ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తా

 *- ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తా


 *- గుడివాడ నుండి కొడాలి నానిని సాగనంపుతా* 

 *- ప్రజలకు భయం లేకుండా చేస్తానని మాటిస్తున్నా* 

 *- విలువల్లేని దుష్టశక్తులకు గుణపాఠం చెప్పండి*

 *- న్యాయస్థానాలపై నమ్మకం వల్లే విజయం సాధించా* 

 *- రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత అండగా ఉంటా* 

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 


గుడివాడ, ఫిబ్రవరి 7 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. మంగళవారం గుడివాడ కోర్టు నుండి బెయిల్ పై విడుదలైన అనంతరం మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, పామర్రు టీడీపీ ఇన్ఛార్జి వర్ల కుమార్ రాజాతో కలిసి రావి తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడు కాల్వగట్టుపై ఇళ్ళు కూల్చివేస్తున్నారని తెలిసి పార్టీ శ్రేణులతో కలిసి అక్కడకు వెళ్ళానన్నారు. ఉన్నట్టుండి ఇళ్ళను కూల్చివేస్తే మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడతారంటూ అధికారులను బతిమలాడానన్నారు. కనీసం మూడు వారాల గడువు ఇవ్వాలని కోరగా, వారం రోజులు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారన్నారు. హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని నిర్వాసితులకు సూచించానన్నారు. ఆ తర్వాత కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని తెలిసి ఆయనకు మద్దతు తెలిపేందుకు వెళ్ళానన్నారు. ఈలోగా అన్యాయంగా ఇళ్ళను కూల్చివేశారన్నారు. తనపై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఈ ఇళ్ళ మీదుగానే వేసిన లేఅవుట్ లో ఫ్లాట్లను అమ్ముకునేందుకే కూల్చివేతలకు పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానిని సాగనంపి బదులు తీర్చుకుంటానని సవాల్ చేశారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా, కుయుక్తులు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. గత నాలుగేళ్ళుగా ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజాస్వామ్య విలువలను పాటించకుండా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇప్పటికైనా బుద్ధి రావాలన్నారు. గత 20ఏళ్ళుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలను మభ్య పెడుతూ వస్తున్నారన్నారు. ఓట్లు వేసి గెలిపించినందుకు ఎన్నో కుటుంబాలు మోసపోయి రోడ్డున పడ్డాయన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే కొడాలి నాని చేసిన అరాచకాలు, దోపిడీలను అరికడతానన్నారు. గత నాలుగేళ్ళుగా గుడివాడ నియోజకవర్గంలో భయపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. అటువంటి భయం లేకుండా చేస్తానని మాటిస్తున్నానన్నారు. వేల కోట్ల డబ్బు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబు, లోకేష్ తో పాటు మహిళలపై కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. మళ్ళీ అవకాశమిస్తే కొడాలి టాక్స్ వసూలు చేస్తారని హెచ్చరించారు. రాజకీయ విలువలు లేకుండా కొనసాగుతున్న దుష్టశక్తులకు గుణపాఠం చెప్పాలన్నారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉండడం వల్లే విజయం సాధించామని, రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే రావి హామీ ఇచ్చారు.

Comments