*ప్రజా సమస్యలకు అత్యున్నత స్థాయిలో పరిష్కారం
*
*సామాన్యుల సమస్యలు విన్నవించుకునేందుకు *జగనన్నకు చెబుదాం* ఓ చక్కని వేదిక
*1902 ద్వారా మిషన్ మోడ్‌లో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సత్వర పరిష్కారం
*విలేకరుల సమావేశంలో కార్యక్రమ లక్ష్యాలను వివరించిన కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్
విజయనగరం, మే 10 (ప్రజా అమరావతి) ః రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన *జగనన్నకు చెబుదాం* కార్యక్రమం ద్వారా అత్యున్నత స్థాయిలో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్ పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటివద్ద నుంచే ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాలపై సమస్యలుంటే టోల్ ఫ్రీ నెం.1902కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, సంబంధిత సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని అన్నారు. సమస్యలు పరిష్కరించిన తర్వాత కాల్ సెంటర్ ప్రతినిధి స్వయంగా ఫోన్ చేసి సంబంధిత ఫిర్యాదుదారు నుంచి అభిప్రాయాన్ని కూడా సేకరించే బృహత్తరమైన కార్యక్రమం *జగనన్నకు చెబుదాం* అని అభివర్ణించారు. ఈ వేదికను ఉపయోగించుకొని ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అధికారులు కూడా బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలను కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్, జేసీ మయూర్ అశోక్, డీఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి వివరించారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న స్పందనకు ఇది మరింత మెరుగైన రూపమని, సేవల విస్తృతికి ఈ వేదిక దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం జరిగే స్పందన యథావిధిగా సాగుతుందని స్పష్టం చేశారు. జగనన్నకు చెబుదాం అనేది స్పందన 2.0గా పరిగణించాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించేందుక వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. ఆడిట్ టీం, మానిటరింగ్ టీంలు ఉంటాయని ప్రత్యేక సేవలందిస్తాయని తెలిపారు. ఇక్కడ నమోదయ్యే ఫిర్యాదులను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా వినతుల పరిష్కారంలో నాణ్యతను సాధించడం, సకాలంలో వినతులను పరిష్కరించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో పని చేస్తాయని వివరించారు. 1902కు ఫోన్ చేయటం ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలకు, సంక్షేమ పథకాలు, ఇతర వ్యక్తి గత స్థాయిలో ఉండే ఎలాంటి సమస్యనైనా చెప్పుకోవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ప్రత్యేక వైఎస్ఆర్ (యువర్ సర్వీస్ రిక్వెస్టు) ఐడీ వస్తుందని, దాని సహాయంతో ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో ఫిర్యాదు తాలూక అప్ డేట్స్ వస్తాయని వివరించారు.
*ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు*
ప్రజలకు మెరుగైన రీతిలో సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ వివిధ దశల్లో ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని, జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై అవగాహన కల్పించే తీసుకొనే చర్యల గురించి వివరిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా, డివిజన్ స్థాయి శిక్షణల అనంతరం, సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి దశలో ప్రజలకు మెరుగైన రీతిలో సేవలందించటంతో పాటు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించే విధంగా తర్ఫీదు అందిస్తామని కలెక్టర నాగలక్ష్మి.ఎస్ వివరించారు.
*పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందం*
ఫిర్యాదుల అందిన తర్వాత వాటి పరిష్కార దశను కనుక్కునేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేక ఆడిట్ టీంను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. అందులో జిల్లా పరిషత్ సీఈవో, ప్రత్యేక ఉప కలెక్టర్, పంచాయతీ రాజ్ అధికారి, ఒక డిప్యూటీ తహశీల్దార్, మెడికల్ అధికారి ఉంటారని వివరించారు. పర్యవేక్షణాధికారులుగా సీపీవో, సాంకేతిక విభాగం నుంచి ఒక అధికారి వ్యవహరిస్తారని వెల్లడించారు.
విలేకరుల సమావేశంలో కలెక్టర్‌తో పాటు, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment