విజయవాడ (ప్రజా అమరావతి);
*బాలికల సర్వతోముఖాభివృద్ధికి సోపానాలు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు
*
• *కేజీబీవీల్లో కొత్తగా నియమితులైన 1,543 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ*
• *100 శాతం ఎన్ రోల్ మెంట్, 100 శాతం రిక్రూట్ మెంట్ కు కృషి చేసిన మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయులు*
• *బాలికల విద్య ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం తదనుగుణంగా విద్యాభివృద్ధికి, సాధికారతకు కృషి*
• *విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి*
• *మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం*
: *రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ. బొత్స సత్యనారాయణ*
కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు ఇందులో చదివే విద్యార్థుల భవిష్యత్తు బాధ్యతను తీసుకొని, వారు అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రోత్సాహించి, వారిని ఉన్నతంగా తీర్చిద్దిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ. బొత్స సత్యనారాయణ సూచించారు. సోమవారం విజయవాడ సమీపంలోని నిడమనూరు దగ్గర మురళీ రిసార్ట్స్ లో కేజీబీవీల్లో కొత్తగా నియామకమైన 1,543 మంది ఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మాత్యులు శ్రీ.బొత్స సత్యనారాయణ హాజరై వారికి నియామక పత్రాలను అందజేశారు. కేజీబీవీల్లో కొత్తగా ఎంపికై బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయ సిబ్బందికి మంత్రి, ఐఏఎస్ అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యను పూర్తి చేసుకొని ఉన్నత స్థితికి ఎదిగిన పలువురు పూర్వవిద్యార్థినులను అభినందిస్తూ జ్ఞాపికలను మంత్రి అందజేశారు. ఆయా విద్యార్థులు ఉన్నతంగా ఎదిగిన తీరును స్వయంగా వెల్లడించగా మంత్రి సావధానంగా విన్నారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అణగారిన సామాజిక వర్గాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో నెలకొల్పబడిన పాఠశాలలే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో 1,543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఒకేసారి అనుమతిచ్చి ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసి నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు ప్రతి రంగంలో రాణించే దిశగా బోధన ప్రక్రియ కొనసాగాలని, ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికల విద్య ప్రాధాన్యతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదనుగుణంగా విద్యాభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు వెచ్చించడమేగాకుండా వారి సాధికారతకు కృషి చేస్తోందన్నారు. కస్తూరిబా గాంధీ పాఠశాలలతో పాటు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు నేడులో భాగంగా బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ల నిర్మాణం, కౌమర దశ బాలికలకు శానిటరీ నాప్ కిన్ లు, రక్తహీనత లోపం లేకుండా పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు.
బడి మానేసిన పిల్లలకు, అనాధ పిల్లలకు, పాక్షిక అనాధ పిల్లలకు, దివ్యాంగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల పిల్లలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పిల్లలకు ప్రాధాన్యతనిస్తూ ప్రవేశాలకు అనుమతి కల్పించడం, ఇంటర్మీడియట్ ను కూడా కేజీబీవీల్లో ప్రవేశ పెట్టడంతో బాలికల నమోదుశాతంతో పాటు ఆదరణ పెరుగుతోందని మంత్రి అన్నారు. తొలుత రాష్ట్రంలో 53 కేజీబీవీలు, 6,380 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాలయాల సంఖ్య ప్రస్తుతం 352కు చేరడంతో పాటు విద్యార్థుల సంఖ్య దాదాపు లక్షకు (98,560) చేరడం సంతోషంగా ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోన్నారన్న విషయాన్ని గుర్తుచేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించాలని అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం విద్య, డిజిటల్ విధానంలో బోధనను ప్రోత్సహించే దిశగా 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు పాఠశాలల్లో ఏర్పాటు చేశామన్నారు. దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి, వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చేయడంలో ముఖ్యమంత్రి పాత్ర అద్వితీయమన్నారు. నాణ్యమైన విద్యతో మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ శ్రీ.ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చారిత్రాత్మకమైనవన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే గాకుండా పేద విద్యార్థులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. సబ్జెక్టుతో సబంధం లేకుండా ఆంగ్లభాషలో పట్టు సాధించడం, డిజిటల్ టెక్నాలజీ నేర్చుకోవడం, టోఫెల్ ట్రైనింగ్, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, చాట్ జీపీటి, ఈ - కాన్ఫరెన్స్ యాప్, బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు తద్వారా నైపుణ్యాలు పెంచుకునే అంశాలను వివరించారు. ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్ ను పూర్తి చేసి, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా విధులు నిర్వర్తించడం వంటి అంశాలు ప్రతి ఉపాధ్యాయుడి వృత్తిలో భాగమని ఉద్భోధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిని గ్లోబల్ సిటిజన్ గా తయారు చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పని చేయాలన్నారు. ఉద్యోగం సాధించడానికి ఎలా సమయాన్ని వెచ్చించి విజయాన్ని సాధించారో అదే స్పూర్తి నిరంతరం కొనసాగాలని ఉద్ఘాటించారు.
సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ శ్రీ. బి.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ బాలికలు, మహిళలకు విద్య, సమాన అవకాశాలు కల్పించాలని పోరాటం చేసిన కస్తూరిబా గాంధీ, సావిత్రిబాయిఫూలేను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. నాణ్యమైన విద్యకు కస్తూరిబా గాంధీ విద్యాలయాలు బ్రాండ్ గా మారాయన్నారు. కేజీబీవీల్లో చదివిన వారు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు బాధ్యతగా తమ విధులు నిర్వర్తించి విద్యార్థుల ఉన్నతికి పాటు పడాలన్నారు. త్వరలోనే కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు వారం రోజుల పాటు సబ్జెక్ట్ మీద, కెపాసిటీ బిల్డింగ్ మీద శిక్షణ అందిస్తామన్నారు.
కేజీబీవీ సెక్రటరీ శ్రీ. డి. మధుసూదన్ రావు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ చొరవతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగలిగామన్నారు. నిరాశ్రయులైన వారికి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి, ఎవరైతే విద్యాఫలాలు అందకుండా ఉన్నారో వారందరికీ విద్యా ఫలాలు అందిస్తోన్న విద్యాలయాలే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు అని తెలిపారు. ఇందులో ఇంటర్ మీడియట్ తో పాటు 8 ట్రేడ్ ల్లో వృత్తివిద్య కోర్సులు అందిస్తున్నామన్నారు. కేజీబీవీల్లో అతి పెద్ద రిక్రూట్ మెంట్ ఇదే అని చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో బాలికల కొరకు స్నేహపూరిత వాతారణం కల్పించడం, వృత్తి విద్యా నైపుణ్యాలను కల్పించడం, నాణ్యమైన జీవనాన్ని గడిపేందుకు కావలసిన జీవననైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుందన్నారు. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంపొందించేలా క్రీడలతో పాటు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు.
కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థినులు అంకిత, పూజ, ప్రవల్లిక లు మాట్లాడుతూ కేజీబీవీల్లో అందించే నాణ్యమైన విద్య, ఉపాధ్యాయులు అందించిన మార్గదర్శకత్వం, ధైర్యం, దిశానిర్ధేశం, ప్రోత్సాహంతో ఉన్నత స్థితికి చేరామన్నారు. విద్యతో పాటు అన్ని అంశాల్లో తోడుగా ఉంటూ బాలికల సర్వతోముఖాభివృద్ధికి సోపానాలు కేజీబీవీలు నిలిచాయని కొనియాడారు.
అనంతరం జాబ్ చార్ట్ తయారీ విధానంపై 26 జిల్లాల గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 352 కేజీబీవీల్లో విద్యను పటిష్టం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విధి విధానాలు తూ.చా తప్పకుండా పాటిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ శ్రీ.ప్రవీణ్ ప్రకాష్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ బి.శ్రీనివాస్ రావు, కేజీబీవీ సెక్రటరీ డి. మధుసూదన్ రావు, పాఠశాల విద్య డైరెక్టర్ పార్వతి, ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ దేవానందరెడ్డి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ సుబ్బారెడ్డి, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ డా. ప్రతాప్ రెడ్డి, టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సెక్రటరీ నర్సింగరావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ డా. కేవీ శ్రీనివాసులు రెడ్డి, 26 జిల్లాల గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ప్రస్తుత, పూర్వ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment