పశు గణన భవిష్యత్ ప్రణాళిక మరియు విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.


   విజయవాడ. (ప్రజా అమరావతి): 

దేశవ్యాప్తంగా 25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు 21 వ అఖిల భారత పశు గణన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.. 

పశుసంవర్ధక శాఖ ఆఫీసు నుండి గురువారం పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులకు 21వ అఖిల భారత పశు గణన నిర్వహణపై తగు సలహాలు మరియు సూచనలు అందించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో మొత్తం 1.50 కోట్ల కుటుంబాలకు సంబంధించిన పశువుల వివరాలను నమోదు చేయాల్సి ఉందన్నారు. 

విషయ సేకరణదారులు మీ గృహ సందర్శనకు వచ్చిన సమయంలో తమ వద్ద ఉన్న పశువులు మరియు కోళ్ళ సంఖ్యపై సరైన సమాచారాన్ని వారికి అందించాలన్నారు. పశు గణనలో భాగంగా, గణన ప్రక్రియ పూర్తయినట్లు గుర్తుగా ప్రతి ఇంటి ముందు తలుపు యొక్క కుడి ఎగువ మూలలో స్టిక్కర్లు ఉంచుతారని తెలిపారు.

ఈ పశు గణన భవిష్యత్ ప్రణాళిక మరియు విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. ఇది పశు సంవర్ధక రంగానికి మరియు ఆంధ్రప్రదేశ్ లోని పశు సంవర్దక రంగంపై ఆధారపడిన కుటుంబాల జీవనోపాధికి తోడ్పడేలా కార్యక్రమాలు సమర్థవంతంగా రూపొందించడానికి దోహదపడుతుందని కార్యదర్శి యమ్. యమ్. నాయక్ ఆ ప్రకటనలో తెలియజేశారు.. 

గ్రామీణ భారతదేశంలో పశువుల పెంపకం కీలకమైన ఆర్థిక వనరు, ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు పశు పోషణ అదనపు ఆదాయాన్ని అందిస్తుందన్నారు. అనేక భూమిలేని కుటుంబాలకు ప్రాథమిక జీవనోపాధిగా పని చేస్తుందన్నారు. పశు పోషణ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు మరియు సంక్షోభ సమయాల్లో గ్రామీణ ప్రాంతాలలో కీలకమైన ఆదాయ వనరుగా ఉంటుందన్నారు..

పశు గణన ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుందన్నారు. పశు సంవర్దక రంగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన కార్యక్రమాల ప్రణాళిక, అమలు మరియు పర్యవేక్షణ కోసం అవసరమైన సమాచారం అందిస్తుందన్నారు. ఈ పశు గణన ద్వారా పశువులు, కోళ్ళు మరియు వ్యవసాయ పరికరాలపై ప్రాథమిక సమాచారాన్ని సేకరించే వనరుగా ఉపయోగపడుతుంది, పశు గణ రంగంలో పథకాలను అభివృద్ధి చేయడంలో కీలక భూమిక పోషిస్తుందన్నారు.

పశు గణన మొట్టమొదటి సారిగా 1919 - 1920వ సంవత్సరములో నిర్వహించారన్నారు. అప్పటి నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారన్నారు. ఇప్పటి వరకు 20 పశుగణనలు నిర్వహించబడ్డాయని మరియు చివరి పశు గణన 2019 లో చేశారన్నారు. 21వ పశు గణన 25 అక్టోబరు, 2024 న ప్రారంభం కానుందన్నారు. ఈ పశు గణన ద్వారా పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు మరియు వివిధ రకాల కోళ్ళు పక్షులతో సహా 16 రకాల్ పెంపుడు జంతువులపై జాతుల వారీగా సమాచారాన్ని సేకరిస్తారన్నారు.

నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ (NDDB) భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను ఉపయోగించి ఈ పశు గణన ఆన్ లైన్ లో నిర్వహిస్తారన్నారు.. ఆంధ్రప్రదేశ్ పశు గణనలో 5,390 మంది విషయ సేకరణదారులు, 1,237 మంది సూపర్ వైజర్లు, 45 మంది స్క్రూనీ ఆఫీసర్లు మరియు ఇతర ఫీల్డ్ సిబ్బంది ఉంటారన్నారు. 21,173 గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాలలో (17,244 గ్రామీణ గ్రామాలు, మరియు 3,929 పట్టణ వార్డులు) గృహ మరియు గృహేతర వ్యక్తుల నుండి సమాచారం సేకరిస్తారన్నారు..

21వ పశు గణన మన రాష్ట్రంలో నిర్వహించడానికి 5,390 ట్రావెలింగ్ కిట్లు, 60,000 వాల్ పోస్టర్లు, 1.50 కోట్ల గృహ స్టిక్కర్లు మరియు 8,000 ఐడీ కార్డులతో సహా కీలకమైన మెటీరియల్ ను పశు గణన కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూసేందుకు జిల్లాలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టీవీ ఛానెళ్లలో స్కోలింగ్ సందేశాలతో సహా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారం 25 అక్టోబర్ 2024 నుండి ప్రారంభిస్తారన్నారు. 



Comments