పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం కాదు.

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం కాదు


- నాలుగు కోట్ల ఓటర్లలో.. ఇప్పుడు ఓటు వేసింది ఎనిమిది లక్షలే

- ఈ ఫలితాలతో ఏదో జరుగుతోందని టీడీపీ అనుకోవడం హాస్యాస్పదం

- గతంలో ఈ ఎన్నికల్లో వామపక్షాలు, పీడీఎఫ్, యూనియన్‌లే పోటీ 

- ఈసారి ప్రయోగాత్మకంగా బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ 

- ఉపాధ్యాయులు ఆదరించి రెండు స్థానాల్లో గెలిపించారు

- 2007లో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం 

- ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం

అమరావతి (ప్రజా అమరావతి);

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిబింబించవు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ఓటర్లలో మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఒక భాగం మాత్రమే. పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాలతోనే తాము బలం పుంజుకున్నామని.. ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం.


పీడీఎఫ్, వామపక్షాల ఓట్లతోనే.. 

- గతంలో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు, పీడీఎఫ్, ఉపాధ్యాయ సంఘాల యూనియన్‌లు, ఇతర యూనియన్‌లు పోటీ చేస్తే.. వాటికి రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేవి. ఈసారి మూడు పట్టభద్ర, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రయోగాత్మకంగా వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపాం. 

- ఉపాధ్యాయులు వైఎస్సార్‌సీపీని ఆదరించి, రెండు స్థానాల్లోనూ గెలిపించారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇదే ప్రథమం. ఇది వైఎస్సార్‌సీపీకి గొప్ప విజయం. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి పీడీఎఫ్, వామపక్షాలు ఓట్లేయించడం వల్లే ఆ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గణనీయమైన ఓట్లు దక్కాయి. 

- సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు దక్కిన ఓటర్లలో పట్టభద్రులు తక్కువగా ఉన్నారు. వారికి మా సందేశాన్ని పంపడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ఓట్లు టీడీపీ అభ్యర్థి ఓట్లలో కలిపారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.


2024లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం

- ఉమ్మడి రాష్ట్రంలో 2007లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ.. 2009లో జరిగిన సార్వత్రికక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. అప్పుడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మళ్లీ గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

- సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం తథ్యం. 2019 ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలు.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రికార్డు విజయాలు సాధించడం ఇందుకు నిదర్శనం.  


ఓటుకు కోట్లు తరహాలో చంద్రబాబు కుట్ర

- శాసనసభలో టీడీపీకి సాంకేతికంగా 23 మంది సభ్యులు ఉన్నప్పటికీ.. అందులో నలుగురు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. సంఖ్యా బలం లేకపోయినా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించారు.

- గతంలో తెలంగాణలో సంఖ్యా బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి.. నోట్ల కట్టలతో సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో చంద్రబాబు పట్టుబడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే రీతిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు కుట్రలు చేయొచ్చు.


Comments