*26న శ్రీశైలం రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
*
*రాష్ట్రపతి సందర్శించే స్వామిఅమ్మవార్ల ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి*
నంద్యాల (ప్రజా అమరావతి): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైలం రానున్నారు. ఆమె పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిషాంతి, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, శ్రీశైలదేవస్థానం ఈఓ ఎస్ లవన్న పరిశీలించారు. సున్నిపెంటలోని హెలిప్యాడ్‌ను, సాక్షిగణపతి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శ్రీశైలం చేరుకుని రాష్ట్రపతి స్వామిఅమ్మవార్ల దర్శనార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రత విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. నందిసర్కిల్‌లోని సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ వద్ద కేంద్రప్రభుత్వ పథకాల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట విషయమై టూరిజం శాఖ అధికారులతో మాట్లాడారు. అలాగే శివాజీ స్ఫూర్తి కేంద్రం, వైద్యశాలను పరిశీలించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని అక్కడి సిబ్బందికి సూచించారు.
రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేద్దాం : దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మనజీర్ జిలానీ శామూ న్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లుకు సంబంధించి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల ని సూచించారు. హెలిప్యాడ్ వద్ద, ఆలయంలో కేంద్రప్రభుత్వం పథకాల ప్రారంభోత్సవ ప్రదేశాల వద్ద, శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, రాష్ట్రపతి పర్యటించే ప్రతి ప్రదేశం వద్ద కూడా ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య టీం, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే రోజు రాష్ట్రపతి పర్యటనపై రిహార్సల్స్ నిర్వహిద్దామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ పుల్లయ్య, డీఎస్పీ శృతి, ఆత్మకూరు ఆర్డీఓ దాస్, మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దివాకర్‌రెడ్డి, జిల్లా వైద్య, అర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి పర్యటనకు భారీ బందోబస్తు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన నిమిత్తం భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు ఎస్పీలతో పాటు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్ పార్టీ, బాంబ్‌స్క్వాడ్ తదితర 1,800 మందికి పైగా పోలీస్‌సిబ్బందిని శ్రీశైలానికి డిప్యుటేషన్ విధుల్లో నియమించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
addComments
Post a Comment