*జగన్‌రెడ్డిలా అచ్చెన్న ఆర్థిక నేరస్తుడు కాదు* శ్రీకాకుళం: జగన్‌రెడ్డిలా అచ్చెన్నాయుడు ఆర్థిక నేరస్తుడు కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ నేతలను జైలుకు పంపుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో బిహార్‌గా మారిపోయిందన్నారు. తమిళనాడు తరహాలో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని.. వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. 33 మంది టీడీపీ నేతలపై దొంగ కేసులు పెట్టారని, దాదాపు వెయ్యి మంది కార్యకర్తలపై కేసులు పెట్టారని లోకేష్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాలంటే సీఎం జగన్‌ పర్మిషన్‌ తీసుకోవాలా? అని లోకేష్‌ ప్రశ్నించారు. భార్యకు మెసేజ్‌ పెట్టాలన్నా జగన్‌ పర్మిషన్‌ తీసుకోవాలేమోనని అన్నారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని, రాష్ట్రంలో ప్రతి స్కీం కూడా స్కామ్‌ల కోసమే పెడుతున్నారని ఆరోపించారు. బోటు ప్రమాదంపై ప్రశ్నిస్తే హర్షకుమార్‌ను జైల్లో పెట్టారని, ఇసుక అక్రమాలను ప్రశ్నిస్తే రవికుమార్‌ను అరెస్ట్ చేశారని విమర్శించారు. వైఎస్‌ పెట్టిన 108లోనూ అవినీతి జరిగిందన్నారు. వైన్‌, మైన్‌లు ఉన్నవారే పార్టీ మారుతున్నారని లోకేష్‌ అన్నారు. అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టడం దారుణమన్నారు. తనను కూడా జైలుకి పంపిస్తామని మాట్లాడుతున్నారని.. ఫైబర్‌ గ్రిడ్‌తో ఐటీ మంత్రికి సంబంధం ఉండదని లోకేష్‌ వ్యాఖ్యానించారు.


Comments