బందరు పోర్టు- చిరకాల స్వప్నం.


మచిలీపట్నం, కృష్ణా జిల్లా (ప్రజా అమరావతి);


*మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభోత్సవం.*


*పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణపనులను కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడిలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా బహిరంగసభలో ప్రజలనుద్ధేశించి ప్రసంగించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:* 



ఈ రోజు మీ అందరి చిక్కటి చిరునవ్వులు, ఆప్యాయతల మధ్య మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడికి తోడుగా నిలబడుతూ ఆప్యాయతలు పంచిపెడుతున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 


*బందరు పోర్టు- చిరకాల స్వప్నం.*



దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. బందరు పోర్టు ఒక చిరకాల స్వప్నం. ఒకవైపు సముద్రం కనిపిస్తుంది. మరోవైపు మహానగరం కనిపిస్తుంది. బందరుతో సముద్రవర్తకానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఇక్కడ ఒక పోర్టు నిర్మాణం జరగాలి.. అది జరిగితే బందరు కూడా ఏ ముంబాయి మాదిరిగానో, చెన్నై మాదిరిగానో మహానగరంగా ఎదుగుతుందన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అది ఒక నెరవేరని కలగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ.. మనందరి ప్రభుత్వం ఈ రోజు అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ కూడా పూర్తి చేసి, అన్ని అనుమతులును తీసుకొచ్చి, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ను పూర్తిచేసి, టెండర్ల ప్రక్రియను ముగించి.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించాం.దాదాపు రూ.5,156 కోట్లతో 4 బెర్తులు ఇక్కడ రానున్నాయి. దాదాపు 35 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో పోర్టు ప్రారంభమవుతుంది. ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ... బెర్తుల సంఖ్య పెంచుకుంటూ 116 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వరకు విస్తరించుకుంటూ పోవచ్చు.


*పోర్టు అనుబంధ మౌలికవసతులు.*

ఇలాంటి ఈ పోర్టు నిర్మాణంతో పాటు ఈ పోర్టుకు అన్ని రకాలుగా మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో దీనికి అనుబంధంగా మౌలికవసుతుల నిర్మాణం కూడా చేపడుతున్నాం. ఈ పోర్టుకు కేవలం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 216 వ నెంబరు జాతీయ రహదారిని పోర్టు వరకు తీసుకువచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దీంతో పాటు 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ, మచిలీపట్నం రైల్వే లైనును కూడా పోర్టు వరకు తీసుకొచ్చి అనుసంధానం చేస్తున్నాం. బందరు కాలువ నుంచి 0.5 ఎం.ఎల్‌.డీ నీటిని 11 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ద్వారా తీసుకొచ్చి.. పోర్టుకు అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల సరుకులు ఎగుమతులు, దిగుమతులకు అత్యంత మెరుగైన రవాణా వ్యవస్ధ ఏర్పడుతుంది. మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా మనకు అందుబాటులోకి వస్తుంది.


ఈ పోర్టు వల్ల, ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాల వల్ల మన రాష్ట్రంతో పాటు, చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా బాగుబడతాయి. పక్కనే తెలంగాణాకు అత్యంత సమీపంగా ఉన్న ఈ పోర్టు ఆ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. చత్తీస్‌ఘఢ్, కర్నాటకకు కూడా ఈ పోర్టు కొంతమేర ఉపయోగపడుతుంది. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మచిలీపట్నం నగరంలోనే ఆ ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. డిగ్రీ పూర్తయిన మన పిల్లలు వేరేచోటకి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మన దగ్గరకే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం దిశగా ఈ రోజు పనులు మొదలు కావడంతోనే అడుగులు పడుతున్నాయి. 


ఈ పోర్టు నిర్మాణానికి గతంలో చాలా అడ్డంకులు చూశాం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టు ఇక్కడ రాకూడదని తపన,  తాపత్రయంతో అడుగులు వేశారు. 22 గ్రామాలను తీసేసుకోవాలని, 33వేల ఎకరాలు తీసేసుకోవాలని ఆ భూములన్నీ నోటిఫై చేసేసి.. అక్కడ ఉన్న రైతులెవరూ తమ భూములను అమ్ముకునే పరిస్థితి లేకుండా అందరినీ ఇబ్బందికి గురి చేశాడు. ఇలా చేస్తే పోర్టు రాకుండా పోతుంది, అడిగే వారు ఉండరని ఈ కార్యక్రమం చేశాడు. 

మచిలీపట్నంలో పోర్టు రాకపోతే, ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే అందరూ అమరావతిలో తాను బినామీలుగా పెట్టుకున్న భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చు అన్న తపనతో ఈ పెద్దమనిషి మచిలీపట్నానికి తీరని ద్రోహం చేశాడు. ఈ రోజు పోర్టు నిర్మాణానికి 1700 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాం.


పోర్టుకు సంబంధించి రైలు, రోడ్డు మార్గానికి కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతి రైతు మొహంలో చిరునవ్వు చూడాలి. వారిని సంతోషపెట్టే ఈ భూములు తీసుకొండి అని చెప్పాను. ఈ రోజు నేను సంతోషంగా చెపుతున్నా.. రైతులందరి సంతోషం మధ్య... వారు మనస్ఫూర్తిగా ఇచ్చిన 240 ఎకరాలు తీసుకుని ఈ రోజు మంచి పోర్టు నిర్మాణంలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి. ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. వాటిలో 4వేల ఎకరాలను దీంతో అనుసంధానించి అక్కడ కూడా పరిశ్రమలు వచ్చేటట్టు చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాలకు ఊతం పడినట్టవుతుంది.


*పోర్టు నిర్మాణానికి తొలిగిన గ్రహణాలు..*

పోర్టు నిర్మాణానికి సంబంధించి గ్రహణాలన్నీ తొలగిపోయాయి. అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. మరో 24 నెలల కాలంలోనే ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. మచిలీపట్నంలో పెద్ద, పెద్ద ఓడలు కనిపిస్తాయి. మరో 24 నెలల్లోనే ఇవన్నీ జరుగుతాయి. మచిలీపట్నం రూపురేఖలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారుతున్నాయో చూడండి. మీ కళ్లెదుటనే ఈ తేడాలను గమనించేటట్టు అడుగులు పడుతున్నాయి. గతంలో బందరు జిల్లా ముఖ్యపట్టణమైనా కూడా కలెక్టరుతో పాటు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వారానికి ఒక రోజు కేటాయిస్తే అదే పదివేలు అనుకునే పరిస్థితిలో ఉన్న జనాలకు మంచి చేస్తూ.. ఈ రోజు ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టరుతో పాటు మొత్తం యంత్రాంగం అంతా కూడా జిల్లాలో ఉండేట్టుగా జిల్లా కేంద్రంగా మచిలీపట్నంను ఉంచడమే కాకుండా, కలెక్టర్‌ ఇక్కడే ఉంటారు. 

దాదాపు రూ.550 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరమే మరో మూడు నెలల్లోనే ఆగష్టు, సెప్టెంబరులోనే అడ్మిషన్స్‌ జరగనున్నాయి. దీనివల్ల ఆవనిగెడ్డ, పెడన, పామర్రు, గుడివాడ,  కైకలూరు నియోజకవర్గాల ప్రజలకు గొప్ప వైద్య సేవలు అందుతాయి. 


నాగుల్‌ మీరా సాహెబ్‌ ఆశీస్సులతో ఏ సమయంలోనైనా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్‌ హార్భరు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు నెలల్లో ఈ ఫిషింగ్‌ హార్భరు పనులు కూడా పూర్తై.. అందుబాటులోకి వస్తుంది. 

ఇక్కడే ఇమిటేషన్‌ జ్యూయలరీ తయారీకి మద్ధతుగా నా పాదయాత్రలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీ మేరకు...  రూ.7.65 నుంచి మనం అధికారంలోకి రాగానే రూ.3.75 లకు తగ్గించాం. దాదాపు 40 వేల మంది ఇమిటేషన్‌ జ్యూయలరీ మీద బ్రతుకున్న వాళ్లందరికీ మంచి చేశాం. బందరులో అభివృద్ధి జిల్లా కేంద్రంగానే కాకుండా, భారీ స్ధాయిలో ఇక్కడ వర్తక, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి అన్నింటికీ కూడా మచిలీపట్నం కేరాఫ్‌ అడ్రస్‌ కాబోతుంది.


*పోర్టుల నిర్మాణం- సమూల మార్పులు..*

రాష్ట్రంలో పోర్టులకు సంబంధించిన మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను కూడా ఒకసారి గమనిద్దాం. 

రాష్ట్రంలో పోర్టులలో ఇప్పటివరకు ఉన్న వార్షిక సామర్ధ్యం 320 మిలియన్‌ టన్నులైతే.. 2025–26 నాటికి ఈ మొత్తానికి అదనంగా మరో 110 మిలియన్‌ టన్నుల  సామర్ధ్యం పెంచేలా అడుగులు వేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో 4 చోట్ల 6 పోర్టులు ఉంటే... మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఈ 4 సంవత్సరాల కాలంలో రూ.16వేల కోట్లతో రామాయాపట్నం, మచిలీపట్నం, మూలపేటలలో మూడు చోట్ల గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులలో పనులు వేగంగా జరిగేటట్టు అడుగులు వేశాం. ఇప్పటికే కాకినాడ వద్ద గేట్‌వే పోర్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నాలుగు పోర్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అదనంగా.. ఒక్కో పోర్టు వలన ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కనీసం 25వేల ఉద్యోగాలు వస్తాయి. నాలుగు పోర్టులు అందుబాటులోకి రాగానే కేవలం పోర్టుల ద్వారానే లక్ష ఉద్యోగాలు వస్తాయి. ఇవే కాకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి. అప్పుడు చదువుకున్న మన పిల్లలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే గొప్ప కార్యక్రమం జరగపోతుంది.


*గంగ పుత్రుల ఆనందం కోసం..*

గంగపుత్రుల కళ్లల్లో కూడా ఆనందం నింపడానికి గతంలో ఎప్పుడూ చేయని విధంగా, చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా మత్స్యకార సోదరులకు అండగా ఉంటూ మన ప్రభుత్వంలో అడుగులు మరింత వేగంగా వేశాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా షిప్పింగ్‌ హార్భర్లు, ఫిషింగ్‌ హార్భర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు నిర్మాణం జరుగుతుంది. ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే  ఐదింటిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 4–5 నెలల్లో పనులు పూర్తవుతాయి. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యే దిశగా అడుగులు వేస్తున్నాం. 

6 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల పనులూ వేగంగా జరుగుతున్నాయి. ఈ 10 ఫిషింగ్‌ హార్భర్లకు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల కోసం రూ.3700 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

ఒకవైపు పోర్టులు వేగంగా నిర్మిస్తున్నాం. మరోవైపు ఏయిర్‌పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు వీటిని అనుసంధానం చేస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. 


*పేదల కుటుంబాల్లో వెలుగులు కోసం...*

వీటన్నింటినీ ఏర్పాటు చేస్తూనే మరోవైపు పేదల సంక్షేమానికి కట్టుబడ్డ ప్రభుత్వంగా నా అక్కచెల్లెమ్మల మొహంలో చిరునవ్వులు చూడాలని, పేదరికాన్ని సమూలంగా తీసేయాలని, పేదవాళ్లు పేదవాళ్లగా ఉండిపోకూడదని నా అక్కచెల్లెమ్మల కుటుంబంలో వెలుగులు నింపడానికి రూ.2.10 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో నేరుగా జమ చేశాడు. 

ఇక నాన్‌ డీబీటీ కూడా కలిపితే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్ధలాలను కూడా చూస్తే... 30 లక్షల ఇంటి స్ధలాలు. ఒక్కో ఇంటి స్ధలం విలువ కనీసం రూ.2.50 లక్షలు వేసుకున్న కూడా రూ. 75వేల కోట్లు. ఆ రకంగా తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా నాన్‌ డీబీటీలో మిగిలినవన్నీ కలిపితే రూ.3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో నేరుగా జమ చేశాం. ఎక్కడా ఎలాంటి లంచాలు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా డబ్బులు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతున్నాయి.


*ప్రజాసేవలోనూ విప్లవాత్మక మార్పులు..*

ప్రజలకు అందించే సేవల్లో కూడా విప్లవాత్మక మార్పులు దిశగా నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. పేదలకందించే పెన్షన్‌ మొదలు, ప్రజలకందించే సేవల్లో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా కానీ, రైతులకు ఆర్బీకేల ద్వారా కానీ, పల్లె, పల్లెల్లో విలేజ్‌ క్లినిక్కులు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ ద్వారా మనందరి ప్రభుత్వం, పేదల ప్రభుత్వంగా, ప్రజల ప్రభుత్వంగా తీసుకువచ్చిన ప్రతి మార్పు మన కళ్లెదుటనే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నా అక్కచెల్లెమ్మల పట్ల మమకారంతో  ఇప్పటికే 30 లక్షల ఇళ్లపట్టాలను అక్కచెల్లెమ్మల పేర్లతో వారికి అందించాం. ఇప్పటికే అందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఈ ఇళ్లే పూర్తయితే.. ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 నుంచి రూ.10 లక్షలు వేసుకుంటే.. ఒక్క ఇళ్లపట్టాలు, ఇళ్ల వలన అక్కచెల్లెమ్మలకు రూ.1.5లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లు వారి చేతిలో పెట్టినవుతుంది. 

వివిధ దశల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. 


*రాక్షసుల తరహాలో అడ్డుకుంటున్నారు.*

అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50వేల మంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించాం. దేవతల యజ్ఞానికి రాక్షసులు అడ్డుకున్నట్టు.. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తామని మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే.. టీడీపీకి తోడు గజదొంగల ముఠా అడ్డుపడుతోంది. వీళ్ల పని దోచుకోవడం పంచుకోవడం.. తినుకోవడం. ఈ టీడీపీ, గజదొంగల ముఠాకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరికి తోడు ఒక దత్తపుత్రుడు కలిశాడు. వీళ్లందరూ ఈ మహాయజ్ఞానికి అడ్డుపడుతూ వచ్చారు. రాజధాని పేరుమీద కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పేదవాళ్లకు ఏ మాత్రం ప్రవేశం లేని ఒక గేటెడ్‌ కమ్యూనిటి ప్రభుత్వ ధనంతో కట్టుకోవాలనుకున్నారు. బినామీల పేరుతో భూములు గడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు.


*బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే...*  ఇందులో పేదవర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలి. రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలంట. వాళ్లెవరికీ అక్కడ ఇళ్లు ఉండకూడదంట ?  అమరావతిలో వీళ్లు పొద్దుటే ఎంటర్‌ కావాలంట, వీరికి పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట.  

ఇంతకన్నా.. సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా?


*రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం.*

ఇలాంటి దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధంచేస్తున్నాం.పేదలకు నా ఎస్సీలకు, ఎస్టీలకు, నా బిసీలతో పాటు ఇతర నిరుపేద వర్గాలకు తావే లేకుండా ఇళ్ల స్ధలాలే లేకుండా, అడుగు పెట్టే పరిస్థితే లేకుండా వారు కేవలం పనివారుగానే మిగిలిపోవాలని చెప్పే  వారి వికృతి ఆలోచనలకు మనం మద్దతు ఇవ్వగలమా? ఆలోచన చేయండి.అందుకే ఆ  పేదల జీవితాలు మారే విధంగా అండగా నిలబడాలి అని.. అదే అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల స్ధలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి ..ఈ నెల 26న అమరావతిలో శ్రీకారం చుడుతున్నాం.  


*పేదలంటే చులకనభావం*

పేదలంటే చంద్రబాబుకు ఎంతటి చులకన అంటే... ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఎస్సీలు కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని బాబు అన్నాడు. బీసీల తోకలు కత్తిరించాలని అని దారుణంగా అవమానించారు. కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని  మహిళలను అవమానించాడు ఈ బాబే. 

మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు ఈ చంద్రబాబు. గవర్నమెంటు బడులలో ఇంగ్లిషు మీడియం వద్దని మొత్తం పేదవర్గాల మీద దాడే చేశాడు ఈ చంద్రబాబే. మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు చంద్రబాబు.

తాను కనీసం ఒక్క సెంటైనా కూడా పేదవాడికి ఇవ్వలేదు. ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క ఇళ్లస్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు సరికదా.. మీ బిడ్డ పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా  కేసులు వేయించింది కూడా ఈ బాబే. 


*రూపం మార్చుకున్న అంటరానితనానికి ప్రతీక-చంద్రబాబు*

అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తానంటే.. 

సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సాక్షాత్తూ కోర్టులో కేసులు కూడా వేయించింది కూడా ఈ బాబే.

 

రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుతోపాటు.. ఈ దుష్టచతుష్టం.. ఈ గజదొంగల ముఠా. 

ఇవన్నీ చేసిన చంద్రబాబు.. ఈ మధ్య కాలంలో విశాఖ పట్నంలో అన్నమాటలు విన్నప్పుడు బాధను కలిగిస్తున్నాయి.


*పవిత్ర స్ధలం - బాబు దృష్టిలో శ్మశానం.*

అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఉచితంగా ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. 50 వేల మంది పేదలకు శాశ్వత చిరునామాగా, వారి సొంత ఇంటి కలలు నిజం చేస్తుంటే.. ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడు. పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు. కాని మనం ఇస్తే.. వాటిని శ్మశానంతో పోలుస్తాడు.

ఇలాంటి చంద్రబాబుకు మానవత్వం ఉందా ? ఇలాంటి పెద్దమనిషి చంద్రబాబుకి పేదల కష్టాల గురించి అవగాహనైనా ఉందా?

సొంత ఇళ్లు లేకపోతే, అద్దె ఇంటిలో ఉండే నిరు పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎలా బ్రతుకుతారో? ఎలా బ్రతుకుతున్నారో ? ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారికి కనీసం  అవగాహన ఉందా? ఈ కుటుంబాలలో ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఆ శవాన్ని ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకునిపోవాలో తెలియని పరిస్థితిలో అద్దె ఇంట్లో బ్రతుకున్న ఆ నిరుపేదలు ఎలా బ్రతుకుతున్నారో..

ఈ పెద్ద మనిషికి కనీస స్పృహ ఉందా ? కళ్లారా కడసారి చూపు కూడా చూసుకునే భాగ్యం లేని పరిస్థితుల్లో, గుండెల నిండా బాధ ఉన్నా కనీసం ఏడ్వడానికి కూడా ఎక్కడకు వెళ్లి ఏడవాలో తెలియని పరిస్థితుల్లో, ఇళ్లు లేని  ఆ నిరుపేదలు ఇళ్లల్లో ఆ శవాలను పెట్టుకోలేక.. శ్మశానం దగ్గరకు వెళ్లే ఏడ్చే పరిస్థితులు. వీళ్లు ఎలా ఉంటున్నారో ఆలోచన చేయమని అడుగుతున్నాం. ఇటువంటి ఆలోచన ఏ రోజూ చేయలేదు. చివరకు ఒక పక్షి అయినా ఒక గూడు కట్టుకోవాలని అనుకుంటుంది. తన పిల్లలతో పాటు ఉంటుంది. కానీ నిరుపేదలు కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా సొంత ఇళ్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది మానవత్వం లేని మనుషుల్లో కూడా మానవత్వం తీసుకొచ్చే అంశం. 

కాని చంద్రబాబుకు మానవత్వం లేదు. అయినా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు. ఆలోచన చేయండి. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. కాబట్టే... వీళ్లు పేదల దగ్గరకు వచ్చి మేం ఫలానా మంచి చేశామని చెప్పుకోలేని పరిస్థితి వారిది. వారి ఆలోచనలన్నీ.. వారి కుళ్లు, కుతంత్రాలు అన్నీ ఒక్కటే. వాళ్లందరూ చేసేది ఒక్కటే. 

ఒక్క దత్తపుత్రుడ్ని, ఎల్లోమీడియాను మాత్రం నమ్ముకుంటారంట ? వీళ్లందరూ ఏకమైతే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించగలుగుతారట ? వీళ్లందరూ ఏకమైతే మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ.. .ఎన్నికల్లో గెలవడమే కష్టమట.


నేను మిమ్నల్ని అందరినీ అడుగుతున్నాను. మీ గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు జరిగి ఉంటే.. మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా తోడుగా నిలవండి.

మీ బిడ్డకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగాఉండకపోవచ్చు. టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వీళ్లను నమ్ముకోలేదు. 

మీబిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మీ అందరి చల్లని ఆశీస్సులను మాత్రమే. కాబట్టి మీ బిడ్డ మంచి చేసి, ఆ మంచిని చూపించి మీ చల్లని ఆశీస్సులు కోరుతున్నాడు. ఈ రోజు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతం ఇంకా బాగుపడాలని, ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. 


*చివరిగా*

ఎమ్మెల్యే పేర్ని నాని నియోజవకర్గ అభివృద్ధి పనులు గురించి అడిగారు.  

మెడికల్‌ కాలేజీ దగ్గర.. రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి కోసం మరో రూ.25 కోట్లు అడిగారు. అది మెడికల్‌ కాలేజీకి ఉపయోగపడుతుంది. మెడికల్‌ కాలేజీతో పాటు దీన్ని కూడా పూర్తి చేస్తాం. ఆర్వోబీకి అవసరమైన రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాను. 6 కమ్యూనిటీ హాల్స్‌ను రూ.3 కోట్లతో  నిర్మాణం చేపట్టాలన్నారు. వాటినీ మంజూరు చేస్తున్నాం. అంబేద్కర్‌ భవన్‌ మరమ్మతులు కోసం ప్రస్తావించారు. దానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నాం. మరో 12 గ్రామాలకు సంబంధించి ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తిచేసుకుని 12,615 ఎకరాలకు సంబంధించి వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్‌కు ఇక్కడే ఆదేశాలు ఇస్తున్నాం. అర్హులైన వారిని గుర్తించి త్వరలోనే మనం ఇవ్వబోయే అసైన్డ్‌ భూములు, లంక భూములకు సంబంధించి ఇచ్చే పట్టాలతో పాటు వీరికి కూడా పట్టాలిచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఈ ప్రక్రియ మొదలుపెట్టమని కలెక్టరుకు ఆదేశాలు ఇస్తున్నాను. వీటన్నింటి వల్లా ఈ ప్రాంతానికి ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీ చల్లని ఆశీస్సులకు మరొక్కసారి పేరు, పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments