స్టీల్‌ ప్లాంట్‌ పునాది రాయి చిరకాల స్వప్నం


సున్నపురాళ్లపల్లె, వైయస్సార్‌ జిల్లా (ప్రజా అమరావతి);


*వైయస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:*


జమ్ముల మడుగు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడుకి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.

 దేవుడి దయతో ఇవాళ వైయస్సార్‌ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

ఎన్నికల కోడ్‌ నేపధ్యంలో పెద్ద ఎత్తున జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని...  వీలైనంత తక్కువ మందితో జరపాల్సి వచ్చింది. మమ్నల్ని కూడా పిలవండి అని కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డిని అడుగుతున్నా... కోడ్‌ అడ్డంకిగా ఉందన్న విషయాన్ని పెద్ద మనసుతో అర్ధం చేసుకొండి.


*స్టీల్‌ ప్లాంట్‌ పునాది రాయి చిరకాల స్వప్నం


*.

ఈ రోజు మనం పునాది రాయి వేస్తున్న ఈ కార్యక్రమం మనం చిరకాల స్వప్నం. స్టీల్‌ ప్లాంట్‌ వస్తే ఏ రకంగా నగరాలుగా మారిపోతున్నాయి అన్నదాన్ని మనం గమనించాం. విశాఖపట్నం తీసుకున్నా.. కర్ణాటకలోని విజయనగరం పక్కన జిందాల్‌ వాళ్లు పెట్టిన ఫ్యాక్టరీ చూసినా, ఇతర ప్రాంతాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంటులు చూసినా జిల్లా అంతా ఎంత అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నది మనం చూశాం.


అదే జరగాలి అని అప్పట్లో నాన్నాగారు ఉన్నప్పుడు ఈప్రాంతం అభివృద్ధి కోసం కలలుకని.. ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ కావాలని ఆలోచన చేశారు. ఆయన చనిపోయిన తర్వాత జిల్లాను ఏ నాయకుడు పట్టించుకోకపోవడంతో జిల్లా మొత్తం వెనుకబాటుకు గురి కావడం మన కళ్లతో మనం చూశాం.


*మరలా దేవుడి ఆశీస్సులతో ఇవాళ...*

ఈ రోజు దేవుడి మళ్లీ ఆశీర్వదించాడు. మీ బిడ్డ మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఈ ప్రాంతానికి ఒక్కొక్కటిగా పరిశ్రమలు వస్తూ... మంచి రోజులు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ దేవుడి దయతో మనం ఎప్పటినుంచో స్వప్నంగా ఎదురుచూస్తున్న స్టీల్‌ప్లాంట్‌కు  ఇవాళ శంకుస్ధాపన చేస్తున్నాం. 


ఇవాళ ఇక్కడ నిర్మించబోయే స్టీల్‌ప్లాంట్‌ ప్రాజెక్టు మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుంది. 3 మిలియన్‌ టన్నుల ప్లాంటును  రెండు దశలలో కట్టడానికి జిందాల్‌ గారు కార్యాచరణ తయారు చేసారు. ఇందులో మొదటి దశ మరో 24 నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది. అది రూ.3,300 కోట్లతో పూర్తవుతుంది. ఆ తర్వాత సెకండ్‌ ఫేజ్‌ మరో 5 సంవత్సరాలలో రూ.5,500  కోట్లతోనూ కలిపి మొత్తంగా రెండు దశల్లోనూ రూ.8,800 కోట్లతో ఈ ప్రాంతంలో 3మిలియన్‌ టన్నుల సామర్ధ్యమున్న స్టీల్‌ ప్లాంట్‌ ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం ఒక మంచి వ్యక్తి చేతుల మీదుగా జరుగుతుంది.

 

జిందాల్‌ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌గారు 28.5 మిలియన్‌ టన్నుల స్టీల్‌ సామర్ధ్యంతో దాదాపు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులతో స్టీల్‌ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ 3 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో ప్రారంభించిన ఈ స్టీల్‌ప్లాంట్‌ అక్కడితో ఆగిపోదు.

బళ్లారిలో కూడా జిందాల్‌ గ్రూపు స్టీల్‌ ప్లాంట్‌ మొదలుపెట్టినప్పుడు 3 మిలియన్‌ టన్నుల సామర్ధ్యం అనే చెప్పారు. ఇవాళ అది పెరుగుతూ వస్తూ... 13 మిలియన్‌ టన్నుల ప్లాంట్‌ అవడంతో ఆ ప్రాంత రూపురేఖలు అన్ని పూర్తిగా మారాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను.


*రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు.*

ఈ ప్లాంట్‌కు మద్ధతివ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కారణం ఈప్రాంతం సముద్రతీరానికి దగ్గరగా కాకుండా.. విసిరేసినట్టు దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి.  ఈ ప్లాంట్‌ కోసం ఇక్కడ మిగిలి ఉన్న భూములన్నీ రూ.40 కోట్లతో కొనుగోలు చేసి.. దాదాపు 3,500 ఎకరాలు సజ్జన్‌ జిందాల్‌ గారికి జిందాల్‌ ఫ్యాక్టరీకి ఇవ్వడమే కాకుండా... దాదాపు రూ.700 కోట్లతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. 


కారణం ఇక్కడ జిందాల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీతోపాటు పక్కన అనుబంధపరిశ్రమలు కూడా వ్యవస్ధ ఏర్పడుతుంది. ఫలితంగా ఇక్కడో స్టీల్‌ సిటీ ఆవిర్భావమవుతుందన్న ఉద్దేశ్యంతో గొప్ప అడుగులు వేస్తున్నాం. ఈ ప్లాంట్‌కు సంబంధించి 67వ నెంబరు జాతీయ రహదారిని కలుపుతూ.. ఏడున్నర కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రోడ్డు వేస్తున్నాం. ప్రొద్దుటూరు, ఎర్రగుంట రైల్వే లైను కొరకు కొత్తగా మరో పదికిలోమీటర్లు లైన్‌ నిర్మాణం కూడా జరుగుతుంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టీఎంసీల నీటిసరఫరా కోసం ప్రత్యేక పైపులైన్‌ ద్వారా అందించే కార్యక్రమం చేపడుతున్నాం. నిరంతరంగా విద్యుత్‌ సరఫరా కోసం తలమంచిపల్లె సబ్‌స్టేషన్‌ నుంచి ఈ ప్లాంట్‌ కోసం ప్రత్యేకంగా 220 కేవీ లైన్‌ కూడా నిర్మిస్తున్నాం. ఈ రకమైన మౌలిక సదుపాయాలు ఈ ప్లాంట్‌కు అందించేందుకే దాదాపు రూ.700 కోట్లు మనం ఖర్చు చేస్తున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను.


ఈ ప్లాంట్‌ వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటికే కొప్పర్తిలో 550 ఎకరాలు కేటాయించి.... ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ)ను తీసుకొచ్చాం. ఇక్కడకు దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆ 550 ఎకరాల్లో మొత్తం పరిశ్రమలు వస్తే... మొత్తంగా లక్ష మంది మందికి ఉద్యోగాలు వచ్చే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే అక్కడ రూ.1100 కోట్లతో పెట్టుబడులు వచ్చాయి. 11,500 మందికి ఉద్యోగాలకు సంబంధించిన కార్యాచరణకూడా వేగంగా జరుగుతుంది. 


అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌పేరుతో 3,155 ఎకరాలను కేటాయించి.. అడుగులు ముందుకు వేస్తున్నాం. అక్కడ కూడా రూ.18వేల కోట్ల రూపాయిల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాలను క్రియేట్‌ చేస్తున్నాం. తద్వారా 1.75లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది.


*చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగం దిశగా...*

ఈ రకంగా చదువుకున్న ప్రతి పిల్లాడికి మన ప్రాంతంలోనే మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని మన పిల్లలకు రావాలన్న తపన, తాపత్రయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకు ఇవ్వాలని మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది.

వీటన్నింటితో మన ప్రాంతం అంతా బాగుపడాలని, మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటూ, తపిస్తున్నాను.


*జిందాల్‌ గారికి ధన్యవాదాలు.*..

అదే విధంగా ఈ ప్రాంతంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసినందుకు సజ్జన్‌ జిందాల్‌ గారికి ధన్యవాదాలు. ఈ ప్రాంతం అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉంది. ఈ తరహా పెట్టుబడి ఇక్కడ పెట్టడం ద్వారా ఈ జిల్లా ముఖచిత్రం మారిపోనుంది. ఇక్కడికి వచ్చి స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం ద్వారా...మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి ఒక ఆశ కల్పించారు. మీరు స్టీల్‌ ప్లాంట్‌ కోసం పెడుతున్న రూ.8,800 కోట్ల పెట్టుబడితో ఆగిపోకూడదని విశ్వసిస్తున్నాను. ఇంకా మిగిలిన గ్రీన్‌ హైడ్రోజన్, సోలార్, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల దిశగా కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాం. ఈ రంగంలో దాదాపు 30 వేల కోట్ల పెట్టుబడులుకు అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడి ద్వారా మీరు ఆ దిశగా కూడా నమ్మకాన్ని కల్పించారు.  


*ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ ఏపీ*

ఈ సందర్భంగా నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే  2019 నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రాలకు ర్యాంకింగ్‌ ఇచ్చే ముందు పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో... పరిశ్రమల స్ధాపనకు చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌ బ్యాడ్‌ వల్లే మేం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిశ్రమలకు ఎంత అనుకూలంగా ఉంది, పారిశ్రామిక వేత్తలు ఏపీలో పరిశ్రమల స్ధాపనకు ఎంతటి సానుకూలంగా ఉన్నారన్న విషయాన్ని ఈ ర్యాంకింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 


*మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే...*

2021–22లో 11.43 శాతం గ్రోత్‌ రేటుతో ఏపీ దేశంలోనే వేగవంతమైన గ్రోత్‌ రేటు గల రాష్ట్రంగా మొదటి స్ధానంలో నిల్చింది. ఈ రెండు అంశాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిశ్రమలకు ఏ మేరకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.


*ఫోన్‌ కాల్‌ దూరంలో ప్రభుత్వం..*.

నేను మరో విషయం మీకు స్పష్టం చేస్తూ హామీ ఇస్తున్నాను. మీకు ఏ సమస్య ఉన్న, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక ఫోన్‌ కాల్‌ దూరంలోనే అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరిస్తుంది. మీ అందరి తరపును నేను సజ్జన్‌ జిందాల్‌ గారికి హామీ ఇస్తున్నాను. ఈ రోజు స్టీల్‌ ప్లాంట్‌ కోసం 3 మిలియన్‌ టన్నులతో ప్రారంభమైన ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా విస్తరణ జరగాలని కోరుకుంటున్నాను. 


ఇక్కడకు వస్తున్న పెట్టుబడులను మనసారా ఆహ్వానిస్తూ  పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటామని మీ తరపున హామీ ఇస్తున్నాను. ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments