డ్రైవర్లు క్రమశిక్షణతో వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించడం సాధ్యం
విజయనగరం, జనవరి 21 (ప్రజా అమరావతి):
రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా నివారించడమే రోడ్డు భద్రత వారోత్సవాల ప్రదానోద్దేశ్యమని జిల్లా రవాణా అధికారి వడ్డి సుందర్ అన్నారు. స్వచ్ఛత పక్వాడ కింద నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక లంకాపేటలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను విస్తరించడం, రోడ్లకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి ఎన్నో చర్యలు చేపడుతోందన్నారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో లారీల కారణంగా జరుగుతున్నవి తక్కువ శాతం మాత్రమేనని అయినప్పటికీ లారీ డ్రైవర్లు వాహనం నడిపేటపుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. లారీ డ్రైవర్లలో కేవలం 5 శాతం మంది మాత్రమే క్రమశిక్షణ పాటించక వాహన ప్రమాదాలకు కారణమవుతున్నారని పేర్కొన్నారు. లారీ డ్రైవర్లు వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి, చెడు అలవాట్లకు దూరంగా వుండటం, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత కలిగి వుండటం ద్వారా ప్రమాదాలు నివారించడం, తగ్గించడం సాధ్యమవుతుందన్నారు.
లారీ డ్రైవర్లు సుదూర ప్రాంతాలకు వాహనాలు నడుపుతున్న కారణంగా తగినంత విశ్రాంతి లేక ప్రమాదాలకు గురువుతున్నారని ట్రాఫిక్ డి.ఎస్.పి. ఎల్.మోహనరావు అన్నారు. దూర ప్రాంతాలకు వాహనాలు రోజుల తరబడి నడిపేటపుడు డ్రైవర్లు తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరమని చెప్పారు. విశ్రాంతి లేకుండా వాహనాలు నడిపినపుడే ప్రమాదాలకు ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ సంస్థ ప్రతినిధి మజ్జి అప్పారావు, రవాణా శాఖ అధికారులు దుర్గాప్రసాద్, లారీ యజమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment