రహదార్లు అన్నిటినీ 100 రోజుల్లోగా గుంతలు లేని రహదార్లుగా తీర్చిదిద్దండి:సిఎస్
అమరావతి,17, సెప్టెంబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని రహదార్లను గుంతలు లేని(Pothole Free) రహదార్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్అండ్బి శాఖ అధికారులను ఆదేశించారు.విద్య,ఉన్నత విద్య,మున్సిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,అటవీ,పర్యావరణ,శాస్త్ర సాంకేతిక,టిఆర్ అండ్బి,పౌర సరఫరాలు, గృహ నిర్మాణం,మహిళా శిశు,గిరిజన,యువజన సంక్షేమ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆశాఖల కార్యదర్శులతో సమీక్షించారు.ఆర్అండ్బి శాఖపై జరిగిన సమీక్షలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్నిరహదార్లను గుంతలు లేని రహదార్లుగా తీర్దిద్దాదాలని ఆదేశించారు.ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులు మంజూరైనందున త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.ప్రధాన రహదార్లుపై ఎక్కడెక్కడ గుంతలు ఉన్నది అవసమరైతే డ్రోన్ల ద్వారా గుర్తించి వాటిని సరి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.జాతీయ రహదార్లపై ఎలాగు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ గుంతలు లేకుండా చూస్తుందని,మిగతా రహదార్లపై గుంతలు లేకుండా చూడాలని చెప్పారు.అదే విధంగా రోడ్లపై గుంతలు సరిచేశాక సంబంధిత ఎఇ,డిఇఇ,ఇఇ,ఎస్ఇ ల నుండి వారి ప్రాంతంలోని రహదార్లకు సంబంధించి గుంతలు లేవని సర్టిఫికెట్లను తీసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు.రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మాట్లాడుతూ టెండర్లు ప్రక్రియను ప్రారంభించి టెండర్లు ఖరారు కాగానే గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
అంతకు ముందు విద్య,ఉన్నత విద్యాశాఖలకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద మధ్యాహ్న భోజన పధకం,ఎకడమిక్ క్యాలెండర్,నైపుణ్య శిక్షణ,వివిధ విద్యా సంస్థలకు రేటింగ్ ఇచ్చే ప్రక్రియ,ఐటిఐలు,పాలిటెక్నిక్లను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఇంటర్న్ షిప్పు,అప్రంటీస్ షిప్పు కల్పించడం వంటి అంశాలపై చర్చించారు.మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తూ ఇంకా ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్లు,డ్రైన్లను శుభ్రం చేయడం,అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం అంశాలపై సమీక్షించారు.అదే విధంగా పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి గ్రామ సచివాలయ వ్యవస్థ బలోపేతం,ఎల్ఇడి వీధి దీపాల ఏర్పాటు,ఘణ వ్యవర్ధాల నిర్వహణ వంటి అంశాలపై సిఎస్ సమీక్షించారు.
గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద లక్షా 25 వేల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వర్చువల్ గా పాల్గొని చెప్పారు.అనంతరం పౌర సరఫరాలు,గిరిజన,మహిళా శిశు సంక్షేమ,యువజన సంక్షేమ శాఖలకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయా శాఖల కార్యదర్శులతో చర్చించారు.
ఈసమావేశంలో రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్,పౌర సరఫరాల శాఖ కమీషనర్ మరియు సెర్ప్ సిఇఓ వీరప్యాండన్,ఎంఎయుడి జాయింట్ సెక్రటరీ రామ్ మోహన్ పాల్గొన్నారు.అలాగే అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూణషణ్ కుమార్, విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్,గిరిజన,మహిళా శిశు సంక్షేమ శాఖల కార్యదర్శులు కె.కన్నబాబు,సూర్యకుమారి,శాఫ్ ఎండి గిరీషా వర్చువల్ గా పాల్గొన్నారు.
addComments
Post a Comment