ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.



ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం


గ్రామీణాభివృద్ధికి గొప్ప ప్రోత్సాహం: రాజస్థాన్‌కు రూ.1267 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.988 కోట్లకు పైగా మొదటి విడత నిధులు విడుదల


విజయవాడ (ప్రజా అమరావతి);


ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్‌ఎల్‌బీలు), 2024–25 ఆర్థిక సంవత్సరానికి, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో మొదటి విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ₹395.5091 కోట్ల షరతులు లేని నిధులు (అన్‌టైడ్ గ్రాంట్లు), ₹593.2639 కోట్లు షరతులతో కూడిన నిధులు (టైడ్ గ్రాంట్లు) విడుదలయ్యాయి. రాష్ట్రంలోని అర్హత గల 9 కార్పొరేషన్లు, 615 బ్లాక్ పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించారు. రాజస్థాన్‌లో అర్హత గల 22 కార్పొరేషన్లు, 287 బ్లాక్ పంచాయతీలు, 9,068 గ్రామ పంచాయతీలకు ₹507.1177 కోట్ల షరతులు లేని నిధులు, ₹760.6769 కోట్ల షరతులతో కూడిన నిధులు విడుదలయ్యాయి.


స్థానిక సంస్థల సాధికారత కోసం గ్రాంట్‌ల వినియోగం


అన్‌టైడ్ గ్రాంట్లను వ్యవసాయం, గ్రామీణ గృహాల నుంచి విద్య, పారిశుద్ధ్యం వరకు నిర్దిష్టమైన స్థానిక అవసరాల కోసం పంచాయతీలు వినియోగించుకోవచ్చు. అయితే, ఈ నిధులను జీతాలు, ఇతర నిర్మాణాల ఖర్చుల కోసం ఉపయోగించుకోకూడదు. టైడ్‌ గ్రాంట్లను పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) పరిస్థితుల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, గృహ వ్యర్థాల శుద్ధి వంటి ప్రధాన సేవల కోసం ఉపయోగించుకోవచ్చు.


సమ్మిళిత వృద్ధి కోసం క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యం బలోపేతం


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జీ ప్రకారం, అవసరమైన సేవలు & మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి ఈ నిధులు పంచాయతీలకు సాధికారత కల్పిస్తాయి. మహాత్మాగాంధీ సూచించిన ‘గ్రామ స్వరాజ్యం’ దార్శనికతకు అనుగుణంగా, క్షేత్ర స్థాయిలో బాధ్యతాయుతమైన & ప్రతిస్పందించే నాయకత్వాన్ని ఇది అభివృద్ధి చేస్తుంది. ఈ సాధికారత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' అనే మార్గదర్శక సూత్రంతో ఏకీభవిస్తుంది, "వికసిత్ భారత్" లక్ష్యం సాధించాలన్న దృఢమైన నిబద్ధతను నొక్కిచెబుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం స్థానిక పరిపాలనను మెరుగుపరచడం ద్వారా సమ్మిళిత వృద్ధికి & స్థిరమైన గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రజాస్వామ్యం భాగస్వామ్యం, గ్రామ స్థాయి పురోగతిలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేస్తుంది.


గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్‌లను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ (తాగునీరు & పారిశుద్ధ్య విభాగం) ద్వారా రాష్ట్రాలకు విడుదల చేయాలని భారత ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ మొత్తాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. కేటాయించిన గ్రాంట్లు ఒక ఆర్థిక సంవత్సరంలో 2 వాయిదాలుగా విడుదలవుతాయి.

Comments