*- గుడివాడను ముంచెత్తుతున్న "బరంపురం గుట్కా, జర్దా"*
*- తెలంగాణా నుండి భారీగా సిగిరెట్ల స్మగ్లింగ్*
*- అమ్మేది, బెదిరించేది, పట్టించేది "ట్రిపుల్ ఎస్"*
*- యాక్టివా, టీవీఎస్, ఆటోల్లో సరుకు సరఫరా*
*- రిటైల్ కు ఆర్టీసీ బస్సులనూ వదిలిపెట్టడం లేదు*
*- పెరిగిన ప్యారిస్, గోల్డ్ విమల్, గోల్ట్ స్టెప్ అమ్మకాలు*
*- ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా చేరుకుంటున్న సిగిరెట్లు*
గుడివాడ, జనవరి 5 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణాన్ని ఒడిశా రాష్ట్రం బరంపురం నుండి పెద్దఎత్తున గుట్కా, జర్దా, పాన్ మసాలా తదితర ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి. వీటితో పాటు తెలంగాణా రాష్ట్రం నుండి భారీగా విదేశీ కంపెనీలకు చెందిన పన్ను చెల్లించని సిగిరెట్లను కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటన్నింటినీ రిటైల్ వ్యాపారులకు అమ్మేది, కొనకపోతే బెదిరించేది, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించేది గుడివాడ పట్టణంలోని గీతాభవన్ రోడ్డులో ఉంటున్న "ట్రిపుల్ ఎస్" రావు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక బరంపురం నుండి లారీల ద్వారా నేరుగా గుడివాడ పట్టణంలోని గీతాభవన్ రోడ్డు, మరో రెండు, మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గోడౌన్లకు గుట్కా, జర్దా ఉత్పత్తులు చేరుకుంటాయి. ఎంసి పాన్ మసాలా 30 ప్యాకెట్లను రూ.120లకు విక్రయిస్తున్నారు. మిరాజ్ జర్దా 35 దండలున్న ప్యాకెట్ ను రూ.6,500లకు అమ్మడం జరుగుతోంది. పాన్ మసాలాలో కలిపే ఏ-వన్ తోకలు 52 ప్యాకెట్లు ఉండే బస్తాను రూ. వెయ్యికి ఇస్తున్నారు. వీటిని గుడివాడ పట్టణం, రూరల్ మండలంతో పాటు కైకలూరు, బంటుమిల్లి, పామర్రు, గుడ్లవల్లేరు, చల్లపల్లి తదితర ప్రాంతాల్లోని కిళ్ళీ షాపులు, బడ్డీ కొట్లకు హెూండా యాక్టివా, టీవీఎస్ ఎక్సెల్ సూపర్, ఆటోల్లో సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాలకు గుట్కా, జర్దా ప్యాకెట్లను అందజేయడానికి ఆర్టీసీ బస్సులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇలా బరంపురం నుండి గుడివాడకు చేరుకుంటున్న గుట్కా, జర్దా ఉత్పత్తుల విలువ దాదాపు రూ.50లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిపై భారీగా లాభాలు వేసుకుని రిటైల్ కు సరఫరా చేస్తూ రోజుకు లక్షల్లో దోచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ నుండి ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా విదేశీ కంపెనీలకు చెందిన పన్నులు చెల్లించని సిగిరెట్లను కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల గన్నవరంలో దాదాపు రూ.8కోట్ల విలువైన ప్యారిస్ కంపెనీ సిగిరెట్లను విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని కూడా ఆసరాగా చేసుకుని గుడివాడలో ప్యారిస్ కంపెనీ సిగిరెట్ల ధర గత సెప్టెంబర్ నెల నుండి అమాంతం పెంచేశారు. ప్రస్తుతం 10 పెట్టెల సిగిరెట్లను రూ.160లకు అమ్మడం జరుగుతోంది. తెలంగాణాలో వీటి ధర రూ.100లు ఉంటుందని చెబుతున్నారు. ఇక గోల్డ్ విమల్, గోల్డ్ స్టెప్ బ్రాండ్ల సిగిరెట్ల విషయానికొస్తే ఒక్కో పెట్టెలో 10 సిగిరెట్లు ఉండే 25 పెట్టెలను రూ.225లకు అమ్ముతున్నారు. ఈ విధంగా లక్షలాది రూపాయల విలువైన సిగిరెట్లు గుడివాడ ప్రాంతానికి స్మగ్లింగ్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఏమీ జరగనట్టుగా సంబంధిత అధికార యంత్రాంగం వ్యవహరిస్తూ రావడంపై అనేక విమర్శలూ ఉన్నాయి. ఇటీవల కాలంలో విదేశీ కంపెనీల సిగరెట్లకు డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. కాగా గత నెల రోజుల కిందట ఏకంగా కిళ్ళీ బడ్డీలు, బడ్డీ కొట్లలో గుట్కా, జర్దా ప్యాకెట్లను బహిరంగంగానే వేలాడదీసి అమ్మాలని, ఎవరైనా అడిగితే తన పేరు చెప్పాలని "ట్రిపుల్ ఎస్" సెలవిచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గాని మళ్ళీ ఎప్పటిలాగే గుట్టు చప్పుడు కాకుండా అమ్మే పరిస్థితికి వచ్చారు. ఇక "ట్రిపుల్ ఎస్" విషయానికొస్తే తన దగ్గర గుట్కా, జర్దా ఉత్పత్తులు, ఫారిన్ కంపెనీల సిగిరెట్లను కొనకపోతే పోలీసులతో దాడులు చేయిస్తానని బెదిరించి మరీ అక్రమ వ్యాపారం చేయిస్తున్నాడు. బహిరంగంగానే ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నాడో రిటైల్ వ్యాపారుల దగ్గర చెప్పుకుంటూ సరుకును అమ్ముకుంటున్నాడు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులు, గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలన్నింటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిని ఏ పేరుతోనైనా తయారు చేయడం, అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం వంటివి నేరంగా పరిగణిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆహార భద్రతా కమిషనర్ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ పట్టణంలో జరుగుతున్న గుట్కా, జర్దా, విదేశీ కంపెనీల సిగిరెట్ల విక్రయాలపై సంబంధిత అధికారులు దృష్టిసారించి వాటిని అరికట్టే విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
addComments
Post a Comment