*ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదన్న వ్యక్తి జగన్: నక్కా ఆనందబాబు* గుంటూరు: ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన వ్యక్తి జగన్ అని మాజీమంత్రి నక్కా ఆనంద బాబు తెలిపారు. ఇపుడు మాత్రం పోలీసులను అడ్డు పెట్టుకొని టీడీపీ నేతలపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ టీడీపీ శ్రేణులను వేధించటానికి ఉపయోగిస్తున్నారన్నారు. దేశంలో కొత్త సంస్కృతిని ఈ ప్రభుత్వం మొదలు పెట్టిందని ఆనందబాబు విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారన్నారు. రాష్ట్ర డీజీపీ మూడుసార్లు హైకోర్టుకు హాజరు కావటం.. పోలీసుల వైఖరి ఎలా ఉందో తేటతెల్లం చేస్తోందన్నారు. అచ్చన్నాయుడిని రాత్రికి రాత్రి డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అసలు డాక్టర్ కాకుండా వేరే డాక్టర్‌తో డిశ్చార్జ్ చేయించాలని చూశారన్నారు. అరెస్టుల ద్వారా టీడీపీని భయపెట్టలేరని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.


Comments