రక్తదానం మానవత్వానికి చిహ్నం - రెడ్ క్రాస్, మద్యవిమోచన ప్రచార కమిటీ సేవలు ప్రశంసనీయం - రక్తదాన శిబిరంలో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి - అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదానాల శిబిరాలు నిర్వహిస్తాం.. -ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వెల్లడి . గుంటూరు (ప్రజాఅమరావతి): జూన్,28; ర‌క్తమిచ్చి ప్రాణాలు నిలపడం మానవత్వానికి చిహ్నమని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ, రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తమిచ్చారు. తొలుతగా ఇటీవల చైనా దాడిలో అమరులైన వీరజవాన్ దివంగత కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం సమావేశానికి రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి. రామచంద్రరాజు అధ్యక్షత వహించగా ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ రక్తం అవ‌స‌రం ప‌డేవారికి లాక్ డౌన్ పెను స‌మ‌స్యాత్మ‌కంగా మారిందన్నారు. బ్ల‌డ్ బ్యాంక్స్ లో ర‌క్త నిల్వ‌లు అడుగంట‌డంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద రక్తదానానికి అనుమతినిచ్చాయన్నారు. రెడ్ క్రాస్, మద్య విమోచన ప్రచార కమిటీ సేవలు ప్రశంశనీయమన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. మద్యం అక్రమాల కట్టడిలో పోలీసుల పాత్ర మరింత కీలకంగా ఉండాలని లక్ష్మణరెడ్డి కోరారు. రామచంద్రరాజు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో రెడ్ క్రాస్ సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమ్మిరెడ్డికి, లక్ష్మణరెడ్డికి రెడ్ క్రాస్ తరఫున జ్ఞాపికలు బహూకరించారు. ఈ శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాతలుగా నిలిచారు. కోవిడ్ ఆపద సమయంలో సేవలందించిన వాలంటీర్లకు రెడ్ క్రాస్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు జీవైఎన్ బాబు, బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసరావు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.సుధాకర్ రెడ్డి, ఎక్సైజ్ సీఐలు తదితరులు పాల్గొన్నారు.


Comments