వదర బాధితులకు అత్యుత్తమ ప్యాకేజీని అందజేస్తున్నాం.

 *వదర బాధితులకు అత్యుత్తమ ప్యాకేజీని అందజేస్తున్నాం


*

*•కృష్ణా, బురమేరు వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేల ఆర్థిక సాయం*

*•నష్టపోయిన ప్రతి ఒక్కరినీ అన్నివిధాలుగా ఆదుకుంటాము*

*రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు*

                                                                                                                                                                అమరావతి, సెప్టంబరు 17 (ప్రజా అమరావతి):  రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా కృష్ణా, బుడమేరు వరదలు సంభవించి  విజయవాడ నగరాన్ని అతలాకుతం చేసినప్పటికీ, కేవలం   పది రోజుల్లో అందరి సహకారంతో నగరంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందని  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ వరధ వల్ల నష్ట పోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు అత్యుత్తమ ప్యాకేజీని రూపొందించి అమలు చేయడం జరుగుతుంది అంటూ ప్యాకేజీ వివరాలను ఆయన ప్రకటించారు.  


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ స్థాయిలో కురిసిన వర్షాల వల్ల కృష్ణా నదిలో 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ రావడం  రాష్ట్ర చరిత్రలో  ఇదే ప్రథమం అన్నారు. నిజానికి ఈ  ప్రాజెక్టు 11.09 లక్షల క్యూసెక్కుల వాటర్ డిశ్చార్జ్  చేసే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. తొలి ఆనకట్టు 100 సంవత్సరాల క్రింద, ప్రస్తుత ప్రాజెక్టు 75 సంవత్సరాల క్రింద నిర్మించి దాదాపు 175   సంవత్సరాల పురాతనమైన ఈ ప్రాజెక్ట్లోకి  ఒకే సారి 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ రావడం  భారీ విపత్తుకు కారణం అయిందన్నారు. అదే సమయంలో బుడమేరు కూడా పొంగడం వల్ల విజయవాడ నగరంలోని  పలు ప్రాంతాలు జలమయం అవ్వడంతో పాటు దాదాపు  ఏడు రోజుల పాటు 6-7  అడుగుల మేర నీరు నగరంలోని పలు ప్రాంతాల్లో నిలిచిపోవడం జరిగిందన్నారు. అదే విధంగా తమ హయాంలో  ప్రారంభించిన బుడమేరు ఆధునీకరణ పనులను గత ప్రభుత్వం నిర్లక్యం చేయడం కూడా మరొక కారణం అన్నారు. బుడమేరు పరీవాహక ప్రాంతం పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు గురవ్వడం మరో కారణమన్నారు. ప్రతి పక్ష పార్టీకి చెందిన వారి బోట్లు ఒక్కోటి 40 మెట్రిక్ టన్నులు ఉండే 3 బోట్లను కృష్ణా నదిలో వదిలిపెట్టడం వల్ల అవి వచ్చి నేరుగా కౌంటర్ వెయిట్ ను డీకొట్టడం వల్ల అవి ఇరిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మొన్నటివరకు వాటికి రిపేర్లు చేయడంతో పాటు ఆ బోట్లను తీయడానికి ఎంత కష్టపడటం జరిగిందో అందరూ చూశారన్నారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు వచ్చినా తీయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినా అన్ని సమస్యలను అధిగమించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నాతో పాటు మా మంత్రివర్గం, ఉన్నతాధికారులు పది రోజులపాటు  రేయింబవళ్లు పర్యవేక్షించడం  వల్ల నగరంలో  పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు ఈ నెల 20 వ తేదీకి  పూర్తవ్వక ముందే ఇంత గొప్ప విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. 


వరద విప్తతు నుండి ప్రజలను కాపాడేందుకు తమ ప్రభుత్వం చేసిన అవిరళ కృషిని  రాష్ట్రంతో పాటు దేశం మొత్తం గుర్తించిందన్నారు. నేను అహ్మదాబాద్  వెళ్లినప్పుడు ఈ విషయాన్ని అందరూ ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేసిన అవిరళ కృషిని ఎంతగానో మెచ్చుకున్నారన్నారు. అదే విధంగా పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకు  వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారని వారందరికీ పేరుపేరునా రాష్ట్ర ప్రభుత్వం తరపున, 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.  


ప్యాకేజీ వివరాలను ఆయన ప్రకటిస్తూ విజయవాడ నగరంలోని 32 వార్డుల్లోని 179 సచివాయాల్లోని వరద బాదితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు పాడైపోయిన గృహాపకరణాల మరమ్మత్తుకు తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన  ప్యాకేజ్ ప్రకారం  32 వార్డుల్లోని  179 సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ప్లోర్ నీటి మునిగిన వాళ్లందరికీ రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని,  ఒక ఇంటికి రూ.25 వేలు ఇవ్వడమనేది చరిత్రలో ఇది మొదటిసారన్నారు. ఒకప్పుడు రూ.4 వేల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉందన్నారు. వరద సమయంలో ఏ ఒక్కరికీ భోజనాల విషయంలో ఏమాత్రము లోటు చేయలేదని,  రాయితీపై కూరగాయలు, 25 కేజీల బియ్యం, ఒక కేజీ పామాయిల్, ఒక కేజీ పంచదార, ఒక కేజీ పప్పు, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండుకేజీల పొటాటో ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి రూ.25 వేల ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. 



అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్‌, సెకండ్ ఫ్లోర్, ఆపైన అంతుస్తుల్లో ఉండే అందరికీ రూ.10 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. వరదలో నీటమునిగిన ఇతర ప్రాంతాలకు చెందినవారికి కూడా రూ.10 వేలు సాయం అందజేస్తామన్నారు. కిరాణా షాపులు, టీ కొట్లు వంటి షాపులున్న అందరికీ రూ.25 వేల సాయం అందిస్తాజేస్తామన్నారు. అదేమాదిరిగా రిజిస్టర్ చేసుకున్న ఎంఎస్ఎంఈలకు టర్నోవర్ రూ.40 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్లందరూ జీఎస్టీ ఫైల్ చేయాల్సిన పనిలేదని, జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోనివాళ్లకి రూ.50 వేలు ఇస్తామన్నారు. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్లు టర్నోవర్ ఉన్నవాళ్లకి రూ.లక్ష ఇస్తామన్నారు. అదేసమయంలో రూ.1.5 కోట్లు ఆపైన ఉంటే రూ.1.5 లక్షలు ఇస్తామన్నారు. టూవీలర్స్ కు ఇన్సూరెన్స్ క్లెయిమ్, రిపేర్లు చేసుకునేందుకు సహకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.71.50 కోట్లకు క్లెయిమ్ కు సంబందించి 9,088 వెహికల్స్ క్లెయిమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వీటిలో 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని, రూ.6.21 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయని, ఇందుకు రూ.65.29 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.


గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నం అయిపోయిందన్నారు. విప్తతుల నిర్వహణకై కేంద్రం ఇచ్చిన కలామిటీ ఫండ్  దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు పెట్టి వాటికి ఎటు వంటి  లెక్కలు చూపకపోవడం వల్ల కేంద్ర నుండి రావాల్సిన నిధులు ఆగిపోవడం జరిగిందన్నారు.  గత ప్రభుత్వం పోలవరం నిధులతో పాటు పంచాయతీరాజ్ లో ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రూ.990 కోట్లు డైవర్ట్ చేయడం జరిగిందన్నారు. ఎంతో కష్టకాలంలో రూ.990 కోట్లు ఇచ్చి రూ.1,100 కోట్లు మళ్లీ తీసుకు రావడం జరిగిందన్నారు. రూ.1650 కోట్లు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు ఉంటే అవి మేమే చెల్లించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ. 10.50 లక్షల కోట్లు అప్పుతో పాటు  పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లు చెల్లించాల్సి ఉందన్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థితుల దృష్ట్యా  రూ.518 కోట్లు తక్షణమే విడుదల చేయాలని  కేంద్రానికి లేఖ రాస్తున్నామన్నారు. 


అదే విధంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాదానం చెపుతూ ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుతం నివశిస్తున్న బాదితులకు మరియు కౌలు దారులకు ఈ ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది స్పష్టం చేశారు.   ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా చూస్తామన్నారు.  గతంలో తమ హయాంలోనే విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఆర్థిక సహాయన్ని కేంద్ర నుండి తీసుకు రావడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ సారి కూడా కేంద్రం నుండి తగిన ఆర్థిక సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాలబాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు సాంకేతికంగా, లాజిస్టిక్, పరిపాలన పరంగా ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఉద్యోగులు కూడా సహకరించాల్సి ఉందన్నారు. 


అమరావతిపై విమర్శలు చేస్తున్న ఈ తెలివైన మేధావులు చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ సిటీలను మార్చేయమని చెప్పండన్నారు.  అమరావతిపై ఎందుకు విషం కక్కుతున్నారని ఆయన ప్రశ్నించారు? తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమహేంద్రవరంలకు వరదలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

                                                                                                                                                                                   

Comments