విజయవాడ (ప్రజా అమరావతి);
*రాష్ట్రంలో ప్రతి విద్యార్ధిని గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి*
• *విద్య కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తాం*
• *ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు*
• *కళాశాల మరియు ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ*.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కళాశాల మరియు ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై గురువారం విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లైఫ్ స్కిల్స్ కోర్సులకు సంబంధించి 4, స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులకు సంబంధించి 13 మొత్తం 17 కోర్సుల పాఠ్య పుస్తకాలను మంత్రి విడుదల చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు శిక్షణ కోసం మంత్రి ఆధ్వర్యంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE)తో విద్యాశాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ (CSP) అవార్డులను రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికీ 10 వేల చొప్పున బహుమానాన్ని మంత్రి విద్యార్థులకు అందజేశారు. ‘స్టూడెంట్, ఫ్యామిలీ, కమ్యూనిటీ’ నినాదంతో ఇన్ క్లూసివ్ సెంట్రీ (Inclusive Centre) లోగోను మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు. మన రాష్ట్ర విద్యార్ధులను గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దడానికి వీలుగా ప్రీప్రైమరీ నుండి హైయ్యర్ ఎడ్యుకేషన్ వరకూ అన్ని స్థాయిల్లో అనేక విద్యాసంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెట్టామన్నారు. కళాశాలల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఉండాలనే స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కి మంత్రివర్గంలో ఒక ప్రత్యేక పోర్ట్ ఫోలియో కూడా పెట్టామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉన్నత విద్య కోర్సుతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కోర్సు కూడా జోడించి కొత్త కరిక్యులమ్ ఏర్పాటుకు కృషి చేసిన అధికారులందరినీ మంత్రి అభినందించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచనలు చేసి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కాలానుగుణంగా కరిక్యులమ్ లో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఇప్పటికే లక్షా 40 వేల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మరింత మంది విద్యార్థులకు మేలు కలిగిలా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE)తో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతీ పైసా కూడా వారి సంక్షేమం కోసం మాత్రమే కాదు, వారి భవిష్యత్ కు మన ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అని తెలిపారు. మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించడం, కొత్త కోర్సులను తీసుకురావడం, ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు, ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థిపై చేసే ఖర్చు రాష్ట్రానికి, దేశానికి మానవవనరులను అభివృద్ధి చేసే ఆస్తి అని తెలిపారు. భవిష్యత్ లో ప్రతి విద్యార్థి డాక్టర్, ఇంజనీర్, ప్రొఫెసర్, సివిల్ సర్వీస్ అధికారి, జౌత్సాహిక పారిశ్రామికవేత్తలుగా కావడానికి చిన్నతనం నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. పిల్లల లక్ష్యానికి తగినట్లుగా వారి చదువులు ఉండాలన్నారు. విద్యార్థులందరూ ప్రభుత్వ విధానాలను, విద్య సంస్కరణలను వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు.
ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామల రావు మాట్లాడుతూ.. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలను టాప్-3 గా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే.. వాటిలో టాప్-1 గా విద్యాశాఖ నిలిచిందన్నారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో దేశంలో మరే రాష్ట్రంలో ఖర్చుచేయనంతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసి విద్యాభివృద్ధి కృషిచేస్తుందన్నారు. అమ్మఒడి ద్వారా బడికి వెళ్లే ప్రతి పిల్లాడి దగ్గర నుండి పాఠశాలల్లో మన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆధునీకరణ, ఉన్నత విద్యలో ఫీజు రీయింబర్స్ మెంట్ వరకూ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి సంక్షేమం అందుతుందన్నారు. ఉన్నత విద్యలో 87 శాతం మందికి పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పిచడంతో 100 శాతం ఉచితంగా విద్యను అందిస్తున్నామన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం మనదే అని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి చదువు పూర్తికాగానే ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తోందన్నారు. దానికి అనుగుణంగా కరిక్యులమ్ లో 30 శాతం స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులను ప్రవేశపెట్టామని జె. శ్యామల రావు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఫ్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘యువ ఆంధ్రప్రదేశ్ లో యువతకు పెద్ద పీఠ వేయాలి’ అనే నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కరిక్యులమ్ లో మార్పులకు అధికారులు, ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమన్నారు. అతి తక్కువ సమయంలో 2 లక్షల మందికి ఇంటర్న్ షిప్ సాధించడం గర్వకారణమన్నారు. మన విద్యావిధానం ద్వారా భవిష్యత్ లో ప్రతి ఒక్కరూ ఉద్యోగులుగా బయటకు వస్తారని ఆయన తెలిపారు.
కళాశాల విద్య కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యార్థులు తమ చదువులు ముగించుకుని బయటకు రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా స్కిల్ డెవలప్‌మెంట్, లైఫ్ స్కిల్స్ కోర్సులను రూపొందించామన్నారు. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం.. కొత్తగా 17 రకాల స్కిల్ డెవలప్‌మెంట్, లైఫ్ స్కిల్స్ అంశాలను పాఠ్యపుస్తకాలుగా ముద్రించామని తెలిపారు. ముందుగా పాజెక్ట్ వర్క్ చేసిన ప్రతి విద్యార్థితో ఆయన ముఖాముఖి నిర్వహించి కాలేజీల వాస్తవ పరిస్థితులు, అధ్యాపకుల విద్యాబోధన, అధ్యయనంలో విద్యార్థులకు ఎదురైన అనుభవనాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆప్ లివింగ్ వ్యక్తి వికాస కేంద్ర ఇండియా సీఈవో దిగ్విజయ్, కళాశాల విద్య శాఖ ఏజీవో డాక్టర్ సీహెచ్. తులసి, ఓఎస్డీ డాక్టర్ పి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment