గుంటూరు,
06 డిసెంబర్ (ప్రజా అమరావతి);
ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలు తయారు చేస్తాం – కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
• తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే కిలారీ వెంకట రోశయ్య.
• వర్షాలకు దెబ్బతిన్న వరి, మినుము పంటలను, అరటి తోటలను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ లు.
• జిల్లాలోని మండలాల్లో 150 నుంచి 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
• పంట పొలాల్లో నిలిచిపోయిన నీళ్లు బయటకు పంపే ఏర్పాట్లు.
• తుఫాను ప్రభావంతో వివిధ శాఖలకు సంబంధించి జరిగిన నష్టాలపై ప్రభుత్వానికి వెంటనే పూర్తి స్థాయిలో నివేదిక అందజేస్తాం.
మిచాoగ్ తుఫాన్ కారణంగా పెదకాకాని మండలం ఉప్పలపాడు, వెంకట కృష్ణాపురం, తెనాలి మండలం లోని హాఫ్ పేట, ఈమని గ్రామాలలో నీట మునిగిన పంటలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు శాసన సభ్యులు కిలారీ వెంకట రోశయ్య తెనాలి సబ్-కలెక్టర్ గీతాంజలి శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టంపై ఎన్యూమేరేషన్ చేపట్టడం జరుగుతుందని, ఆ మేరకు నష్ట పరిహారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు వలన పంట పోలాల్లో నిల్వ ఉన్న నీటిని తక్షణమే డ్రైయిన్ల ద్వారా వెలుపలకు పంపించేలా వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇరిగేషన్, డ్రైనేజీ శాఖ అధికారులు పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలాలు వారీగా అవసరమైన జెసీబీ ,ఇతర మిషనరీలు అందుబాటులో లేకపోతే రవాణాశాఖ అధికారులకు వివరాలు అందిస్తే వెంటనే సమకూర్చటం జరుగుతుందన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో వర్షాలు వలన పారిశుద్ధ్య సమస్యలు లేకుండా నిరంతరం పరిశుభ్రత కార్యక్రమాలు పక్కాగా చేపట్టేలా మున్సిపల్, పంచాయితీ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నారని, త్రాగునీటిని పూర్తి స్థాయిలో క్లోరినేషన్ చేసి సురక్షితమైన నీటిని అందించటానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వర్షాలు వలన వ్యాధులు వ్యాప్తిచెందకుండా ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై పంచాయితీ, మున్సిపల్ శాఖ అధికారులకు అవసరమైన సూచనలు అందించాలని డీఎంహెచ్ఓ కు సూచించారు. పశువులకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో వివిధ శాఖలకు సంబంధించి జరిగిన నష్టాలపై ప్రభుత్వానికి వెంటనే పూర్తి స్థాయిలో నివేదిక అందజేస్తామన్నారు. అనంతరం మీడియా వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిచాoగ్ తుఫాన్ వలన జిల్లాలో పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలలో పర్యటించి దెబ్బతిన్న వరి, మినుము, అరటి పంటలను వ్యవసాయ, ఉద్యాన శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు మండలాలలో దాదాపు 150 మి.మీ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాలలో 200 మి.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని, వరుసగా 2 రోజుల్లో 36 గంటల్లో ఇంత ఎక్కువుగా వర్షపాతం నమోదు అవుటంతో వరి, మినుము, అరటి చేలల్లో అధికంగా నీళ్లు నిలవ వున్నాయన్నారు. నీళ్లు బయటకి పంపడానికి రైతులతో మాట్లాడి ఎక్కడికక్కడ పరిష్కారం కనుగొని నీళ్ళను బయటికి పంపించే కార్యక్రమాలు చేయమని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. స్వయంగా వ్యవసాయ, ఉద్యాన శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో పరిశీలించడం జరిగిందని, పొలాలలో నిలిచిన నీటిని ఎంత డబ్బు ఖర్చు అయిన బయటికి పంపించేందుకు ఇరిగేషన్ అధికారులు పరశీలిస్తున్నారన్నారు. నీటిని ఎంత త్వరగా బయటికి పంపించగలిగితే అంత మంచిదని, ఇప్పటికే డ్రయిన్స్ పొంగి పొర్లుతున్నాయని ఎంత తొందరగా నీళ్ళను బయటికి పంపితే అంత త్వరగా పంటలను రక్షించగలుగుతామన్నారు. రైతులు, కౌలు రైతులకు వర్షాల వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చిందని .ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లతో ఈరోజు సమీక్ష నిర్వహించనున్నoదున జరుగుతున్న నష్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తామని, రెండు రోజుల తరువాత పంట నష్టంపై అవగాహన వస్తుందని దాని పై గ్రామాలలో పంట నష్టం పై సర్వే చేసి నష్ట పరిహారానికి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయటం జరుగుతుందని తెలిపారు.
ఈ పంట పొలాల పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ డివిజినల్ అధికారి శ్రీకర్, జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు రవీంద్ర బాబు, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీరు ఉమా మహేశ్వర రావు, పిడి డ్వామా వెంకట శివ రామిరెడ్డి, మంగళగిరి తహశీల్దార్ మల్లేశ్వరి, వ్యవసాయ మండల అధికారులు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment