సంస్కరణల దిశగా పోలీస్‌ స్టేషన్లు...


అమరావతి (ప్రజా అమరావతి);


*పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను వర్చువల్‌గా క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:*


*సంస్కరణల దిశగా పోలీస్‌ స్టేషన్లు...*


ఈ రోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పోలీసు శాఖలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, గతానికి భిన్నంగా ఎన్నో మంచి సంస్కరణలు అమలవుతున్నాయి. ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్ధాయిలోనే మహిళా పోలీసులు, గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారు. 

ఎప్పుడూ జరగని విధంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ని.. మొట్టమొదటగా రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చాం. 


పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రవర్తించే విధానంలో గతానికి ఇప్పటికీ గణనీయమైన తేడా కనిపించే విధంగా మార్పు తీసుకునివచ్చాం.  పోలీసులు మీ స్నేహితులు అనే భావనను కలిగిస్తూ.. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షనిస్టును కూడా ఏర్పాటు చేసి... ఫిర్యాదుదారులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తున్నాం. 


*దిశ యాప్‌ –  1 కోటి 20 లక్షల డౌన్లోడ్స్‌...* 

గతంలో ఎప్పుడూ జరగని విధంగా దిశ యాప్‌ను దాదాపు 1 కోటి 20 లక్షల పై చిలుకు రిజిస్ట్రేషన్లు, డౌన్లోడ్‌ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను ఐదు సార్లు షేక్‌ చే సినా, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా చాలు... ఐదు, పదినిమిషాలలోపే పోలీసు సోదరుడు  ఒక అన్నగా, తమ్ముడిగా వచ్చి సహాయం చేయడానికి స్పందిస్తారు. ఫోన్‌ చేసి సమాచారం అడుగుతారు... ఒకవేళ ఫోన్‌లో స్పందించకపోతే  స్వయంగా అక్కడికి వెళ్లి తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తున్నారు. 


*ఆరువేల మందికి సాయం....*

ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కిన పది నిమిషాల్లోనే పోలీసుల ఫోన్‌ చేసి...  మీరు బాగున్నారా అమ్మా అని అడుగుతున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 6వేల మందికి మంచి జరిగింది. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా పోలీసుశాఖలో కనిపిస్తున్న మార్పులు.


ఇటువంటి మార్పుల్లో భాగంగానే ఇవాళ 20 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ జరగని, చూడని విధంగా ఇవాళ జరుగుతున్నాయి. 


*పర్యాటకుల సౌకర్యం, భద్రత కోసం..* 

పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా దాదాపు  20 లొకేషన్లు గుర్తించి అక్కడ కియోస్క్‌లు ఏర్పాటు చేశాం.ఆ కియోస్క్‌లన్నీ స్ధానిక పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానమై, 20 అదనపు పోలీస్‌ స్టేషన్‌లుగా పనిచేస్తున్నాయి. 

ప్రతి కియోస్క్‌లోనూ దాదాపుగా 6 మంది సిబ్బంది రెండు షిప్టులలో పనిచేసే విధంగా రూపకల్పన చేశారు. వీరిని ఎస్‌ఐ లేదా ఏఎస్‌ఐ స్ధాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఎవరైనా ఆపదలో ఉంటే వారి కోసం  ప్రత్యేకంగా టెలిఫోన్‌ నంబరు డిస్‌ప్లే 

చేయడం జరుగుతుంది. అదే విధంగా ఆ ప్రదేశంలో ఎవరికైనా ఆపద వస్తే... దిశ యాప్‌ డౌన్లోడ్‌  చేసుకుంటే పోలీసు సోదరుడు మీకు తోడుగా నిలబడినట్టే అన్న భావన కల్పించే  విధంగా కరపత్రాలు కూడా ఆ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. 


వీరందరికీ ప్రత్యేకమైన టెలిఫోన్‌ నెంబరు, రేడియో సెట్, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, అత్యవసర టెలిఫోన్‌ నెంబర్లు, వాహనాలు ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులు, యాత్రికులు నిర్భయంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా పర్యాటక ప్రాంతాల్లోనూ, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోనూ నిర్భయంగా గడిపేందుకు అవసరమైన భరోసా కల్పించే దిశగా ఇకమీదట ఈ టూరిస్ట్‌ పోలీసు స్టేషన్లు పనిచేయడం మొదలు పెడతాయి. 

ఇవన్నీ మహిళల భద్రతతో పాటు ఆ ప్రాంతంలో పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం రాకూడదన్న తపనతో అడుగులు ముందుకు వేశాం. 

పోలీసుశాఖలో ఇది మరో సువర్ణఅధ్యాయంగా కూడా నిలబడుతుంది. పోలీస్‌ శాఖలో చేస్తున్న అనేక సంస్కరణల్లో ఇది కూడా గొప్ప సంస్కరణగా నిలబడుతుంది.


*మహిళా సిబ్బంది తోడుగా...*

నా దృష్టికి వచ్చిన మరో మంచి విషయం ఏమిటంటే...టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందిలో సగం మంది మహిళలు ఉన్నారు. దీనివల్ల ఎవరైనా మహిళలు ఆ కియోస్క్‌లకు వెళ్లినప్పుడు వారికి మహిళా సిబ్బంది తోడుగా నిలబడతారు. ఇవన్నీ మంచి పరిణామాలు. వీటన్నింటి వల్ల పర్యాటకులందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ  పోలీస్‌ స్టేషన్లో పనిచేసే వారు అంకిత భావంతో, సేవా భావంతో పనిచేయాలని కూడా ఆకాంక్షిస్తూ... ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అడుగులు ముందుకు వేస్తున్నందుకు... నా తరపున, ప్రభుత్వం తరపునుంచి కూడా మనసారా మీ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ తెలియజేస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు. 


ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments