‘వైకాపా’తో అమీతుమీకి సిద్ధమైన ‘రఘురామరాజు’? వైకాపాలో కల‌కలం సృష్టిస్తోన్న నర్సాపురం ఎంపీ రఘురామరాజు ఆ పార్టీతో అమీతుమీకి సిద్ధమైనట్లు తాజాగా ఆయన చేసిన ప్రకటనతో తేలిపోయింది. గత కొన్నాళ్లుగా వైకాపా అధిష్టానంపై, స్థానిక ఎమ్మెల్యేల‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న ఆయన తనకు రాష్ట్రంలో భద్రత లేదని,త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, కేంద్ర బల‌గాల‌తో భత్రద కల్పించాల‌ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. తనను బెస్ట్‌ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేశారని, ఈ రోజు కాకపోతే రేపైనా నియోజకవర్గానికి వెళ్లక తప్పదని, తనపై వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు దాడులు చేస్తామని చెబుతున్నారని, ఈ విషయాన్ని పోలీసుల‌ దృష్టికి తీసుకు వచ్చినా..వారు స్పందించడం లేదని, అందుకే స్పీకర్‌కు లేఖ రాసి భద్రత కల్పించాల‌ని కోరానని ఆయన చెబుతున్నారు. తన దిష్టిబొమ్మ దహనంతో పాటు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒక సామాజికవర్గానికి చెందిన వారు అమెరికా, సింగపూర్‌ల‌ నుంచి ఫోన్‌ చేసి దూషిస్తున్నారని, తనకు రక్షణ కల్పించని పోలీసుల‌పై కోర్టుకు వెళతానని ఆయన చెబుతున్నారు. వైకాపా ఏడాది పాల‌న పూర్తి అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పాల‌న చేస్తున్నారని, అదే సమయంలో ఆయన తనకు కలిసే అవకాశం ఇవ్వడం లేదన్నారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ప‌డుతున్నారని, వారిని ముఖ్యమంత్రి కట్టడి చేయడం లేదని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యేలు ‘రఘురామకృష్ణంరాజు’పై ఎదురుదాడికి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. పార్టీని ఇబ్బంది పెట్టడానికి, బిజెపిలోకి వెళ్లడానికే ‘రఘురామరాజు’ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ఇది చిలికి చిలికి గాలి వానగా మారింది. ‘రఘురామరాజు’ వ్యవహారం బాగా లేదని, ఆయనపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ ‘ఉమ్మారెడ్డి’ ప్రకటించారు. ఆయన ప్రకటన తరువాత అయినా ‘రఘు’ తగ్గుతారని భావించినా...ఆయనేమీ తగ్గలేదు. ఒక వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘రఘు’ వ్యాఖ్యలు, దానికి ప్రతిస్పందనగా నియోజకవర్గంలో ‘ఎంపీ’ దిష్టిబొమ్మ దహనాలు, హెచ్చరికలు చేస్తూ ఎమ్మెల్యేలు ప్రతిస్పందించారు. ఆయన నియోజకవర్గానికి వస్తే..దాడులు చేస్తామనే స్థాయికి వెళ్లిపోయింది వ్యవహారం. దీంతో ఆయన కేంద్రానికి మొరపెట్టుకున్నారు. తనకు రక్షణ లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల‌ పరిస్థితి ఎలా ఉందో తన ఉదంత‌మే చాటిచెబుతోందని, తనకు రక్షణ కావాల‌ని కోరారు. దీంతో..ఇక ఆయన ‘జగన్‌’తో అమీ తుమీకి సిద్ధమైనట్లేనని భావన వ్యక్తం అవుతోంది. కేంద్ర బల‌గాల‌ రక్షణ వచ్చిన తరువాత ఆయన నర్సాపురం వెళతారని, అప్పుడు కనుక ఏదైనా ఘర్షణ జరిగితే...రాష్ట్ర ప్రభుత్వం అపఖ్యాతి పాల‌వుతుందన భావన కొందరిలో వ్యక్తం అవుతోంది. అయితే అప్పటిలోగా ఆయనపై ‘జగన్‌’ వేటు వేసి వదిలేస్తారనే అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద..తిరుగుబాటు ఎగరవేసిన ‘రఘు’ ఆ పార్టీతో కొనసాగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.


Comments