గుడివాడలో "జర్దా వాసు" ఏరియా 20 కిలోమీటర్లు

 *- గుడివాడలో "జర్దా వాసు" ఏరియా 20 కిలోమీటర్లు* 


 *- రూ.కోటిన్నర ఇంటి పక్కనే గోడౌన్* 

 *-పది రోజులకొక కంటైనర్ లో సరుకు* 

 *- టాటా మ్యాజిక్, ఆటోల్లో రిటైల్ కు తరలింపు* 

 *- పోలీస్ ను మేనేజ్ చేసుకున్న వారికీ సరఫరా* 

 *- "పాన్" ముసుగులో ఎం, ఏ-వన్ తోకల విక్రయం* 


గుడివాడ, జనవరి 4 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం నుండి సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో "జర్ధా వాసు" నిషేధిత గుట్కా, పాన్ మసాలా, జర్దా కార్యకలాపాలను సాగిస్తున్నాడు. పట్టణంలోని సత్యనారాయణపురంలో దాదాపు రూ. కోటిన్నరతో ఇల్లయితే ఎప్పుడో కట్టేశాడు. సరుకు మాత్రం ఎవరి కంటా పడకుండా సేఫ్టీగా ఉండేందుకు ఇంటి పక్కనే గోడౌన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఏళ్ళ తరబడి అందరినీ మేనేజ్ చేసుకుంటూ జర్దా, గుట్కా వ్యాపారం చేస్తుండడంతో ఇక గోడౌన్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కనిచూపు మేరలో కన్పించడం లేదు. ప్రతి పదిరోజులకోసారి రూ.30లక్షల విలువైన సరుకు కంటైనర్ ద్వారా కర్ణాటక రాష్ట్రం నుండి గుడివాడ పట్టణంలోని గోడౌన్ కు చేరుకుంటుంది. అలా చేరుకున్న సరుకును గుడివాడ పట్టణం, రూరల్, పామర్రు, గుడ్లవల్లేరు, హనుమాన్ జంక్షన్, వెంట్రప్రగడ తదితర ప్రాంతాల్లోని కిరాణా షాపులు, కిళ్ళీ బడ్డీలకు టాటా మ్యాజిక్, ఆటోల్లో చేరవేస్తుంటాడు. ప్రస్తుతం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైకలూరు ప్రాంతానికి కూడా ఇక్కడి నుండే సరుకు సరఫరా అవుతున్నట్టుగా తెలుస్తోంది. సరుకు మొత్తం ఖాళీ చేసేలోగా ఇంకో కంటైనర్ నిండా సరుకు వచ్చి చేరుతుంటుంది. దేశంలో గుట్కా, పాన్ మసాలా పరిశ్రమలు ఏటా రూ. వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఈ పరిశ్రమల నుండి వచ్చే ఉత్పత్తులను వినియోగించడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ పౌరసమాజ సంస్థలు, పొగాకు వ్యతిరేక కార్యకర్తలు వీటిని నిషేధించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నోటి కేన్సర్ లో 90శాతం పైగా నేరుగా పొగాకు వాడకంతో సంబంధం కలిగివున్నాయి. వీటి అమ్మకాలపై నిషేధం, పరిమితి మాత్రం ఆహార భద్రత, ప్రమాణాలు 2011 నిబంధనలు, 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టం పరిధిలో ఉంది. ఈ చట్టం ప్రకారం ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఆహార భధ్రత కమిషనర్ కు నిషేధించే అధికారం ఇవ్వబడింది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిషేధం అమల్లో ఉంది. ఇదిలా ఉండగా గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాల్లో "జర్దా వాసు" విక్రయిస్తున్న పాన్ మసాలా, జర్దా, గుట్కా ప్యాకెట్ ధరలను పరిశీలిస్తే రోజుకు లక్షల్లో ఆదాయం సమకూరుతున్నట్టుగా అర్ధమవుతోంది. పాన్ మసాలాతో కలిపి వినియోగించే ఏ-వన్ బ్రాండ్ జర్దా తోకలు 52 ప్యాకెట్లు ఉన్న బస్తాను రూ. వెయ్యి చొప్పున రిటైల్ కు విక్రయించడం జరుగుతోంది. అలాగే ఆర్ఎండి పాన్ మసాలాతో కలిపి వినియోగించే ఎం బ్రాండ్ తోకలు 60 ప్యాకెట్లను రూ.350లకు, మిరాజ్ బ్రాండ్ జర్దా 35 దండలను రూ. 6,500లకు విక్రయిస్తూ వస్తున్నారు. ఇంకా 60 ప్యాకెట్లు ఉన్న ఆర్ఎండి పాన్ మసాలా రూ. వెయ్యిలకు అమ్ముతున్నారు. అయితే ఎవరికి పడితే వారికి సరుకును అందించే పరిస్థితి మాత్రం ఉండదు. రెగ్యులర్ కస్టమర్లతో పాటు పోలీస్ స్టేషన్ ను మ్యానేజ్ చేసుకున్న వారికి మాత్రమే సరుకును విక్రయించడం జరుగుతుంటుంది. కర్ణాటక నుండి గుడివాడ పట్టణానికి నిషేధిత గుట్కా, జర్దా ఉత్పత్తులు పెద్దఎత్తున చేరుకోవడం, అక్కడి నుండి రిటైల్ వ్యాపారులకు సరఫరా చేయడం వరకు ఎక్కడా పట్టు పడకుండా ఉంటున్నారంటేనే ఏ ఏ స్థాయిల్లో ఎంతమందిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. పాన్ మసాలాలో వినియోగించే "తోక"లను ప్రత్యేకంగా లారీల ద్వారా తరలిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం కఠినంగా వ్యవహరించ లేకపోవడం వెనక కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిషేధిత గుట్కా, జర్దా, పాన్ మసాలాలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలపై నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments