కరోనాకి చికిత్స ప్రైవేటులో భారమే! ప్రైవేటులో కరోనా చికిత్సకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ వ్యయం అవుతుంది. రోగి అనారోగ్యాన్ని బట్టి ఖర్చుల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఆరోగ్య బీమా ఉన్న వారికి కొంత వెసులుబాటు ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 300 మంది కొవిడ్‌ బాధితులు వ్యయ స్థిరీకరణపై సర్కారు యోచన. నెలకు రూ.60 వేల వేతనమొచ్చే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకగా గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో 15 రోజుల పాటు చికిత్స పొందారు. మధ్యలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే.. ఐదు రోజులు ఐసీయూలో ఉంచారు. మిగిలిన రోజులు ప్రత్యేక గదిలో ఉన్నారు. కోలుకొని ఇంటికెళ్లగా బిల్లు మాత్రం రూ.6.75 లక్షలైంది. తనకి రూ.6 లక్షల వరకూ బీమా సౌకర్యం ఉంది. బీమా సంస్థ రూ.3.5 లక్షల వరకు చెల్లించింది. పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర వ్యక్తిగత పరిరక్షణ దుస్తులకైన ఖర్చులను మాత్రం ఇవ్వలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స భారమవుతోంది. వైరస్‌తో ఒక వ్యక్తి చికిత్స పొందితే.. సుమారు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఖర్చవుతోంది. రోగి పరిస్థితిని బట్టి ఈ వ్యయంలో కొంత హెచ్చుతగ్గులుంటాయి. శ్వాసకోశ సమస్య తీవ్రమై వెంటిలేటర్‌పైనే రెండు వారాలకు పైగా ఉండాల్సి వస్తే.. అప్పుడు ఖర్చు అంచనా వేయడం కూడా కష్టమే. ఇంత వ్యయాన్ని భరించడం సామాన్యునికి భారమే. ఎగువ మధ్యతరగతి వర్గాలకూ ఇబ్బందే. కరోనా చికిత్సకయ్యే ఖర్చు చెల్లించడానికి బీమా సంస్థలు ఒప్పుకోవడం బాధితులకు కొంత ఊరటనిస్తుండగా పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర వ్యక్తిగత పరిరక్షణ వస్తువులకయ్యే వ్యయాన్ని చెల్లించడానికి మాత్రం ఆ సంస్థలు ఒప్పుకోవడం లేదు. మొత్తం బిల్లులో 30 శాతం వరకూ బాధితులే భరించాల్సి వస్తుంది. వచ్చే నెలలో రోజుకు సగటున 400-500 కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యంతో పాటు ప్రైవేటులోనూ చికిత్సలు అందించడం అనివార్యమవుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత నెలలోనే ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం సుమారు 300 మంది బాధితులు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. చికిత్స అందిస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతానికి 10-20 ఐసోలేషన్‌ గదులు, 10-20 పడకలతో ఐసీయూలున్నాయి. అవసరాలను బట్టి పడకల సంఖ్యను పెంచడానికి ఆ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. కొవిడ్‌ కేసులకు ప్రైవేటులో చికిత్స అందించాల్సి వస్తే అక్కడయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే స్థిరీకరిస్తుందని గతంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. ఇటీవల ఉన్నతస్థాయి సమీక్షలోనూ ఇదే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. కార్పొరేట్‌ ప్రైవేటులో భారమే ఆసుపత్రుల్లో అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి, ప్రస్తుతం అక్కడ బాధితులకయ్యే ఖర్చులను అధ్యయనం చేసి, మున్ముందు రోగుల సంఖ్య పెరిగినప్పుడు సగటున అయ్యే వ్యయాన్ని లెక్కించి మూడు విభాగాలుగా స్థిరీకరించాలని భావిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఐసోలేషన్‌.. ఐసీయూ.. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఈ మూడు విభాగాల్లో ఎన్ని రోజులు చికిత్స పొందుతారనే ప్రాతిపదికన ఒక ప్యాకేజీ ధరను నిర్ణయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడితే అనుకున్న రోజుల కంటే ఎక్కువ రోజులు ఐసీయూలో, వెంటిలేటర్‌పై చికిత్స పొందాల్సి వస్తుంది. అప్పుడు ఆయా పరిస్థితులను బట్టి వ్యయాన్ని నిర్ణయించాలని కూడా భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని విధానాలనూ పరిశీలిస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులతోనూ చర్చించి వారి అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అసలు కరోనా రోగుల చికిత్సకు ఎందుకింత ఖర్చు? * కరోనా రోగులను ఒక్కో గదిలో ఉంచాలి. కొందరికి ఐసీయూ సేవలు, ఇంకొందరికి వెంటిలేటర్‌ అవసరమూ ఉంటుంది. సాధారణ ఐసీయూలో 20 మంది సిబ్బంది ఉంటారు. కరోనా రోగులకు 40 మందితో సేవ చేయాల్సి వస్తుంది. సిబ్బందిలో సగం మంది వారం పాటు సేవల్లో ఉంటే మరో వారం ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటున్నారు. * సాధారణంగా మూడు షిఫ్టుల్లో పనిచేస్తుంటే కరోనా ఐసీయూల్లో నాలుగు షిఫ్టుల్లో చేస్తున్నారు. ఎందుకంటే పీపీఈ కిట్‌ ధరించి ఆరు గంటలకు మించి ఉండలేరు. ఈ క్రమంలో పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, ఇతరత్రా వ్యక్తిగత పరికరాలు కూడా ఎక్కువగానే వినియోగమవుతున్నాయి. మొత్తంగా ఈ ఆర్థిక భారమంతా చివరకు రోగిపైనే పడుతోంది.


Comments