అవయవ దానంపై అవగాహన చాలా ముఖ్యం

 ___ అవయవ దానంపై అవగాహన చాలా ముఖ్యం


___ ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకలు 

  కాకినాడ, మార్చి 9 (ప్రజా అమరావతి): అవయవ దానంతో ప్రాణదానం చేయవచ్చునని, అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో కిడ్నీ ఆరోగ్యం, వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు స్థానిక హోటల్లో గురువారం జరిగింది.

  ఈసందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కొరకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధి విస్తరించి అనేక వ్యాధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వైద్యులు కొరత గుర్తించి దాదాపు 13 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అనేక చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రంలోని వైద్య నిపుణులు సూచనలు, సలహాలు మేరకు వైద్య సేవలలో అనేక మార్పులు చేర్పులు చేస్తామన్నారు. లేదు ఈ మార్చి నెల ఆఖరి నాటికి ప్రభుత్వ వైద్యుల ఖాళీలన్నింటిని  భర్తీ చేస్తామన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ కిడ్నీ ఆరోగ్యం, వ్యాధులు నివారణ,కిడ్నీ, అవయవాల దానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ జివి రావు, డాక్టర్ సిహెచ్ కరుణాకర్ రెడ్డి, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం, తదితరులు ప్రసంగించారు. ఈసందర్భంగా విజయవంతం గా కిడ్నీ మార్పిడి చికిత్స పొందిన ముగ్గురు రోగులను పరిచయం చేసారు.   

  ఈ కార్యక్రమంలో వైద్యులు పి రవీంద్ర, పి శర్దిష్ట, నాగేశ్వరరావు, పిపి ఛటర్జీ, అపోలో సీనియర్ జనరల్ మేనేజర్ ఐవి రమణ, డిజిఎం జీవిఆర్ మూర్తి, అపోలో సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.

Comments