➤ ప్రజలందరికీ అందుబాటులో ప్రజల వద్దకే మెరుగైన
వైద్యం.
➤ 48 వ వార్డ్ , బాపూజీ నగర్ లో యూపీహెచ్సీ ప్రారంభోత్సవం.
-రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖా మరియు జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజని.
విశాఖపట్నం, జూన్ 10 (ప్రజా అమరావతి): ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ అందుబాటులో ప్రజల వద్దకే మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాలు, పట్టణాలలో ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తోందని జిల్లా ఇన్చార్జి ,వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. శనివారం ఉదయం జీవీఎంసీ ఐదవ జోన్ పరిధి , 48 వ వార్డు, బాపూజీనగర్ లో 106.50 లక్షలతో నేషనల్ హెల్త్ మిషన్, జీవీఎంసీ నిధులతో నిర్మించిన డాక్టర్ వైయస్సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి విడదల రజిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో రాష్ట్రవ్యాప్తంగా యూ పీ హెచ్ సీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు విశాఖలో 42 పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మించి , ప్రారంభించినట్లు తెలిపారు . ఇంకా ఐదు కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు . గ్రామాలలో పీ హెచ్ సీ లు నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన, ఉచితమైన, నాణ్యమైన వైద్య సేవలు ఈ కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. పేదలు ఎవరు కూడా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడకూడదని అన్నారు. టెరిషరి సేవల నుంచి అత్యాధునిక వైద్య సేవలు వరకు అన్నీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేయుటకు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 3250 వరకు పెంచినట్లు తెలిపారు. వైద్యంలో మరింత ఆధునికరణంగా ఆరోగ్య కేంద్రాలను , సిబ్బందిని తగిన రీతిలో శిక్షణ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచటం జరుగుతుందన్నారు. ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా నాడు - నేడు పథకం ద్వారా పురాతన ఆసుపత్రులు అన్నింటిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు.
ఇందులో భాగంగా 48 వ వార్డు , బాపూజీ నగర్ లో అన్ని రకాల సదుపాయాలు, సేవలతో ఈ ఆసుపత్రిని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య కేంద్రంలో సుమారు 172 రకాల మందులు, ఓపి సేవలు, 63 రకాల రక్త పరీక్షలు , మోతా శిశు సేవలు, ఎన్సీడీ స్క్రీనింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా ఈ-సంజీవిని , ఆయుష్మాన్ భారత్ , టెలి మెడిసిన్ వంటి సేవలు ఉంటాయని అన్నారు. మెడికల్ ఆఫీసర్ తో కలిపి ఏడుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ ఆరోగ్య కేంద్రంలో అందించు వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ ప్రారంభోత్సవంలో కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున, , జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి , నెడ్ క్యాప్ చైర్మన్ కే కే రాజు, వార్డ్ కార్పొరేటర్ గంకల కవిత డిఎం& హెచ్వో జగదీశ్వరరావు , ఫ్లోర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, అల్లు శంకరరావు, సాడి పద్మా రెడ్డి, వావిలిపల్లి ప్రసాద్, సారిపిల్లి గోవింద్, ఆళ్ల లీలావతి, ఉషాశ్రీ, చల్లా రజిని ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment