సన్సద్ ఆదర్శ గ్రామ యోజనలో పంచాయితీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి:సిఎస్

 సన్సద్ ఆదర్శ గ్రామ యోజనలో పంచాయితీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి:సిఎస్ 

అమరావతి,20 అక్టోబరు:సన్సద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక చేసిన గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈమేరకు శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈపధకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో రహదారి సౌకర్యాలు,తాగునీరు,విద్యుత్,ఆర్గానిక్ ఫార్మింగ్,ఘణ,ద్రవ వ్యర్ధాల నిర్వహణ,ఆరోగ్యం,ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు సకాలంలో పూర్తి చేసి ఆయా గ్రామ పంచాయితీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ సన్సద్ ఆదర్శ గ్రామ యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజన అనేది గ్రామాలలో అభివృద్ధిపై విస్తృతంగా దృష్టి సారించే ఒక గ్రామీణ అభివృద్ధి కార్యక్రమని దీనిని 2014 అక్టోబర్ 11న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని తెలిపారు.మహాత్మా గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా భారతదేశంలోని గ్రామాల్లో మార్పును తీసుకు రావటం దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాల పెరుగుదల,విపరీతమైన బాధల కారణంగా వలసలలో క్షీణత,సరైన రిజిస్ట్రేషన్‌తో జనన మరణాల 100% డాక్యుమెంటేషన్,కమ్యూనిటీలు మంజూరు చేసిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ,బానిసత్వం,బాండెడ్ లేబర్,మాన్యువల్ స్కావెంజింగ్ మరియు బాల కార్మికుల నుండి సామాజిక స్వేచ్ఛ,వర్గాల మధ్య సామాజిక న్యాయం, సామరస్యం మరియు శాంతిని నెలకొల్పడం,సమగ్ర అభివృద్ధికి ఇతర గ్రామ పంచాయతీలను స్పూర్తిగా నింపడం వంటివి ఈపధకం ముఖ్య ఆశయాలను రాజశేఖర్ స్పష్టం చేశారు.

రాష్టంలో 25 మంది లోక్ సభ ఎంపిలు,11మంది రాజ్యసభ ఎంపిలు ఉన్నారని ప్రతి ఒక్కరూ ఒక గ్రామ పంచాయితీని దత్తత తీసుకుని ఆ గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్రమైన సాంఘిక పురోగతి చోటు చేసుకొనే విధంగా మార్గదర్శకత్వం వహించాలనేది ఆపధకం ముఖ్య ఉద్యేశ్యమని పేర్కొన్నారు.ఈవిధంగా దత్తత తీసుకున్న గ్రామాల్లో ముఖ్యంగా పూర్తి స్థాయిలో రహదారి కనక్టవిటీ,తాగునీటి సరఫరాలో స్వయం సమృద్ధి,ఆర్గానిక్ ఫార్మింగ్, ఘణ,ద్రవ వ్యర్ధాల నిర్వహణ,రెన్యువల్ ఎనర్జీ,పాఠశాలల్లో నూరు శాతం ఎన్రోల్మెంట్,ఆరోగ్యం,ఆ గ్రామ పంచాయితీ పూర్తిగా డిజిటైజేషన్,సామాజిక భద్రత పధకంలో నూరు శాతం ఎన్రోల్మెంట్, అడవుల పెంపకం కార్యక్రమం వంటి చేపట్టాలనేది ఈపధకం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.అదే విధంగా ఆగ్రామ పంచాయతీ యొక్క సమగ్ర అభివృద్ధికి దారితీసే ప్రక్రియలను ఉత్తేజపరచడం జనాభాలోని అన్ని వర్గాలలో జీవన నాణ్యత మరియు జీవన ప్రమాణాలను సమర్థవంతంగా మెరుగుపరచడం,అధిక ఉత్పాదకతను ప్రేరేపించడంపట్టణాలకు ధీటుగా పల్లె ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నదే ఈపధకం ముఖ్య లక్ష్యమన్నారు.పార్లమెంట్‌ సభ్యులు తమ నియోజకవర్గాలు,రాజ్యసభ సభ్యులు దేశంలోని ఏవైనా గ్రామాలను ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసే విధంగా రూపొందించిన పథకమే సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజన అని తెలిపారు.ఈ క్రమంలో పలు అంశాల్లో ప్రగతి సాధించిన గ్రామాలకు తగిన ప్రోత్సాహకాలు అందించడం తోపాటు ఎస్‌ఏజీవై కింద ఆదర్శ గ్రామాలుగా కేంద్రం ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

    సంసద్‌ ఆదర్శ  గ్రామీణ యోజనకు కొత్త నిధులు కేటాయించబడవని అయితే ఇప్పటికే అమలులో ఉన్న వివిధ పథకాల ద్వారా నిధులు సేకరించవచ్చని ఉదాహారణకు ఇందిరా ఆవాస్ యోజన,ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం,బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్,పార్లమెంటు సభ్యుడు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(MPLADS),గ్రామ పంచాయతీ సొంత ఆదాయం,కేంద్ర మరియు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు,కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు వినియోగించుకోవచ్చునని స్పెషల్ సిఎస్ రాజశేఖర్ తెలిపారు.

కాగా సన్సద్ ఆదర్శ గ్రామ యోజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ దశలో ఉందని ఇప్పటి వరకూ 129 గ్రామ పంచాయితీలను ఎంపిలు దత్తత తీసుకున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వివరించారు.ఈ129 గ్రామ పంచాయితీలకు సంబంధించి విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశామని తెలిపారు.ఈ 129 గ్రామ పంచాయితీల్లో పనుల పర్యవేక్షణకు 129 మంది ఎంపిడిఓ ఆపై స్థాయి అధికారులను చార్జ్ అధికారులుగా నియమించామని పేర్కొన్నారు.ఈ 129 గ్రామ పంచాయితీల్లో 11వేల 996 పనులు చేపట్టగా ఇప్పటికే 10వేల 104 పనులు పూర్తి చేసి 84శాతం లక్ష్యాన్ని సాధించామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వివరించారు.

ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,పిఆర్ అండ్ ఆర్డి ఇఎన్సి తదితర అధికారులు పాల్గొన్నారు.



Comments