టీడీపీ అధికారం కోసం కాదు...రాష్ట్రం, దేశం కోసం పని చేసింది.



*టీడీపీ అధికారం కోసం కాదు...రాష్ట్రం, దేశం కోసం పని చేసింది



*ఐదేళ్లలో గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు*


*దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా గెలవలేకపోయారు*


*చరిత్రలో లేని విధంగా కక్ష సాధింపులకు పాల్పడ్డారు*


*మనం క్రమ శిక్షణగా ఉందాం...ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం*


*రోడ్లపై వాళ్లు గోతులు పెట్టెళ్లారు...మనం పూడ్చుతున్నాం*


*మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు గురించి ధైర్యంగా చెప్పండి*


*ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు...ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యం*


*కార్యకర్తలకు అండగా ఉండాలి...న్యాయం చేయాలి* 


*ఇసుక, లిక్కర్ లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు...వైసీపీ నేతలు చేసిన తప్పులు మీరూ చేయొద్దు*


*పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతల సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి ):- ’టీడీపీ ఏనాడూ పదవుల కోసం పని చేయలేదు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. అత్యంత శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ కీలక పాత్ర పోషించింది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై నేతలకు దిశనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మట్లాడుతూ...‘‘125 రోజుల పాలనలో మనం చేసిన మంచి పనులు సమీక్షించుకుని ముందుకెళ్లాలి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎన్డీయే అధికారంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. పార్టీని సమన్వయం చేసుకోవడంతో పాటు మద్ధతు ఇచ్చిన ప్రజల ఆశలు నెరవేర్చాలి. గత ఐదేళ్లు కార్యకర్తలు అన్ని విధాలా నష్టపోయి, త్యాగాలు చేసి కష్టపడ్డారు. కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లలో పడ్డ ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను భ్రస్టు పట్టించారు. ఏ విభాగంలోనూ ఆడిట్ చేయలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారు. ఇప్పుడు నిధులు అడుగుతుంటే గతంలో ఇచ్చిన నిధులకు యూసీలు అడుతున్నారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన రూ.990 కోట్లు మళ్లించారు...దీంతో రూ.12 వందల కోట్లు రాకుండా పోయాయి. మనం వచ్చాక రూ.990 కోట్లు చెల్లించడం వల్ల రూ.12 వందల కోట్లు పంచాయతీలకు రాబోతున్నాయి. ఇవన్నీ గమనించిన రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుని మనకు పెద్ద మెజారిటీ ఇచ్చారు. టీడీపీ కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు...పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాం. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించింది. దేశ రాజకీయాల్లో కీలక సమయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. ఎలాంటి పదవులు ఆశించకుండా వాజ్ పేయ్ ప్రభుత్వంలో పని చేశాం. టీడీపీ ఒక విశ్వసనీయత కలిగిన పార్టీ. దేశం కోసం, రాష్ట్రం కోసం మాత్రమే పని చేసింది. ఒక నాయకుడికి, పార్టీకి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పడుతుంది...దాన్ని పడగొట్టుకోవాలంటే తక్కువ సమయం చాలు. అది నాకైనా మీకైనా. ప్రతి ఒక్కరం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం.’ అని పిలుపునిచ్చారు.   


*ప్రధాని మోదీ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శనీయం*


‘ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాల్సింది ఆయనకున్న పట్టుదల, కృషి. 3 సార్లు ప్రధాని అయినా మళ్లీ రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు. దేశంలో ఎవరికీ రాని విజయం మోదీ సాధించారంటే దాని వెనక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉంది. పార్టీలో ఎవరూ తప్పు చేయకుండా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ఐదేళ్లు అరాచకం జరిగింది..దీంతో అంతా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు. నన్ను కూడా అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నన్ను కలిసిన అనంతరం కలిసిపోటీ చేస్తామని ప్రకటించారు. బీజేపీ కూడా కలిసి పోటీ చేయడానికి ముందుకు వచ్చింది. ఎన్నికల్లో పొలిటికల్ సోషల్ రీ ఇంజనీరింగ్ చేశాం. టీడీపీకి అండగా ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం. ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని వర్గాలకు సీట్లు ఇచ్చాం. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలి అని నినాదం ఇచ్చాం. ఇప్పుడు గెలిచాం కాబట్టి మన పని అయిపోయిందని అనుకోకూడదు పార్టీ నమ్ముకున్న వారికి కూడా పొత్తు వల్ల సీట్లు ఇవ్వలేకపోయాం. 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. యువత, చదువుకున్న వారు వచ్చారు. 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు 80 మంది దాకా కొత్తవారు ఉన్నారు. పార్టీ కూడా కుటుంబం లాంటిదే. సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళ్లాలి. అనుకున్న ఆశయం కోసం మనం పని చేయాలి. వైసీపీ చేయని తప్పు లేదు. ప్రజల్ని బెదిరించారు...అన్ని విధాలా దందాలకు పాల్పడ్డారు. అందుకే ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకు కుదించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు, బెదిరింపులను తట్టుకుని నిలదొక్కుకున్నాం...ఎదిరించాం..అండగా ఉన్నాం. అందుకే చరిత్రలో లేని విధంగా 93 శాతం స్ట్రైక్ రేట్ తో సాధించాం. మన ప్రభుత్వంలో కక్షసాధింపులు ఉండవు...అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. గత ప్రభుత్వం మాదిరి కక్ష సాధింపులకు పాల్పడితే మనకూ వారికి తేడా ఉండదు. టీడీపీకి కొన్ని కుటుంబాలు అంకితం అయ్యాయి...ప్రాణాలకు పణంగా పార్టీ కోసం పని చేశారు.’ 


*క్రమ శిక్షణగా ఉందాం...ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం*


‘సంఘటిత శక్తిగా ఏర్పడి మంచిపని చేస్తేనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలి. ప్రభుత్వంలో చివరి ఉద్యోగి తప్పు చేసినా సీఎంను అంటారు. ఎన్డీయేలో ఏ కార్యకర్త తప్పు చేసినా అది సీఎం వైపే చూపెడతారు. పార్టీ, ప్రభుత్వం నుండి తలెత్తేవి నావైపే చూపిస్తారు. మీరు మంచి చేసినా, తప్పు చేసినా అవి పార్టీ, ప్రభుత్వానికి వర్తిస్తాయి. అందరికీ ఒకటే చెప్తున్నా....మనం ప్రవర్తించే ప్రధానమే మనకు వచ్చే మెజార్టీపై ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగు నెలల పనితీరు ప్రోగ్రెస్ కూడా నా వద్ద ఉంది. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. అమరావతి, పోలవరం, విద్యుత్, మద్యం, ల్యాండ్ మాఫీయా, లా అండ్ ఆర్డర్, ఆర్థిక వ్యవస్థపై ప్రజలకు పరిస్థితిని వివరించాం. గత ప్రభుత్వంలో మద్యం, ఇసుకను, గనులు ఇష్టారీతిన దోచేశారు. గంజాయి విపరీతంగా విక్రయించారు. ఎన్నో అత్యాచారాల వెనక గంజాయి మత్తే కారణం. రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. యేటా రూ.90 వేల కోట్లు వడ్డీలు చెల్లించాలి. భవిష్యత్ బాగుండాలంటే ఎన్డనీయే ఉండాలని ప్రజలు విశ్వసించారు. మనపై ఉండే నమ్మకం, పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న విశ్వాసం, కేంద్రం నుండి రాష్ట్రాన్ని కాపాడుతుందన్న నమ్మకంతోనే ప్రజలు గెలిపించారు.’ అని గుర్తు చేశారు.  


*దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా గెలవలేకపోయారు*


‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలిస్తామని చెప్పాం...ఆ విధానం ప్రారంభమైంది డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. దాదాపు 70 శాతం గ్రీవెన్స్ నాకు భూ సమస్యలపైనే వస్తున్నాయి. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. యాక్ట్ రాకముందే ఇలా జరిగిదంటే వస్తే ఇంకేలా ఉండేదో ఆలోచించాలి. పట్టాదారు పుస్తకంపైనా వారి బొమ్మలు వేసుకున్నారు. హద్దులు మిచిం ప్రవర్తించారు. పింఛన్లు ఇచ్చిన మాట ప్రకారం రూ.1000 పెంచి ఇస్తున్నాం. రూ.6 వేలు దివ్యాంగులకు, రూ.10 వేలు కిడ్నీ బాధితులకు, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. అన్నక్యాంటీన్లను 175 ప్రారింభించాం...203కు పెంచుతాం. ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. స్కిల్స్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. 1వ తేదీనే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు అందిస్తున్నాం. గత మద్యం విధానంలో జరిగిన దోపిడీపై విచారణ చేస్తూనే నూతన మద్యం పాలసీని తెచ్చాం. నూతన ఇసుక పాలసీ తెచ్చాం. అవతలి వారు చేసిన తప్పులు మనం చేస్తే ప్రజలు అనుమానిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. వారసత్వంగా వస్తున్న వ్యాపారం చేసుకుంటే ఏమీ కాదు...కానీ జోక్యం చేసుకుంటే ప్రతిష్ట దెబ్బతింటుంది. వైసీపీ నేతలు బస్తాలు బస్తాలు డబ్బులు దోచుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టారు...కానీ గెలిచారా.? నమ్మకం లేకపోతే డబ్బుతో ఏ ఎన్నిక జరగదు. డబ్బులతో ఎన్నికలు జరిగితే 93 శాతం సీట్లు వచ్చేవి కాదు’ అని అన్నారు.  


*రోడ్లపై వాళ్లు గోతులు పెట్టెళ్లారు...మనం పూడ్చుతున్నాం*


‘విజయవాడద వరద సమయంలో రాత్రింబవళ్లు పని చేశాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో వరదలు వచ్చాయి. నీళ్లలోనే నడిచాం...అధికారులను నడిపించాం. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో స్వచ్ఛందంగా రూ.450 కోట్లపైన విరాళాలను ప్రజలు అందించారు. ఎప్పుడు వరదలు వచ్చినా క్యాంప్ లు పెట్టి వెయ్యి, లేదా రెండు వేలు ఇచ్చేవారు. కానీ మొదటి సారి దేశ చరిత్రలో ఒక్కో ఇంటికి రూ.25 వేలు ఇచ్చాం. వరద సమయంలో నీళ్లు, బిస్కెట్లు, పాలు అందించాం. ఆటోకు రూ.10 వేలు, రూ.3 వేలు బైక్ లకు ఇచ్చాం. డ్రోన్స్ ద్వారా ఆహారం అందించాం. దాదాపు 10 రోజులు ఉండి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చాం. 4.15 లక్షల మందికి రూ.618 కోట్లు పరిహారం కింద అందించాం. రైతులకు గత పాలకులు రూ.1674 కోట్లు బకాయిలు పెట్టారు...రాగానే అవి విడుదల చేశాం. రైతుల నుండి ధాన్యం కొంటే 48 గంటల్లోనే డబ్బులు అందించే విధానం మళ్లీ తీసుకొచ్చాం. రూ.4,500 కోట్ల నిధులతో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పనులు ప్రారంభించాం...డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్న ప్రకటించారు. చేపట్టిన పనులు జనవరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలోని రోడ్లన్నీ గోతులు పడ్డాయి. వాటి మరమ్మతులకు రూ.290 కోట్లు విడుదల చేశాం...మరో రూ.446 కోట్లు మళ్లీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రూ.700 కోట్లు దాదాపు రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఖర్చు అవుతుంది. సంక్రాంతికి ముందే రోడ్ల మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించాం. వాళ్లు గోతులు పెట్టారు...వాటిని మనం పూడ్చే కార్యక్రమం చేపట్టాం.’ అని అన్నారు.  


*చరిత్రలో లేని విధంగా గత పాలకుల కక్ష సాధింపులు*


‘రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా గత పాలకులు కక్ష సాధింపులకు పాల్పడ్డారు. పార్టీ కార్యకర్తల ఆస్తులు, ఆధాయవనరులు నాశనం చేశారు. మన ప్రభుత్వంలో పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా విజిలెన్స్ విచారణ పేరిట నిలిపేశారు. మనం అధికారంలోకి వచ్చాక రూ.259 కోట్లు నీరుచెట్టు, రూ.50 కోట్లు నరేగాలో పెండింగ్ బిల్లులు ఇచ్చాం. కార్యకర్తలకు న్యాయం చేస్తేనే వారు మనకు అండగా ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత మనపై ఉంది. జాబ్ ఫస్ట్ విధానంతో దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు అదనంగా ఇస్తామని చెప్పాం. 10 శాతం అదనంగా ఉద్యోగాలు కల్పించే వారికి ప్రోత్సాహకాలు మరింత ఇస్తామని ప్రకటించాం. ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ ఎంటర్ ప్రెన్యూర్ డెవలెప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఎనర్జీ....ఇలా 6 పాలసీలు తసుకొచ్చాం. సూపర్ 6 హామీలులాగే సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చాం. ఇవి అమలైతే ఏపీ నెంబర్ వన్ గా అవుతుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో హెడ్ క్వార్టర్, 5 జోన్లలో 5 ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంట్లో ఒక వ్యపస్థాపకులు ఉండాలి. రతన్ టాటా స్ఫూర్తితోనే ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేస్తాం. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేస్తాం.’ అని అన్నారు.  


*మేనిఫోస్టో హామీల అమలుపై ధైర్యంగా చెప్పండి*


‘ఎన్నికల మేనిఫోస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్, గౌడలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు, అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంపు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంపు, దీపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుండి 10 వేలకు పెంచాం. వేద పాఠశాలల్లో చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు కూడా అందిస్తాం. చేనేత వస్త్రాలకు జీఎస్టీ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరతాం...కేంద్రం ఇవ్వకుండా రియింబర్స్ చేస్తాం. చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా రూ.50 వేలు అందిస్తాం. పారదర్శక పాలనలో భాగంగా జీవోలు కూడా ఆన్ లో పెట్టాం. రాజధాని ఒక్కటే ఉంటుంది...అది అమరావతే. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుంటి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. ఓర్వకల్లు, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తాం. పోలవరానికి రూ.12,517 కోట్లు మంజూరయ్యాయి....ఫేజ్-1ను రెండేళ్లలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం కూడా మళ్లీ ప్రారంభిస్తాం. 95 శాతం చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో కలకలాడుతున్నాయి. ఎప్పుడూ నిండని రిజర్వాయర్లు నీళ్లతో నిండాయి. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కోసం రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు...దీనికి జెన్ కోను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. రైతులకు డ్రిప్ లు అందిస్తున్నాం. పాడి రైతులకు 90 శాతం సబ్సీడీతో షెడ్లు నిర్మిస్తున్నాం. రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించాం. శాంతిభద్రతల విషయంలోనూ ఉక్కుపాదం మోపుతున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు అందిస్తున్నాం. ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు ఇవ్వడంతో పాటు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అందిస్తాం. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం. ఆదాయం పెంచి సంక్షేమాన్ని అందిస్తాం. వైసీపీ చేసిన అరాచకం భరించలేక ప్రజలు మనల్ని గెలిపించారు... మనల్ని ప్రజలు గెలిపించారు. మళ్లీ గెలవాలి అంటే ఎన్డీయే చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి’ అని సీఎం అన్నారు. 


Comments