ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్‌‌'‌ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్.

 భారతదేశం 2036 నాటికి టాప్-10 క్రీడాదేశంగా, 2047 నాటికి టాప్-5 దేశంగా అవతరించడంలో 'ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్‌‌'‌ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్




9-18 సంవత్సరాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే లక్ష్యంతో 'కీర్తి' కార్యక్రమం ప్రారంభం

చండీగఢ్  (ప్రజా అమరావతి);

భారతదేశం 2036 నాటికి టాప్-10 క్రీడాదేశంగా, 2047 నాటికి టాప్-5 దేశంగా అవతరించడంలో 'ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్‌‌'‌ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి  శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. మంగళవారం, చండీగఢ్‌లోని సెక్టార్ 7 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 'కీర్తి' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 9-18 సంవత్సరాల మధ్య వయస్సున్న పాఠశాల విద్యార్థుల కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. 1. దేశంలోని ప్రతి మూల నుంచి ప్రతిభను వెలికితీయడం, 2. మత్తు పదార్థాలు, సెల్‌ఫోన్ల వంటి వ్యసనాలను అరికట్టడానికి క్రీడలను సాధనంగా ఉపయోగించడం.


దేశంలో క్రీడల సంస్కృతిని నిర్మించడం, ఒలింపిక్స్ & ఆసియా క్రీడలు వంటి ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి పతకాలు సాధించగల ప్రతిభను సృష్టించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్ష 'కీర్తి' కార్యక్రమం అని శ్రీ ఠాకూర్ ఉద్ఘాటించారు.


'కీర్తి' కార్యక్రమం దేశంలోని 50 కేంద్రాల్లో ఘనంగా ప్రారంభమైంది. మొదటి దశలో అథ్లెటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్‌బాల్ సహా 10 క్రీడల్లో 50 వేల మంది దరఖాస్తుదార్లను వడపోశారు. 'నోటిఫైడ్ టాలెంట్ అసెస్‌మెంట్ సెంటర్‌'ల ద్వారా ప్రతిభను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఏడాదిలో 20 లక్షల మూల్యాంకనాలు నిర్వహించాలన్నది 'కీర్తి' లక్ష్యం.


"ఈ స్థాయి శిక్షణ కార్యక్రమం భారతదేశంలో మొదటిది. మన దేశం 2036 నాటికి ప్రపంచంలోని టాప్ 10 క్రీడా దేశంగా, 2047 నాటికి టాప్‌ 5 దేశాల్లో ఒకటిగా ఎదగాలనుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమం జీవం పోసుకుంది" అని శ్రీ ఠాకూర్ అన్నారు.


యువత దేశ నిర్మాతలు అని చెప్పిన శ్రీ ఠాకూర్, క్రీడల్లో ఫలితాలను సాధించాలంటే చిన్న వయస్సు నుంచే సాధన ప్రారంభించాలన్నారు. ఒక అథ్లెట్‌కు ఒలింపిక్ పతకాన్ని గెలవడానికి కనీసం 10 సంవత్సరాల సన్నద్ధత అవసరమని చెబుతూ, "దేశంలోని ప్రతి మూలను చేరుకోవాలని, క్రీడల్లో రాణించడానికి ఏం చేయాలో తెలీని ప్రతి చిన్నారితో అనుసంధానం కావాలని 'కీర్తి' కోరుకుంటోంది. ఆట ఆడే ప్రతి ఒక్కరు పతకం గెలవలేరని మాకు తెలుసు. కానీ, యువతను మత్తు పదార్థాలు డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు క్రీడలను ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ప్రతి చిన్నారి మైభారత్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. మేం వారి వద్దకు వెళ్లి 'కీర్తి' ద్వారా అవకాశం కల్పిస్తాం" అని శ్రీ ఠాకూర్‌ చెప్పారు.


సమాచార సాంకేతికత ఆధారంగా, పారదర్శక పద్ధతిలో 'కీర్తి' కోసం ఎంపిక జరుగుతుంది. ఔత్సాహిక క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని అంచనా వేయడానికి కృత్రిమ మేథ ఆధారంగా డేటా అనలిటిక్స్‌ను ఉపయోగిస్తారు. ఈ స్థాయి నైపుణ్యాన్వేషణ వ్యవస్థకు జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహాత్మక సహకారం అవసరమని శ్రీ ఠాకూర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మౌలిక సదుపాయాల కోసం రూ.3000 కోట్లు ఖర్చు చేసిందని, దేశవ్యాప్తంగా 1000కి పైగా ఖేలో ఇండియా కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు.


చండీగఢ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కిరణ్ ఖేర్, చండీగఢ్ రాష్ట్ర అధికారులు, ప్రముఖ క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


'కీర్తి' కార్యక్రమాన్ని శ్రీమతి ఖేర్‌ ప్రశంసించారు. కపిల్ దేవ్, యువరాజ్ సింగ్, అభినవ్ బింద్రా వంటి ప్రముఖ క్రీడాకారులను చండీగఢ్ అందించిందని, ఈ పథకం ఆటగాళ్లకు అతి పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు.


“తమ బిడ్డ జీవితంలో ఏదైనా సాధించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, చాలాసార్లు కలలు-వాస్తవాలు వేర్వేరుగా ఉంటాయి. కనీసం క్రీడల్లోనైనా ఆ అంతరాన్ని తగ్గించడానికి 'కీర్తి' సాయం చేస్తుంది. ఆడాలని, క్రీడల్లో రాణించాలని కోరుకునే ప్రతి బిడ్డకు ఇప్పుడు ఒక మార్గం ఉంది” అని శ్రీమతి ఖేర్ చెప్పారు.


చండీగఢ్‌లోని సెక్టార్ 7 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎంపిక ప్రక్రియ కోసం చాలా మంది బాలబాలికలు తరలివచ్చారు.


ఆసియా క్రీడలు, గత సంవత్సరం బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ మీట్‌లో నీరజ్ చోప్రాకు గట్టి పోటీ ఇచ్చిన జెనాను శ్రీ ఠాకూర్ సన్మానించారు.


2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్న భారతదేశ ఉద్దేశాన్ని శ్రీ ఠాకూర్ మరోసారి వెల్లడించారు.


“మనం ప్రపంచ శక్తిగా మారాలంటే క్రీడాశక్తిని ప్రదర్శించాలి, ఉపయోగించుకోవాలి. సంగీతం, చలనచిత్రాలు, క్రీడలు వంటివాటిలో మనం సమర్థులం. నైపుణ్యాన్ని మరింత సానబెట్టడంలో 'కీర్తి' సాయపడుతుంది. ప్రభుత్వం వైపు నుంచి అన్ని సహాయసహకారాలను అందించవలసి ఉంటుంది, అది ప్రధానం” అని కేంద్ర మంత్రి చెప్పారు.

 


'కీర్తి' ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రసంగం తాలూకు ట్విట్టర్ లింక్‌ ఇవి:


https://x.com/ianuragthakur/status/1767477378547142685?s=48&t=i-_pAF8vR1iF0agU_b9IbA


https://x.com/ANI/status/1767438111389204991?t=8ZMxw24qK_PTE22LLduWdw&s=08


 

''ఖేలో ఇండియా మిషన్'' గురించి


కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రాధాన్యత పథకాల్లో 'ఖేలో ఇండియా మిషన్' ఒకటి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనల్లోంచి ఈ కార్యక్రమం ఉద్భవించింది. 'ఖేలో ఇండియా మిషన్' దేశంలో క్రీడల సంస్కృతిని పెంచడం, క్రీడా నైపుణ్యాన్ని సాధించడం ఈ కార్యక్రమం లక్ష్యం. 'ఖేలో ఇండియా మిషన్'‌లోని "క్రీడల పోటీలు & నైపుణ్యాభివృద్ధి" విభాగం కింద, దేశంలోని క్రీడల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, అట్టడుగు స్థాయి & ఉన్నత స్థాయి అథ్లెట్ల గుర్తింపునకు, ప్రతిభను పెంచడానికి "టాలెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ డెవలప్‌మెంట్" పని చేస్తుంది.

Comments