అన్నపూర్ణ దేవి అలంకారంలో జగన్మాత భక్త జన కోటికి దర్శనం.

 ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);


అన్నపూర్ణ దేవి  అలంకారంలో జగన్మాత

భక్త జన కోటికి దర్శనం


----ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం

దసరా శరన్నవరాత్రి  ఉత్సవాలలో మూడవ రోజైన శనివారం జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్త జనకోటికి దర్శనం ఇచ్చారు. వేకువ ఝామునుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో దర్శనానికి రావడం విశేషం. మానవ కోటి మనుగడకు అవసరమైన ఆహారం అందించే అన్నపూర్ణాదేవి అవతార విశిష్టతను పురాణ గ్రంధాల ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎవ్వరూ క్షుద్భాతతో ఉండకూడదనేది అన్నపూర్ణాదేవి అవతారంలోని అంతరార్థం. పరమేశ్వరుడికే ఆహారాన్ని బిక్షగా వేసిన అన్నపూర్ణేశ్వరి మాతను ఏకాగ్రతతో ఆరాధిస్తే ప్రతి ఒక్కరికి తమ జీవితంలో  సరైన సమయంలో ఆహారం లభిస్తుందని అనేక ఆధ్యాత్మిక గ్రంధాల లోని గాధల ద్వారా రుజువైన సత్యం. హిందువులకు వేదాలపై ఉన్న నమ్మకం ఈనాటిది కాదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచీ మన దేశం వేద భూమిగా కొనియాడబడుతోంది. అటువంటి వేదాలలోనే ఆహారం ఎలా  లభిస్తుంది అనే విషయంపై మన పూర్వీకులు తెలియజేశారు. కొన్ని పురాణ గాధలను పరిశీలిస్తే మనం ప్రతిరోజు తింటున్న ఆహారానికి, అన్నపూర్ణేశ్వరి మాతను ఎందుకు ఆరాధించాలో  మనం తెలుసుకోవచ్చు.

అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది.

పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి అన్నపూర్ణాదేవి.

దీనులకు అన్నము, ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు, ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము. ప్రకృతి స్వరూపం ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.

‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ 

అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.

‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ 

కనిపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

ఇటువంటి శక్తి కలిగిన అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకునేందుకు వేలాది మంది సాధారణ భక్తులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, దేవదాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థల నుంచి విధులు నిర్వహించేందుకు  నియమించబడిన అధికారులు నిరంతరం క్యూలైన్లను, భక్తుల అవసరాలను గుర్తించి ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నారు.


Comments