- సచివాలయంలో ఇంధనశాఖపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
- జూన్ 15 లోగా ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ దరఖాస్తుల పరిష్కారం
- అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి
- పెండింగ్ లో ఉన్న సబ్ స్టేషన్ల పనులు వేగవంతం
- జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులకు ప్రాధాన్యత
- పారిశ్రామిక పెండింగ్ బకాయిలపై దృష్టి సారించాలి
- వేసవిలోనూ విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు
- 33 కెవి సబ్ స్టేషన్ల పరిధిలో ప్రజా భాగస్వామ్యంతో కమిటీలు
: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి (ప్రజా అమరావతి);:
అర్హతే ప్రమాణికంగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్క రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ను అందించాలని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో సోమవారం సిపిడిసిఎల్ విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలవాలన్న లక్ష్యంతో తొమ్మిది గంటల పాటు పగటిపూట ఉచితంగా విద్యుత్ ను అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారని అన్నారు. దీనికి అనుగుణంగా ఉచిత విద్యుత్ కోసం వచ్చే దరఖాస్తులకు ఎటువంటి తుది గడువు ఉండకూడదని, వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి విద్యుత్ కనెక్షన్ లను మంజూరు చేయాలని డిస్కం అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు జూన్ 15వ తేదీలోగా పరిష్కరించి, కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశించారు. సీఎం శ్రీ వైయస్ జగన్ రైతుపక్షపాతిగా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నారని, దీనిని సమర్థంగా అమలు చేసేందుకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మార్చి నెలాఖరు నాటికి దాదాపు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లను వ్యవసాయానికి అందించామని తెలిపారు.
రాష్ట్రంలో పేదలకు ఇళ్ళస్థలాలను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక యజ్ఞంలా చేపట్టిందని అన్నారు. వేలాది జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుద్దీకరణను నిర్ణేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలని కోరారు. ఇందుకోసం ముమ్మరంగా పనులు జరుగుతున్న జగనన్న కాలనీకు సంబంధించిన వివరాలను గృహనిర్మాణ శాఖ అధికారుల నుంచి తీసుకోవాలని అన్నారు.
విద్యుత్ పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో పంపిణీ నష్టాలను పూర్తి స్థాయిలో నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు. సిపిడిసిఎల్ పరిధిలో పారిశ్రామిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు ఒక డ్రైవ్ ను నిర్వహించాలని అన్నారు. కోర్ట్ కేసుల వల్ల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలపైన కూడా దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే టెండర్లు, అవార్డుల స్థాయిలో ఉన్న సబ్ స్టేషన్ల నిర్మాణంను వేగవంతం చేయాలని ఆదేశించారు. లో ఓల్టేజీ ప్రాంతాలను గుర్తించి, అందుకు కారణాలను పరిశీలించాలని, నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికమవుతున్నా కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ నేతృత్వంలో ప్రణాళికాయుతంగా విద్యుత్ ఉత్పాదనను సాగిస్తూ, ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్ ను అందిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహాలో విద్యుత్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. 33కెవి సబ్ స్టేషన్ల పరిధిలో జవాబుదారీతనంను పెంచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో సబ్ స్టేషన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కమిటీలు తమ పరిధిలో విద్యుత్ డిమాండ్, లో ఓల్టేజీ, విద్యుత్ సరఫరా తదితర అన్ని అంశాలను పరిశీలిస్తాయని, మెరుగైన విద్యుత్ సరఫరా వ్యవస్థకు ఈ కమిటీలు సహకరిస్తాయని తెలిపారు.
సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) కె.విజయానంద్, ఎపి జెన్కో ఎండి చక్రధర్ బాబు, జెఎస్ కుమార్ రెడ్డి, సిపిడిసిఎల్ సిఎండి పద్మాజనార్థన్ రెడ్డి, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment