హైంద‌వ ధ‌ర్మానికి విస్తృత ప్రాచుర్యం.

 *హైంద‌వ ధ‌ర్మానికి విస్తృత ప్రాచుర్యం


*  


*అక్టోబ‌రు నుంచి మార్చి వ‌ర‌కు ధ‌ర్మ‌ప్ర‌చార వారోత్స‌వ, మాసోత్స‌వాలు*


*సంస్కృతిలో భాగమైన య‌క్ష‌గాన ప్ర‌క్రియ‌ను వినియోగించుకుంటాం*


*డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవ‌దాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌*


అమ‌రావ‌తి, సెప్టెంబ‌రు 12 (ప్రజా అమరావతి):- స‌నాత‌న హిందూ ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ కోసం ఆల‌యాల‌ను కేంద్రంగా చేసుకుని దేవ‌దాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని 5వ బ్లాకులో మంగ‌ళ‌వారం జ‌రిగిన ధ‌ర్మ‌ప్రచార ప‌రిష‌త్ స‌మావేశంలో మాట్లాడారు. ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న మేజ‌ర్ టెంపుల్స్ ద్వారా ధ‌ర్మ‌ప్ర‌చార మాసోత్స‌వాలు, అలాగే రాష్ట్రంలోని 6-ఎ ఆల‌యాల ద్వారా ధ‌ర్మ‌ప్ర‌చార వారోత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో దేవదాయ శాఖ ప‌రిధిలో 115 వ‌ర‌కు 6-ఎ ఆల‌యాలు ఉన్నాయ‌ని చెప్పారు. వీటి ద్వారా స్ఫూర్తిదాయ‌క‌మైన థార్మిక కార్య‌క్ర‌మాల‌ను రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. ఈ ఏడాది అక్టోబ‌రు నుంచి 2024 మార్చి వ‌ర‌కు 6-ఎ ఆల‌యాల్లో వారోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ధ‌ర్మ‌ప్ర‌చారం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌వ‌చ‌నాలు, హ‌రిక‌థ‌లు, భ‌క్తి సంగీతం, కూచిపూడి నృత్యాలు, భ‌జ‌న‌లు, కోలాటాలు, పారాయ‌ణ‌లు ఉంటాయ‌ని వివ‌రించారు. వాటితో పాటు సామూహిక ఉచిత కుంకుమ పూజ‌లు, అభిషేకాలు, స‌ర‌స్వ‌తీ హోమాలు, గోపూజ‌లు, క‌ళ్యాణోత్స‌వాలు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదే విధంగా న‌గ‌ర‌- గ్రామ సంకీర్త‌న, శోభాయాత్ర‌లు నిర్వ‌హించాల‌న్నారు. గ్రామాల్లోని చిన్నారుల‌కు సంప్ర‌దాయ వేషాలు, పాఠ‌శాల విద్యార్థుల‌కు పురాణ పాత్ర‌లు, భ‌గ‌వ‌ద్ఘీత‌పై వ్యాస‌ర‌చ‌న‌, వ‌క్త‌త్వం, చిత్ర‌లేఖ‌న‌ పోటీలు ఏర్పాటు చేయాల‌న్నారు. ఆల‌యాల‌కు, భ‌క్తుల గృహాల‌కు ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప‌టిష్టం చేయాల‌న్నారు. వివిధ శుభ‌కార్యాల‌కు వేదిక‌గా ఆల‌యం నిల‌వాల‌న్నారు. వారోత్స‌వాల‌ను ఏర్పాటు చేసుకుని ప్ర‌చుర‌ణ‌/ ప్ర‌సార మాధ్య‌మాలు, ఆటోలు ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఆధ్యాత్మిక వేత్త‌లు, పండితులు, క‌ళాకారులు, స్థానిక ఆధ్యాత్మిక, సాంస్క్ర‌తిక సంస్థ‌లు, దాత‌లు, గ్రామ పెద్ద‌ల‌ను, ముఖ్యంగా యువ‌త‌ను ప్ర‌చారంలో భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ స‌భ్యులు, ఆర్జేసీ, డీసీ, ఏసీ, 6-ఎ ఆల‌య ఈవోలు, మేజ‌ర్ టెంపుల్స్ ఈవోలు ప్ర‌త్యేక స‌మావేశాల‌ను ఏర్పాటు చేసుకుని 6-ఎ ఆల‌యాల్లో కార్య‌క్ర‌మాల‌ను రూప‌క‌ల్ప‌న చేయాల‌న్నారు. ఆయా ఆల‌యాల సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఆల‌య వైభ‌వాన్ని తెలియ‌జేస్తూ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాల‌న్నారు. కుటుంబ, మాన‌వ, సామాజిక ధ‌ర్మాలు, విశ్వ శ్రేయ‌స్సు త‌దిత‌ర అంశాలు గురించి ప్ర‌వ‌చ‌న క‌ర్త‌లు ప్ర‌వ‌చించాల‌న్నారు.


ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థం నిర్వ‌హ‌ణ‌, విధివిధానాల‌ను అధికారులంద‌రూ విధిగా పాటించాల‌ని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ సూచించారు. వారంలో రెండు లేదా మూడు గిరిజ‌న‌, మ‌త్స్య‌కార‌, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, తెగ‌లు నివ‌సించే ప్రాంతాల్లో ప్ర‌చార ర‌థం ప‌ర్య‌టించేలా చ‌ర్య‌లు చేప‌ట్టి ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వామ్యం చేయాల‌న్నారు. ధ‌ర్మ‌ప్ర‌చార స‌మ‌యంలో ర‌థం నిలిపిన‌చోట ఉద‌యం, సాయంత్రం స్థానిక పండితులు, జిల్లాలోని ప్ర‌ముఖ పండితుల‌తో ప్ర‌వ‌చ‌నాలు ఏర్పాటు చేసి స‌నాత‌న ధ‌ర్మ వైశిష్ట్యాన్ని బోధించాల‌న్నారు. ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థంతో పాటు క‌నీసం ఒక వేద‌ప‌డితుడు, అర్చ‌కుడు, ప‌రిచారికుడు, భంజ‌త్రీలు, ప‌ర్య‌వేక్ష‌కుడు, జూనియ‌ర్ అసిస్టెంట్‌, అటెండ‌ర్లు స‌హా మొత్తం 14 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ప్ర‌తి నెలా ఆ నెల‌లో జ‌రిగే ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థ యాత్ర‌కు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను 1వ తేదీ నాటికే దేవాదాయ శాఖ కమిష‌న‌ర్‌కు అంద‌జేయాల‌న్నారు. యువ‌త‌లో ఆధ్యాత్మిక భావం పెంపొందించేలా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు. హైంద‌వ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్రమం నిరంత‌ర ప్ర‌క్రియ‌ని తెలిపారు. స‌మావేశంలో దేవదాయ శాఖ స్పెష‌ల్ సీఎస్ క‌రికాల వ‌లివ‌న్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ, వేదాంతం రాజ‌గోపాల చ‌క్ర‌వ‌ర్తి, ప‌లు ఆల‌యాల ఈవోలు, అధికారులు పాల్గొన్నారు.

Comments