*ప్రజల దృష్టికి తెస్తుంటే ఉలుకెందుకు: చంద్రబాబు* అమరావతి (ప్రజాఅమరావతి): ప్రజావేదికను నేలమట్టం చేయడం ప్రజల ఆకాంక్షలను నేలకూల్చడమే, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా వేదికను కూల్చి ఏడాది పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ట్వీట్లు చేశారు. ‘‘తెలుగుదేశం హయాంలో ప్రజల వినతులు స్వీకరించే వేదికగా, అన్నివర్గాల సమస్యల పరిష్కార వేదికగా 'ప్రజావేదిక' విలసిల్లింది. విద్య, వైద్య సాయం కోసం, సమస్యలు చెప్పుకోడానికి నిత్యం అనేకమంది వచ్చేవాళ్లు. ప్రభుత్వ సాయంతో పాటు, సమస్యల పరిష్కారం పొందేవాళ్లు’’ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అది ఒక ఉన్మాద చర్య... ‘‘ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చడం ఒక బాధ్యతా రాహిత్యమైన చర్య. ఆ శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచడం ఒక ఉన్మాద చర్య. నాటి విధ్వంసానికి, మీ ప్రభుత్వ ఉన్మాద పాలన ప్రారంభానికి ఏడాది అయిన సందర్భంగా తెలుగుదేశం నేతలు మీ చర్యలను ప్రజల దృష్టికి తెస్తుంటే ఉలికి పడుతున్నారెందుకు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. నిరసించే హక్కు ఉంది... ‘‘మీ విధ్వంసకర పాలనను ప్రశ్నించే హక్కు, నిరసించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఆ హక్కులను హరిస్తూ అరెస్టు చేసిన తెలుగుదేశం నాయకులను వెంటనే విడుదల చేయాలి. మా పార్టీ నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన చరిత్ర మీ విధ్వంసాన్ని, ఉన్మాదాన్నీ మరచిపోదు’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.


Comments