అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి



అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి


మిర్చి రైతులకు భరోసా కల్పించాలిః నారా చంద్రబాబాయుడు

అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలి వాన బీభత్సంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు తెలియజేస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కురిసిన భారీవర్షాలు.. వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. మొక్కజొన్న, మిరప, పెసర, మినుము పంటలతోపాటు అరటి, బొప్పాయి, మామిడి తదితర పంటలకు అధికంగా నష్టం జరిగింది. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో రైతుల దగ్గర ధాన్యం నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో తమవద్దే ఇళ్ల ముందు పట్టాలు కప్పి నిల్వ చేసుకున్న  ధాన్యం తడిచి నష్టం కలిగింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. 

పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ జిల్లాల్లో మిరప రైతులు కోట్లాది రూపాయల మేర నష్టపోయారు. ఇప్పటికే తామర పురుగు ఆశించడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గగా, మూడు రోజులుగా కురిసిన వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిచిపోయింది. నష్టాల్లో ఉన్న మిర్చి రైతులను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఏలూరు జిల్లా చింతలపూడి, ముసునూరు, టి.నరసాపురం మండలాల్లోనూ వడగళ్ల వానకు మామిడి, పొగాకు, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. త్వరతిగతిన నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. 


       

Comments