మూడో రోజు నారీ శక్తి విజయోత్సవ సంరంభం.


విజయవాడ (ప్రజా అమరావతి);

*మూడో రోజు నారీ శక్తి విజయోత్సవ సంరంభం* 



*బబ్బూరు గ్రౌండ్స్ లో మూడో రోజు ఆధ్యాత్మిక శోభ*


*ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు*


*భక్తి పారవశ్యంతో తిలకించిన ప్రజలు* 


నారీ శక్తి విజయోత్సవంలో భాగంగా మూడో రోజు పున్నమి ఘాట్ బబ్బూరి గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. నారీ శక్తి విజయోత్సవంతో ఆదివారం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారింది. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళా రూపాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అబ్బుర పరచాయి.

*గిరిజన సాంప్రదాయ కొమ్ము నృత్యం:* గిరిజనుల్లో ప్రత్యేకించి కోయ జాతివారు మాత్రమే తలపై గేదె కొమ్ములు తగిలించుకొని, మెడల్లో పెద్దడోలు వేసుకుని ఆడే ఈ ఆటకు ’కొమ్ము – డోలు’ ఆట అని పేరు.. కోయ జాతి పురుషులు, స్త్రీలు, చిన్నాపెద్దా ముదుసలి, అనే తారతమ్యం లేకుండా ఒకరిచేతులు ఒకరు పట్టుకొని దండ కట్టి ’రేల’ అనే పదంతో విన్యాసాలు చేస్తారు.. డోలును ఒకవైపు పుల్లతోను, మరొకవైపు చేతితోను ఈ వాద్యాన్ని వాయిస్తారు. ఇలా గెంతుతూ వాయిస్తూ వుంటే ఆ వాద్యానికి అనుగుణంగా లయ బద్ధంగా స్త్రీలు నాట్యం చేస్తారు. 

*శివసత్తుల పూనకాలు - పోతురాజుల విన్యాసాలు:*  పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. పోతురాజుల వేషధారణతో  ఎంతో భక్తి పారవశ్యంతో ప్రదర్శించిన పోతురాజుల విన్యాసాలు బబ్బూరు గ్రౌండ్ కు వచ్చిన ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. 

*జానపద డప్పు నృత్యం:*  జానపద కళాకారులు జానపద డప్పు నృత్యాన్ని శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ప్రదర్శిస్తున్నారు.. విభిన్నమైన భంగిమల్లో కళాకారులు నృత్యం చేస్తూ, ఒకరిపై ఒకరు ఎత్తుగా పైకెక్కి పిరమిడ్ ఆకారంగా నిలబడి, జానపద, భక్తి పాటలు పాడుతూ ప్రజలను ఆనందింప చేశారు. ఒకవైపు నృత్యం మరోవైపు జానపద డప్పు వాయిద్యం వాయిస్తూ ప్రజలను ఆహ్లాదపరచారు. 



             

Comments