*మద్దతు ధరకు విక్రయించండి
*
పార్వతీపురం, నవంబరు 25 (ప్రజా అమరావతి): రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధర కంటే తక్కువకు విక్రయించ వద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ కోరారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన పౌర సరఫరాల శాఖ కమీషనర్ పాలకొండ మండలం బెజ్జి రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సమయంలో ధాన్యం తేమ శాతం ముందుగా పరిశీలించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను గురించి స్పష్టమైన అవగాహన ఉండాలని, మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించ వలసిన అవసరం లేదని ఆయన చెప్పారు. సాధారణ రకం క్వింటాలు (100 కిలోలు) రూ.2,040/-, 75 కిలోలు రూ. 1,530/-, గ్రేడ్ 'ఏ' రకం (100 కిలోలు) రూ.2,060/-, 75 కిలోలు రూ.1,545/- రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యమును విక్రయించాలని ఆయన పేర్కొన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు అవసరమగు గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాయని ఆయన చెప్పారు. సందేహాలు ఉంటే జిల్లా కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సమాచారం అందించ వచ్చని, సమాచారం పొందవచ్చని ఆయన చెప్పారు.
జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కావలసిన మౌలిక సదుపాయాలు, ధాన్యం నాణ్యతను పరిశీలించే పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చెయ్యడం జరిగిందని వివరించారు. జిల్లా స్ధాయిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08963 293037, 7702003585) ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా పౌరరఫరాల అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి, ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
addComments
Post a Comment