పేదలకు గృహాలు, ఇళ్ల స్థలాలివ్వడంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్‌ ఎంపి విజయసాయిరెడ్డి.



పేదలకు గృహాలు, ఇళ్ల స్థలాలివ్వడంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్‌


ఎంపి విజయసాయిరెడ్డి


అమరావతి (ప్రజా అమరావతి);

పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంకా కేవలం రూపాయికే కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం గతంలోని అన్ని సర్కార్ల కన్నా చాలా ముందుంది. కేవలం ఉన్నతాధికారులకు, సంపన్నులకే సొంతమని మొదట్లో భావించిన రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి మచ్చుతునక. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులను పూర్తిగా అధిగమించే దశకు రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో పేద ప్రజలకు 30 లక్షల 60 వేల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ వాగ్దానం చేసినట్టుగానే తాను అధికారంలోకి వచ్చాక కేవలం రూపాయికే టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇస్తోంది. ఇంకా 21 లక్షల గృహాలు, సమస్త సౌకర్యాలతో 17 వేల ఇళ్ల కాలనీలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ వివరాలను ఇటీవల కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించారు. రాజధాని అమరావతిలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని సవరించి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అన్ని చర్యలూ తీసుకుంది ప్రభుత్వం. అవసరమైన పేదలకు నివేసన స్థలాలు, అన్ని సౌకర్యాలతో కట్టిన గృహాలు ఇవ్వడానికి వైఎస్సార్సీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతిలో పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని తగు విధంగా సవరించి ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేయడం ఏపీ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీసినట్టయింది. రాష్ట్ర రాజధాని కేవలం రాజ్యాధికారం ఉన్నవారిదో లేక ధనికులదో కాదని తేల్చి చెప్పిన ప్రభుత్వం ‘రాజధాని అందరిదీ. రాజధానిలో సమానత్వానికే పెద్ద పీట వేస్తున్నాం,’ అని ప్రకటించడం విప్లవాత్మక నిర్ణయం. అమరావతిలోని మందడం, ఐనవోలు, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు ప్రాంతాల్లో సొంతిళ్లు లేని దాదాపు 50 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం. నవరత్నాలలో భాగమైన ‘పేదలందరికీ ఇళ్లు’ కింద అమరావతిలో ఇళ్ల పట్టాలను ఆర్థికంగా బలహీనవర్గాలకు ఇవ్వడాన్ని కొందరు రైతులు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని రెండు వేలకు పైగా గ్రామాల్లో ఇప్పటికే పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. సొంతిళ్లు లేని బలహీనవర్గాలకు స్థలాలు ఉచితంగా ఇవ్వడానికి వీలుగా దాదాపు వందేళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ శరవేగంతో పూర్తిచేస్తోంది. ఇంతటి బృహత్‌ కార్యక్రమాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత వరకు చేపట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటిని ఒక రూపాయికే రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో గృహాలు ఇవ్వడం విశేషం.  ఈ కార్యక్రమానికి సర్కారు దాదాపు పది వేల కోట్ల రూపాయలు వ్యయం చేసింది. గతంలో తెలుగుదేశం పాలనాకాలంలో నెలవారీగా డబ్బు కట్టించుకునే ఇళ్లును లబ్ధిదారులకు ఇచ్చిన విషయం తెలుగు ప్రజలకు ఇంకా గుర్తుంది.




Comments