చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం.



*చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం*


*పిఎం సూర్యఘర్ ద్వారా మగ్గాలు ఉన్న వారికి ఉచిత విద్యుత్* 


*చేనేత, హస్తకళలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు* 


అమరావతి (ప్రజా అమరావతి):- చేనేత, హస్తకళల రంగంలో ఉన్నవారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగణంగా ఉత్పత్తుల తయారీలో మార్పులు చేపట్టి చేనేత, హస్త కళాకారుల ఆదాయం పెంచే మార్గాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దాదాపు రెండు సంవత్సరాల పాటు చేనేత, జౌళి, హస్తకళలపై కనీసం సమీక్ష నిర్వహించలేదని అధికారులు తెలిపారు. దీంతో ఈ శాఖలో పరిస్థితులు, స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమగ్ర సమీక్ష చేశారు. 35 చేనేత, 36 హస్తకళల క్లస్టర్ ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఉత్పత్తులను ఆధునీకరించడం, టెక్నాలజీ వాడకం, మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని...తద్వారా ఆ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సిఎం అన్నారు. త్వరలో కొత్త టెక్స్‌టైల్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిపుణులు, కన్సల్టెన్సీ ద్వారా చేనేత, హస్తకళలలో ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. చేనేత ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేయడానికి ఇ-కామర్స్ , రిటైల్ చైన్‌లతో జతకట్టాలని అన్నారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్‌ చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. పిఎం సూర్యఘర్ పథకం అమలు చేసి చేనేత మగ్గాలున్నవారికి 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సిఎం అన్నారు.  అదేవిధంగా ఇప్పటికే ప్రకటించినట్లు నేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం త్వరలో అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


Comments