పల్నాడుకు నీరివ్వాలని నేను తాపత్రయపడ్డా.



*పల్నాడుకు నీరివ్వాలని నేను తాపత్రయపడ్డా*




*జగన్ రెడ్డి వచ్చాక పల్నాడును రక్తంతో తడిపేశాడు*


*రౌడీలను అడ్డు పెట్టుకుని పిన్నెళ్లి హత్యా రాజకీయాలకు తెరలేపాడు*


*పల్నాడులో పసుపు జెండా నిలబెట్టడం కోసం ప్రాణాలొదిలిన వారిని ఎన్నటికీ మరచిపోను*


*చంద్రయ్య, జల్లయ్య లాంటి కార్యకర్తల త్యాగాలు తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకుంటుంది*


*వరికపుడిశెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడుకు నీళ్లిస్తాం*


*రాష్ట్రాన్ని పురోభివృద్ధి బాటలో నడపాలనే లక్ష్యంతోనే కలిసి వచ్చాం*


*మైనార్టీలకు అండగా నిలిచింది తెలుగుదేశమే*


*ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయాలనే లక్ష్యంతోనే జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు*


*మన ఆస్తులకు ఉరి బిగించాలనుకున్న జగన్ పార్టీకి మనం ఉరితాడు బిగించాలి* 


*అధినేత నారా చంద్రబాబు నాయుడు*


*వర్షం కారణంగా మాచర్ల సభకు హెలికాప్టర్ లో వెళ్లలేకపోయిన చంద్రబాబు*


 **తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి లైవ్ ద్వారా ఒంగోలు నుంచి చంద్రబాబు ప్రసంగం*


మాచర్ల (ప్రజా అమరావతి): పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనం. ఐదేళ్ల జగన్ రెడ్డి అరాచకంపై ఆవేదన, కసి ఉంది. జగన్ రెడ్డిని ఓడించాలనే ఆవేశం మీలో ఉంది. ఆ ఆవేశం తిరుగుబాటుగా కనిపిస్తోంది. పల్నాడు ప్రాంతంలో పసుపు జెండా నిలబెట్టడం కోసం మన కార్యకర్తలు చేసిన త్యాగాలు మరచిపోలేను. వారు విడిచిన ప్రాణాలను కూడా మరచిపోను. ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య, జల్లయ్య లాంటి కార్యకర్తలకు ఈ వేధికగా నివాళులర్పిస్తున్నా. చంద్రయ్య పీకపై కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తామన్నా అతను మాట వినకుండా ప్రాణాలొదిలాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ మరచిపోను. ఒక కార్యకర్త పార్టీని ఎంతగా ప్రేమిస్తాడో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పల్నాడు ప్రాంతంలో 30 మంది టీడీపీ కార్యకర్తల్ని ఈ వైసీపీ రౌడీలు పొట్టన పెట్టుకున్నారు. అయినా ఏ కార్యకర్తా వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ జెండా పట్టుకుని గర్వంగా తిరుగుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో వైసీపీ రౌడీ మూకల్ని తరిమికొట్టి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బ్రహ్మారెడ్డి గెలుస్తున్నారు. పల్నాడులో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాను. అభివృద్ధే ధ్యేయంగా పని చేసే మరో నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు. రైతులకు మేలు చేయాలి. నీళ్లిచ్చి ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయాలని తపిస్తున్నారు. వారికి తోడ్పాటు అందించే బాధ్యత నేను తీసుకుంటాను.


తెలుగుదేశం పార్టీ చేసిన త్యాగాలను ఎన్నటికీ మరచిపోను. ప్రతి ఒక్క కార్యకర్తకూ భరోసా ఇస్తున్నాను మీకు అండగా నేనుంటాను. రాష్ట్రం కోసం పోరాడుతున్న నాయకుడు పవన్ కల్యాణ్ త్యాగం మరిచిపోలేనిది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ధ్యేయంతో పని చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. పొత్తుతో గెలవాలని ప్రతిపాదించి అందరినీ ఒప్పించారు. వారి స్ఫూర్తిని కొనసాగించాలి. రాష్ట్రాన్ని కాపాడాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకొచ్చింది. మాచర్లలో సైకిల్ గుర్తుపై ఓటేసి.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల్ని గెలిపించాలి. మేము జట్టు కట్టింది ప్రజల కోసం. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. మన బిడ్డల భవిష్యత్ వెలగాలనే ఏకైక లక్ష్యంతో కూటమిగా వస్తున్నాం. రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. రివర్స్ పాలనతో వ్యవస్థల్ని విధ్వంసం చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డాం. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని పురోభివృద్ధి బాటలో నడపాలనే లక్ష్యంతోనే కలిసి వచ్చాం.


పల్నాడు ప్రాంతంలో ముస్లిం సోదరులున్నారు. బీజేపీతో కలిసినందున ముస్లింలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. గతంలో ఎన్డీఏలో ఉన్నాం. గతంలో ఎవరూ చేయలేనంత మేలు అప్పుడు చేశాం. 2014-19 మధ్య కూడా చేశాం. ఉర్దూ యూనివర్శిటీలు, రెండో భాషగా ఉర్ధూని ప్రకటించింది తెలుగుదేశమే. హజ్ హౌస్ కట్టించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. రాష్ట్రం విడిపోయిన తర్వాత మైనార్టీలకు అండగా నిలిచింది తెలుగుదేశమే. ఎవరూ చేయలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించాం. దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య, మౌజం ఇమాంలకు గౌరవ వేతనాలు లాంటి ఎన్నో పథకాలతో తోడుగా నిలిచాం. కానీ అన్ని పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించిందే తెలుగుదేశం. తర్వాత వాటిని కాపాడుతూ వచ్చాం. ఇప్పుడు వాటిన రద్దు చేయాలని జగన్ రెడ్డి ఆర్.కృష్ణయ్య ద్వారా కోర్టుకు వెళ్లిన దుర్మార్గుడు. అలాంటి వ్యక్తి రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పడం హాస్యాస్పదం. దేశంలోని మత పెద్దలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడం సంతోషకరం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మత సామరస్యం పాటించిందని, ముస్లింల హక్కులు కాపాడేది కూడా తెలుగుదేశమేనని వారంతా చెబుతున్నారు.


పార్లమెంటులో సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు ఢిల్లీలో మద్దతిచ్చి, గల్లీలో నీచమైన రాజకీయం చేస్తున్న నీచుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఎప్పుడూ ముసుగు రాజకీయమే. కేసుల కోసం ఢిల్లీలో మద్దతిచ్చి, ఇక్కడ ప్రతిపక్షాలను మద్దతిస్తున్నాడు. రేపు పార్లమెంటు లో ఒక్క సీటు గెలిస్తే.. ఆ సీటు ఎవరికి మద్దతిస్తుందో సమాధానం చెప్పగలరా? రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా.. జగన్ రెడ్డి రద్దు చేసిన అన్ని మైనార్టీ పథకాలను పునరుద్దరిస్తాను. మక్కా యాత్రకిచ్చే ఆర్ధిక సహాయాన్ని రూ.లక్షకు పెంచుతాను.


విధ్వంసకారుడు, దోపిడీదారుడు, సైకో ఏకమైతే ఈ జగన్ రెడ్డి. పల్నాడులో ప్రజలంతా సంతోషంగా ఉండాలి. పంటలతో పచ్చగా ఉండాలని మేము తపిస్తే.. జగన్ రెడ్డి పల్నాడును రక్తంతో తడిపేశాడు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకు, హింసకు తెరలేపాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగులబెట్టాడు. ఇళ్లల్లో దూరి దాడులు చేశాడు. కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడనే విషయాన్ని వైసీపీలోని ఫ్యాక్షనిస్టులు గుర్తుంచుకోవాలి. రౌడీ రాజకీయాల్ని తుదముట్టిస్తా. మిస్టర్ పిన్నెళ్లీ నీ కథలు కట్టి పెట్టు. గతంలో ఆత్మకూరు నుండి ప్రజలు గ్రామాలు వదిలి పారిపోతే.. వారిని తీసుకొచ్చేందుకు వెళ్తుంటే నా ఇంటి గేటుకు తాళ్లు కట్టి అడ్డుకున్నారు. ఆ రోజు నా ఇంటి గేటుకు కట్టిన తాళ్లే నేడు మీ ప్రభుత్వానికి ఉరితాళ్లు కాబోతున్నాయి. మాచర్ల మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్నలపై హత్యాయత్నం చేశారు. ఇలాంటి అరాచకాలను సహించను. మాచర్లలో తిరుగుబాటు మొదలైంది. విప్లవంగా మారుతోంది. పిన్నెళ్లి సహా రౌడీలందరినీ అణచివేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క ఘటనకూ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. నేను కన్నెర్ర జేసి ఉంటే ఈ రాజకీయ రౌడీల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరు. నమ్మి ఓట్లేసిన పల్నాడు ప్రాంతానికి ఈ సైకోలు ఏం చేశారో సమాధానం చెప్పగలరా?


పల్నాడు ప్రాంతానికి నీరు ఇవ్వలేకపోయారు. ఉద్యోగాలివ్వలేదు. పరిశ్రమలు లేవు, కనీసం రోడ్లు కూడా వేయలేకపోయాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గోదావరి నీరు కృష్ణా డెల్టాకు తెచ్చి సాగర్ కుడి కాల్వకు తేవాలని ప్రయత్నించాం. వైకుంఠపురం బ్యారేజీ కట్టి రైట్ మెయిన్ కెనాల్ కి నీరివ్వాలని ప్రణాళికలు రూపందించాం. దాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద వరికపుడిశల వద్ద లిఫ్ట్ మంజూరు చేశాం. నిధులు కూడా కేటాయించాం. దాన్ని జగన్ రెడ్డి రద్దు చేసి మరోసార పునాదులేసి ప్రాజెక్టుని పాడు చేశాడు. 


జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల్ని లాక్కోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చాడు. పట్టాదారు పాస్ పుస్తకాన్ని చూడండి. మీ పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ రెడ్డి ఫోటో ఏంటి? మీ తండ్రి ఇచ్చిన ఆస్తిపై, మీరు కష్టబడి సంపాదించుకున్న ఆస్తిపై ఈ తుగ్లక్ ఫోటో ఏంటి? అతనేదో మీకు భమి దానం చేసినట్లు మీరు దానం తీసుకున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికే జగన్ రెడ్డి వచ్చాక రౌడీయిజం, దోపిడీలు పెరిగిపోయాయి. ఇలాంటి అరాచకాల్లో పిన్నెళ్ల రామకృష్ణారెడ్డి పీహెచ్డీ చేశాడు. 


రాష్ట్రంలోని ప్రజలందరి ఆస్తులు కబ్జా చేయాలనే ఆలోచన నుండి పుట్టిందే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ పేరుతో ఉన్న ప్రతి ఆస్తికి సంబంధించి జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చి, ఒరిజినల్ వారి దగ్గర పెట్టుకుంటారు. అప్పుడు వాటితో మీ భూమి తాకట్టు పెడతారో, రికార్డులు మార్చేస్తారో ఎవరికీ తెలియదు. బ్రిటీష్ కాలం నుండి ప్రతి గజానికీ డాక్యుమెంట్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ, జగన్ రెడ్డి వచ్చాక అన్ని భూముల్ని ఆన్ లైన్ చేసి, దాన్ని మెయింటెయిన్ చేసే బినామీ కంపెనీ ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు. మన రికార్డులు మన దగ్గర లేకుంటే అమ్మాలన్నా, కొనాలన్నా టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరకి వెళ్లాలి. అతను ఒప్పుకుంటేనే అమ్మకమైనా కొనుగోలు అయినా జరుగుతుంది. ఆ ఆఫీసర్ ఎవరంటే.. జగన్ రెడ్డి నామినేట్ చేసిన ప్రైవేటు వ్యక్తి మన జాతకాలు డిసైడ్ చేస్తాడంట. నా భూమిన అమ్ముకోవాలో లేదో ఇంకేమైనా చేసుకాలంటే వారి అనుమతి తీసుకోవాలా? వారసత్వంగా వచ్చే భూమిపై ఏదైనా వివాదం వస్తే.. ఎమ్మార్వో, ఆర్డీవో ఎవరికీ సంబంధం లేదు. వీరు నామినేట్ చేసిన వ్యక్తి అది మన భూమి అని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. వారు ఒప్పుకుంటేనే అది మన భూమి అవుతుంది. మొన్నీ మధ్యే ఒంటిమిట్టలో ఒక వ్యక్తికి సంబంధించిన భూమి కబ్జా చేయడంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ యాక్ట్ ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. మన మెడలకు ఉరితాడు వేసేందుకు ప్రయత్నిస్తున్న జగన్ రెడ్డి పార్టీకి ఉరితాడు వేయాలి. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి. మన భూమి మన బిడ్డలకు దక్కాలంటే ఈ దొంగ బిడ్డను ఇంటికి తరలించాలి. ఇప్పటికే సెటిల్మెంట్లు చేస్తున్నారు. జీవితాంతం కష్టబడి సంపాదించిన ఆస్తిని మెడపై కత్తి పెట్టి రాయించుకుంటున్నారు. ఇసుక దందా, భూ కబ్జాలు, వాహనాల నుండి దాదాగిరి చేస్తున్న ఘటనలు మాచర్లలో నిత్యకృత్యమైపోయాయి. ప్రజల ఆస్తుల్ని, ప్రజల జీవితాల్ని హైజాక్ చేసేలా వ్యవహరిస్తున్న ఈ చట్టాన్ని ఉపేక్షించరాదు. ప్రైవేటు వ్యక్తి నా రికార్డులు పర్యవేక్షించే హక్కు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలి. నా తండ్రి, నా తాత నుండి నాకు వచ్చిన భూమిపై నీ ఫోటో వేసుకోవాల్సిన హక్కు ఎవరిచ్చారు? గులాంగిరీ చేస్తామంటే ప్రజలు సహించబోరు. కూటమి అధికారంలోకి రాగానే రెండో సంతకంతో చట్టాన్ని రద్దు చేస్తా. పట్టాదారు పాస్ పుస్తకంపై రాజముద్ర వేసి అందించి తీరుతాను. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించండి.



అమరావతి రాజధానిని నాశనం చేసి, సంపదను నాశనం చేశాడు. అదే జరిగి ఔటర్ రింగు రోడ్ వచ్చి ఉంటే.. రాష్ట్రం ఎంతలా అభివృద్ధి చెందేదో ఒక్కసారి ఆలోచించండి. ప్రజల జీవన ప్రమాణాలు మార్చడమే లక్ష్యంగా సూపర్ సిక్స్ ప్రకటించాం. అదే సమయంలో రూ.4000 పెన్షన్ ప్రకటించాం. చంద్రన్న బీమా, బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు అండగా నిలుస్తాం. రవాణా రంగంలోని డ్రైవర్లందరికీ సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున అందించి అండగా నిలుస్తాం. ప్రజలకు బాదుడు లేని పాలన అందించే బాధ్యత తీసుకుంటాను. అదే సమయంలో సంపద సృష్టించి ప్రజల ఆదయాం పెంచే బాధ్యత నేను తీసుకుంటాను. 


ప్రజల కోసం పని చేసే నాయకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, బ్రహ్మారెడ్డిని గెలిపించండి. గెలిచిన వెంటనే మాచర్లకు వస్తాను. కుప్పం నియోజకవర్గంతో సమానంగా మాచర్లను చూసుకుంటా. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా. ఎండగా ఉందని, ఏమైపోతుందని ఎవరూ అశ్రద్ద చూపొద్దు. ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. ఆ ఓటు కూటమికి వేసి భవిష్యత్తుకు పునాదులు వేద్దాం. ఉదయం 10 లోగా మన ఓట్లన్నీ పోల్ అయ్యేలా చూడాలి. కావాలని గొడవలు పెట్టుకుని ఓటింగ్ తగ్గించేందుకు కుట్రలు చేస్తారు. వారి కుట్రల్ని తిప్పి కొడదాం. నిన్న ఉద్యోగుల ఓటింగులో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అదే స్ఫూర్తితో కూటమి అభ్యర్ధుల్ని గెలిపించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నా.

Comments