగ్రగామి-500 కంపెనీల్లో తక్కువగా ప్రాతినిధ్యం ఉన్న రంగాలు, విభాగాల కోసం ఇతర సంస్థలను పరిగణనలోకి తీసుకుంటారు.
3.2 భాగస్వామ్య సంస్థ తన సొంత కంపెనీలో ఇంటర్న్‌షిప్ అందించలేకపోతే, దాని విలువ గొలుసులో ఉన్న సంస్థలు (ఉదా: సరఫరాదార్లు/ఖాతాదార్లు/వెండర్లు) లేదా దాని గ్రూప్‌లోని ఇతర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించొచ్చు. అయితే, ఇంటర్న్‌షిప్ మొత్తం భాగస్వామ్య సంస్థ పర్యవేక్షణలోనే ఉంటుంది, నాణ్యమైన అభ్యాస అనుభవాన్ని ఇస్తుంది.
4. ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి:
ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి 12 నెలలు. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా, తప్పనిసరిగా వాస్తవ పని/ఉద్యోగ వాతావరణంలో ఇంటర్న్‌షిప్ జరగాలి.
5. అభ్యర్థుల అర్హతలు
5.1 వయస్సు: 21-24 సంవత్సరాల మధ్య వయస్సు గల (దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నాటికి) భారతీయులైన యువకులు అర్హులు. వీరు పూర్తి సమయం ఉద్యోగం/విద్యాభ్యాసంలో ఉండకూడదు. ఆన్‌లైన్/దూరవిద్య కార్యక్రమాల్లో ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
5.2 విద్యార్హతలు: ఉన్నత పాఠశాల లేదా హైయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉత్తీర్ణత; ఐటీఐ సర్టిఫికేట్ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా; బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మా వంటి డిగ్రీలు.
5.3 ఈ కింది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు:
(i) ఐఐటీ, ఐఐఎం, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఐఐఎస్‌ఈఆర్, ఎన్‌ఐడీ, ఐఐఐటీ ఉత్తీర్ణులు
(ii) సీఏ, ఎంసీఏ, సీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీఏ లేదా ఏదైనా మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉన్నవాళ్లు
(iii) కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద నైపుణ్యం, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ లేదా విద్యార్థి శిక్షణ కార్యక్రమం పొందుతున్నవాళ్లు
(iv) 'నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్' (నాట్స్) లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (నాప్స్) కింద శిక్షణ పూర్తి చేసినవాళ్లు
(v) 2023-24 ఆర్థిక సంవత్సరంలో అభ్యర్థి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి ఆదాయమైనా రూ.8 లక్షలు దాటితే
(vi) కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరైనా శాశ్వత/రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగి అయితే
గమనిక: పైలట్ ప్రాజెక్ట్ ప్రయోజనాల కోసం:
(i) “కుటుంబం” అంటే అభ్యర్థి, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి
(ii) “ప్రభుత్వం” అంటే కేంద్రం & రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలు, కేంద్ర & రాష్ట్ర పీఎస్‌యూలు, చట్టబద్ధమైన సంస్థలు, స్థానిక సంస్థలు మొదలైనవి
(iii) “ఉద్యోగి” అంటే రెగ్యులర్/శాశ్వత ఉద్యోగులు. ఒప్పంద ఉద్యోగులు కాదు
6. పథకం ప్రయోజనాలు:
6.1 పరిశ్రమలో ప్రత్యక్ష అనుభవం: అభ్యర్థులు వాస్తవ ప్రపంచ వ్యాపార వాతావరణాన్ని స్వయంగా అనుభవించడానికి, తద్వారా ఉపాధిని మెరుగుపరిచే ఆచరణాత్మక అనుభవాన్ని వారికి అందించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు భాగస్వామ్య సంస్థలు ధృవపత్రాలు కూడా ఇస్తాయి. తద్వారా, అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
6.2 ఆర్థిక సాయం: అభ్యర్థులకు నెలకు రూ.5,000 ఆర్థిక సాయం అందుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.4,500 ఇస్తుంది. ఆ సంస్థ తన సీఎస్‌ఆర్ నిధుల నుంచి నెలకు రూ.500 చెల్లిస్తుంది. దీనికి అదనంగా, ఇంటర్న్‌షిప్ ప్రారంభ సమయంలో ప్రతి అభ్యర్థికి మంత్రిత్వ శాఖ రూ.6,000 ఇస్తుంది. ఇది, ఒక్కసారి సాయం మాత్రమే, నెలనెలా ఇవ్వరు. ఒకవేళ, ఏదైనా సంస్థ రూ.500 కంటే ఎక్కువ నెలవారీ సాయం అందించాలనుకుంటే, తన సొంత నిధుల నుంచి ఇవ్వొచ్చు.
6.3 బీమా కవరేజీ: భారత ప్రభుత్వ బీమా పథకాలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి అభ్యర్థికి బీమా చేస్తారు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి అదనంగా, ఆ కంపెనీ కూడా అదనపు ప్రమాద బీమా కవరేజీని అందించవచ్చు.
7. పథకం అమలు: భాగస్వామ్య సంస్థలకు పోర్టల్‌లో ప్రత్యేకమైన డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ అవకాశాలు, పని ప్రాంతం, పని స్వభావం, అర్హతలు, అందించే సౌకర్యాల వంటి వివరాలను ఆ డాష్‌బోర్డ్‌లో నమోదు చేస్తాయి. అర్హత గల అభ్యర్థులు పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ప్రాధాన్యత రంగాలు, ఉద్యోగ స్వభావం, ప్రాంతాల ఆధారంగా ఇంటర్న్‌షిప్ కోసం శోధించవచ్చు. గరిష్టంగా ఐదు అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
8. సమాచార సహాయం: ఈ పథకం కింద, ప్రత్యేకంగా ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం పని చేస్తుంది. ఇది, సమస్యలను సకాలంలో పరిష్కరించేలా పని చేస్తుంది & వినియోగదారుడి సంతృప్తి స్థాయిని పెంచుతుంది. మీ మాతృభాషలో సాయం కోరడానికి 1800-116-090 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు.
addComments
Post a Comment