ఉపాధిహామీ ద్వారా ఖచ్చితంగా 100 రోజుల పనిదినాలు కల్పించేందుకు చర్యలు తీసుకోండి .

 ఉపాధిహామీ ద్వారా ఖచ్చితంగా 100 రోజుల పనిదినాలు కల్పించేందుకు చర్యలు తీసుకోండి 


అమరావతి,20 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం ద్వారా పెద్దఎత్తున ఉపాధి పనులు కల్పించేందుకు ముఖ్యంగా ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజులు పనిదినాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈమేరకు మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఉపాధి హామీ పధకం,తాగునీరు అంశాలపై పంచాయితీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కరువు ప్రభావిత జిల్లాలు సహా ఇతర జిల్లాల్లో ఉపాధి హామీ పధకం ద్వారా పెద్దఎత్తున కూలీలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా, వైయస్సార్ కడప,అనంతపురం జిల్లాలు సహా ప్రకాశం,పల్నాడు తదిదర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి పెద్దఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని చెప్పారు.మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడ ఎక్కువ ఉపాధి పనులు నిర్వహించేందుకు అవకాశం ఉందో పరిశీలించి ఆప్రకారం షెల్ప్ ఆఫ్ ప్రాజెక్టులు రూపొందించి వేగవంతంగా పనులు చేపట్టాలని సిఎస్ ఆదేశించారు.

అదే విధంగా గృహ నిర్మాణ లబ్దిదారులకు ఆయా గృహాలు నిర్మించుకునేందుకు ఉపాధి హామీ కింద 90 రోజుల పనిదినాలను కల్పిస్తున్నందున వివిధ గృహనిర్మాణాలు వేగంవంతంగా జరిగేలా గృహ నిర్మాణశాఖ అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి పిఆర్ అండ్ ఆర్డి అధికారులను ఆదేశించారు.

తదుపరి గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం,రైతు భరోసా కేంద్రాలు తదితర భవనాల నిర్మాణాల ప్రగతిని సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.అనంతరం రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇంకా జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు.

ఈసమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,ఆశాఖ కమీషనర్ ఎ.సూర్యకుమారి,ఇఎన్సిలు బి.బాలూ నాయక్,ఆర్వి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments