చేనేత వస్త్ర ప్రదర్శనకు అపూర్వ స్పందన
80 స్టాళ్లల్లో చేనేత వస్త్రాల అమ్మకాలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న నూతన వెరైటీలు
రోజురోజుకీ పెరుగుతున్న విక్రయాలు
నెల్లూరు, మార్చి 18 (ప్రజా అమరావతి):
చేనేత వస్త్రాలు మన జీవన విధానంతో ముడిపడి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన చేనేత వస్త్ర ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో 80 స్టాల్స్ ని ఏర్పాటు చేసి దేశంలో ఉన్న అన్ని రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వస్త్ర ప్రదర్శనను ఈనెల 15న జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు ప్రారంభించగా, ఈ వస్త్ర ప్రదర్శనను ఈనెల 28 వరకు సుమారు 14 రోజులపాటు కొనసాగించనున్నారు. దేశవ్యాప్తంగా బీహార్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి, ధర్మవరం, పాటూరు, చీరాల, బాపట్ల, ఉప్పాడ, మంగళగిరి, పోచంపల్లి, గద్వాల్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన చేనేత వస్త్రాలు అందర్నీ కట్టిపడేస్తున్నాయి. పట్టు, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, షర్టు, ప్యాంట్ బిట్లు, దుప్పట్లు మొదలైన చేనేత వస్త్రాలు బయట మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రోజు రోజుకి కొనుగోళ్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈనెల 15వ తేదీన రూ. 4,62,900, 16న రూ. 7,02,800, 17న రూ. 5,94,700/- ల మేర విలువైన చేనేత వస్త్రాలు అమ్మకాలు జరిగాయి. చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
జాతీయ వినియోగదారులను చేనేత వస్త్రాల వైపునకు ఆకర్షించాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, పూర్తిగా నూతన వెరైటీలు ఈ ప్రదర్శనలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి కొనుగోలుదారుడు ప్రత్యేక అనుభూతిని పొందేలా వస్త్ర శ్రేణిని ఏర్పాటు చేశారు.
ప్రతి ఒక్కరూ సద్వినియోగం చూసుకోవాలి
:- జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు
రాష్ట్రంలో చేనేత వస్త్రాలను ప్రజలు ఆదరిస్తున్నారని, రాష్ట్రస్థాయి ప్రదర్శనను నెల్లూరులో ఏర్పాటు చేయడం జిల్లాకు ఎంతో గర్వకారణమని, ఈ నెల 28 వరకు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, చేనేత వస్త్రాలను ఆదరించి, చేనేత కార్మికులకు అండగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
addComments
Post a Comment