మ్యారేజ్ బ్రోకర్ అవతారమెత్తిన టీచర్.. ఆడపిల్లల జీవితాలతో ఆటలు.

 


*మ్యారేజ్ బ్రోకర్ అవతారమెత్తిన టీచర్.. ఆడపిల్లల జీవితాలతో ఆటలు


*

*ప్రజల ప్రాణాలతో నకిలీ డాక్టర్లు ఆటలు.. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో వైద్యం*

*పోటెత్తిన భూ బాధితులు.. న్యాయం చేయాలంటూ విన్నపాలు*

*చొక్కా విడిపించి దళితున్ని అవమానించిన పోలీసులు.. చర్యలకు వినతి*

అమరావతి (ప్రజా అమరావతి);


బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ మ్యారేజ్ బ్రోకర్ గా మారి మోసం చేస్తున్నాడని.. ఎవరైనా ఆడపిల్లలు మ్యారేజ్ కోసం ఆయన దగ్గరకు వెళితే తన కొడుక్కే వారితో పెళ్ళిచేయించి రెండు మూడు నెలలు గడిచాక.. వదిలేస్తూ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని  ఉయ్యూరులో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీ కృష్ణపై నెల్లూరు నుండి వచ్చిన ఓ మహిళ నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది. తన కూతురుకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించి తమ వద్ద నుండి వారు తీసుకున్న రూ. 8 లక్షలను తిరిగి ఇప్పించాలని గ్రీవెన్స్ లో పాల్గొన్న నేతలు మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీలు అశోక్ బాబు,  బీటీ నాయుడులకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు. అర్జీ స్వీకరించిన నేతలు విచారించి టీచర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుల నుండి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి  అధికారులతో ఫోన్లు మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. 


కడపజిల్లా సింహాద్రిపురం రావెలకొలను గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు  నేతలకు విన్నవించుకొంటూ.. 24.09.2024 తమ మీద వైసీపీ నేతలు దాడి చేయడానికి రాగా వారిపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తే.. అక్కడి ఎస్సై మాపైనే బైండోవర్ కేసు పెట్టారని.. ఆ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని వారు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 

ఎటువంటి మెడికల్ క్వాలిఫికేషన్ లేకుండా.. ప్రజలను మోసం చేస్తూ.. ఓ సూపర్ స్పెసాలిటీ ఆసుపత్రి పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ట్రీట్ మెంట్  చేస్తున్నారని.. దీనిపై కాకినాడ పోలీసులకు, హెల్త్ డిపార్ట్ మెంట్  అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని..  ఇంకా ట్రీట్ మెంట్ కొనసాగుతూనే ఉందని.. వంకా సత్యనారాయణ, శివ, వంకా సతీష్ , వరలక్ష్మీ, వంక అనితలు ఓ బిల్డింగ్ ను అద్దెకు తీసుకుని మల్టీ స్పెషాలిటీ పేరుతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని  కృపా పార్వతి అనే మహిళ నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 

తమ భూమిని తాము రిజిస్ట్రర్ చేయించుకుంటుంటే తమకు వైసీపీ నేతలు అడ్డుతగులూ గూండాయిజం చేస్తున్నారని.. ఆ భూమి వారిదని బెదిరిస్తున్నారని..  తమకు వారసత్వంగా వచ్చిన భూమిపై బెదిరింపులకు దిగుతున్నారని..  భూమి ఎవరిదో విచారించి..  తమను బెదిరిస్తున్న వెంకటరాయుడు, నారాయణరెడ్డి,  కృష్ణారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని  సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం బంగారుచెన్నేపల్లి గ్రామానికి చెందిన M.రామిరెడ్డి విజ్ఞప్తి చేశాడు. 

గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలు తొలగించబడిన చంద్రన్న సంచార చికిత్స  104 MMU’s –ANM/MPHA(F) లను తక్షణమే DPH&FW, APVVP, DME మొదలకు  వివిధ విభాగాల ఖాళీలలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా  తిరిగి నియామకాలు చేపట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలోని భాకరపేట గ్రామసర్పంచ్ విజ్ఞప్తి చేస్తూ..  గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వలన తమ భూములకు 1B అడంగల్ రాకుండా  పోయిందని.. తమ భూములకు ఆన్ లైన్ లో 1B అడంగల్ వచ్చేట్లు చేయాలని వారు  విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో సుమారు 9ఎకరాల 25 సెంట్లను తాము పూర్వికుల నుండి అనుభవించుచుండగా అగ్ర కులాలకు చెందిన కొంతమంది భూములను దురుద్దేశంతో కాజేయాలని చూస్తున్నారని.. దానికోసం తమపై దాడులు చేస్తున్నారని.. న్యాయం చేయాలని వేడుకున్నారు. అలాగే  గ్రామంలో అక్రమంగా కొండలను బ్లాస్ట్ చేసి దోచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

తనకు రవాల్సిన డబ్బులు అడిగితే  తనను చంపేస్తానని మణిప్రసాద్ రెడ్డి బెదిరిస్తున్నాడని.. ఎవరికి  చెప్పుకోవాలోతెలియక  గ్రీవెన్స్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు  కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం, గోపవరానికి చెందిన  శ్రీకరం నాగరత్నమ్మ  నేతల మందు వాపోయారు. 

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో గండికోట ముంపు గ్రామాలైన కే. బొమ్మేపల్లే, దొరువు పల్లె గ్రామంలో నివాసంలేని  పులివెందుల మరియు  ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తుల పేర్లతో నష్టపరిహారం పొందెందుకు వైసీపీ నేతలతో అధికారులు కుమ్మక్కై కోర్టును సైతం మోసం చేసేందుకు చూస్తున్నారని  అట్టి మోసాలను అరికట్టాలని  పలువురు నేడు గ్రీవెన్స్ లో అర్జీని ఇచ్చారు. 

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం టి. చౌదరివారిపల్లె గ్రామ కాపురస్తుడైన లింగం దిన్నె ఓబులరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. నంద్యాల జిల్లా  బనగానలపల్లె సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ.. ప్రస్తుతం వీఆర్ లో ఉన్న పోలు రామిరెడ్డి తన వద్ద డబ్బులు  తీసుకుని తిరిగి ఇవ్వమంటే  తప్పుడు కేసులు పెట్టి నీ అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని  అతను వాపోయాడు .

మొగల్తూరు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ ప్రజలు విజ్ఞప్తిచేస్తూ.. స్మశాన వాటికకు సర్వేచేసి హద్దులు కల్పించి ఆక్రమణలు తొలగించమంటే..  ఆక్రమణలు తొలగించకుండా.. తమ అర్జీని ముగించారని  దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ఆక్రమణలు తొలగించాలని గ్రామస్తులు గ్రీవెన్స్ లో అర్జీని అందించారు. 

పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం గాదెవారిపాలెం గ్రామానికి చెందిన గాదె సూర్యనారాయణ విజ్ఞప్తి చేస్తూ.. 2019 టీడీపీ ప్రభుత్వంలో గ్రామాభివృద్ధికి  కోసం పనులు చేసిన బిల్లులు నేటికి రాకపోవడం తమ కుటుంబం రోడ్డున పడిందని దయచేసి బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి  మల్లిఖార్జున రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి వైసీపీకి మద్దతుగా పోలీంగ్ ఏజెంట్ గా విధులు నిర్వహించారని.. తనపై చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విచారించి చర్యలు తీసుకోవాలని  నారిపెద్ది వెంకట్రావు కోరారు. 

26   జిల్లాల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ.. సభ్యుల పదవీ కాలం  రెండు సంవత్సరాలనుండి 5 సంవత్సరాలకు పెంచాలని.  గౌరవ వేతనం ఇవ్వాలని  రాష్ట్ర స్థాయిలో బస్ పాసులు కల్పించాలని… ప్రతి సభ్యునికి ఐదు సెంట్లు స్థలం కేటాయించాలని.. పలు డిమాండ్లతో వారు అర్జీ అందించారు.

రాచర్ల మండలం చినగానిపల్లె గ్రామానికి చెందిన  సయ్యద్ ఖాసీం గ్రీవెన్స్ లో నేతల ముందు వాపోతూ.. వెలుగొండ ముంపు పొలాల్లో తమ పొలం ఉందని.. దాని పరిహారం కొట్టేయడానికి అధికారులు కుట్రపన్ని తన తండ్రి పేరు మార్చి రూ.  22, 13,564 పరిహారం మరోకరికి అందించి తనకు అన్యాయం చేయాశారని.. వారి నుండి పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.

సూళ్లూరు పేట నియోజకవర్గం నాయుడపేట చెందిన దార్ల రాజేంద్ర విజ్ఞప్తి చేస్తూ..  దళిత కులానికి చెందిన తనను  నాయుడు పేట మున్సిపాలిటలో 2021 ఎలక్షన్ సమయంలో  24 వార్డులు వైసీపీకి వన్ సైడ్ అవ్వగా 25 వార్డుకు తాను పోటిచేస్తే అక్కడికి వచ్చిన ఎస్సై , సీఐలు తాను పసుపు చొక్కా వేసుకుంటే విడిపించి అవమానించారని .. దళితున్నైన టీడీపీ కార్యకర్త పట్ల చిన్నచూపు చూసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి బుద్ది చెప్పాలని నేతలను కోరాడు. 

28.11.2022 న ఇచ్చిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోర్టు కేసుల వలన ఆగిపోయిందని.. దానిని త్వరగా పరిష్కరించి దేహదారుడ్య పరీక్షలు, రాత పరీక్ష నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని  డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై. రాము నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

135 రోజుల నుండి తమ కుమార్తె కనిపించడంలేదని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెళ్లి వెతుక్కోమని  బాధ్యాతారహితంగా మాట్లాడుతున్నారని.. తమ బిడ్డ ఆచూకి తెలిపి న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి చెందిన D. నాగేంద్ర నేతల ముందు వాపోయారు.

Comments